హ్యాక్ చేయండి.. లక్షలు పట్టుకుపోండి!
న్యూఢిల్లీ: ఇంటర్నెట్ సెర్చింజన్ దిగ్గజం గూగుల్ కంపెనీ హ్యాకర్లకు ఈ ఏడాది కూడా బంపర్ ఆఫర్ ప్రకటించింది. క్రోమ్ ఓఎస్(ఆపరేటింగ్ సిస్టమ్)తో పనిచేసే తమ బ్రౌజర్‌ను నియంత్రణలోకి తీసుకుంటే భారీ మొత్తంలో ప్రైజ్‌మనీని ఇస్తామంటూ ‘పోనియమ్ 4 హ్యాకింగ్ కాంటెస్ట్’ పేరుతో సవాల్ విసిరింది. మార్చిలో కెనడాలోని వాంకోవర్‌లో జరిగే ‘కాన్‌సెక్‌వెస్ట్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్’లో ఈ పోటీని నిర్వహిస్తారు. క్రోమ్‌ని హ్యాక్ చేసినవారికి మొత్తం 2.7 మిలియన్ డాలర్ల (రూ.16.92 కోట్లు) బహుమతులు అందజేస్తారు.
క్రోమ్‌ను గెస్ట్‌మోడ్‌లో లేదా లాగ్డ్-ఇన్ యూజర్ రూపంలో నియంత్రణలోకి తీసుకుంటే రూ.68 లక్షలు, హెచ్‌పీ, ఏసర్ క్రోమ్‌బుక్‌లను రీబూట్ తర్వాత హ్యాక్ చేస్తే రూ.94 లక్షలు అందుతాయి. గూగుల్ బ్రౌజర్‌లో లోపాలను తెలుసుకునేందుకే ఈ పోటీ నిర్వహిస్తున్నారు. ఇంతకుముందు ఇంటెల్ ఆధారిత క్రోమ్ ఓఎస్ డివైస్‌ల మీదే పోటీలు పెట్టగా.. ఈసారి ఏఆర్‌ఎం క్రోమ్ బుక్, హెచ్‌పీ క్రోమ్‌బుక్, ఏసర్ సీ720 క్రోమ్‌బుక్‌లపైనా హ్యాకింగ్‌కు అవకాశం కల్పించారు.