Google company
-
కలిసి పనిచేద్దాం..
సాక్షి, హైదరాబాద్: గూగుల్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి సంసిద్ధత వ్యక్తం చేసింది. గూగుల్ వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ తోట గురువారం సీఎం రేవంత్‌రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలపై చర్చించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రతి రంగాన్ని ప్రభావితం చేస్తోందని, రాష్ట్రం కోసం వ్యవసాయం, విద్య, ఆరోగ్యం వంటి రంగాలకు సంబంధించిన డిజిటలైజేషన్ ఎజెండాను అభివృద్ధి చేయడంలో భాగస్వాములు కావడానికి ఆసక్తిగా ఉన్నట్టు చెప్పారు. పౌరుల అవసరాలకు తగ్గట్టు నాణ్యమైన సేవలు అందించడానికి అవసరమైన సాంకేతికత, నైపుణ్యం తమ వద్ద ఉందని వివరించారు. రహదారుల భద్రత విషయంలో గూగుల్ మ్యాప్స్, గూగుల్ ఎర్త్ సేవలను వినియోగించేందుకు ఉన్న అవకాశాలపై కూడా చర్చించారు. ఈ సమావేశంలో మంత్రులు డి.శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సీఎంను కలిసిన అరుణ్‌తివారీ, చిన్నబాబు ‘వింగ్స్ ఆఫ్ ఫైర్’ పుస్తక రచయిత అరుణ్‌తివారీ, కేన్సర్ రోబోటిక్ సర్జన్ డాక్టర్ చిన్నబాబు సుంకవల్లి సీఎం రేవంత్‌రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎంతో మైక్రాన్ ప్రెసిడెంట్, సీఈఓ భేటీ ప్రపంచంలోనే అతిపెద్ద మెమొరీ చిప్‌ల తయారీ కంపెనీ మైక్రాన్టెక్నాలజీ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తే ప్రభుత్వం అన్నిరకాల సహకారాలు అందిస్తుందని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. మైక్రాన్ కంపెనీ అధ్యక్షుడు, సీఈఓ సంజయ్ మెహ్రోత్రా గురువారం సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో పెట్టుబడులకు, పరిశ్రమల స్థాపనకు అనుకూలమైన వాతావరణం ఉందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. మైక్రాన్ టెక్నాలజీ సెమీ కండక్టర్ల తయారీ రంగంలో ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద కంపెనీ. -
వెనక్కు తగ్గిన గూగుల్.. యూజర్లు డిఫాల్ట్ సెర్చి ఇంజిన్ ఎంచుకోవచ్చు
న్యూఢిల్లీ: ఆండ్రాయిడ్‌కి సంబంధించి గుత్తాధిపత్యం కేసులో కాంపిటీషన్ కమిషన్ (సీసీఐ) విధించిన జరిమానాపై ఊరట లభించకపోవడంతో టెక్ దిగ్గజం గూగుల్ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్ఫోన్లలో డిఫాల్ట్ సెర్చి ఇంజిన్‌ను ఎంచుకోవడానికి భారత యూజర్లకు అవకాశం కల్పిస్తామని తెలిపింది. అలాగే ప్రత్యామ్నాయ బిల్లింగ్ సిస్టమ్‌ను కూడా ఎంచుకునే ఆప్షన్ కూడా వచ్చే నెల నుంచి కల్పించనున్నట్లు పేర్కొంది. స్థానిక చట్టాలకు కట్టుబడి వ్యవహరించడానికి తాము కట్టుబడి ఉన్నామని గూగుల్ స్పష్టం చేసింది. గూగుల్ తన ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలకు లైసెన్సుకు ఇస్తుంది. అయితే, తన సొంత యాప్స్‌ను ముందస్తుగా ఇన్స్టాల్ చేయాలనే షరతు కూడా విధిస్తుంటుంది. ఇలాంటి ధోరణులు పోటీ సంస్థలను దెబ్బతీయడమే అవుతుందంటూ సీసీఐ ఆండ్రాయిడ్ కేసులో రూ. 1,338 కోట్లు, ప్లే స్టోర్ కేసులో రూ. 936 కోట్లు గూగుల్‌కు జరిమానా విధించింది. వీటిపై స్టే విధించాలంటూ గూగుల్ సుప్రీం కోర్టుకు వెళ్లినా ఊరట లభించలేదు. చదవండి: Union Budget 2023: కేంద్రం శుభవార్త.. రైతులకు ఇస్తున్న సాయం పెంచనుందా! -
గూగుల్‌కు నర్సీపట్నం యువకుడి ఎంపిక.. భారీ వేతనం!
విశాఖపట్నం: స్థానిక వెలమ వీధికి చెందిన జయంతి విష్ణు యాష్ భారీ వేతనంతో సాఫ్ట్వేర్ కొలువుకు ఎంపికయ్యాడు. విష్ణు హిమచల్‌ప్రదేశ్ ఎన్ఐటీలో బీటెక్ పూర్తి చేసిన అనంతరం యాక్సించర్ కంపెనీకి రూ.8.50 లక్షల వేతనంతో ఎంపికయ్యాడు. తాజాగా బెంగళూరులో ఉన్న గూగుల్ సంస్థ రూ.47.50 లక్షలు వార్షిక వేతనంతో విష్ణును ఎంపిక చేసింది. విష్ణు తండ్రి సత్యనారాయణమూర్తి రిటైర్డ్ వార్డెన్, తల్లి వేదవల్లి గృహిణి, కుమారుడు గూగుల్ సంస్థకు ఎంపిక కావటం పట్ల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. -
దరఖాస్తు చేయకుండానే ముంబైకర్‌కు రూ.1.2 కోట్ల వేతనం
ముంబై: ఐఐటీ(ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ)ల్లో చదివి ప్రఖ్యాత సంస్థల్లో రూ.కోట్ల వేతనాల కొలువులు పొందడం చూశాం. కానీ, అబ్దుల్లా ఖాన్(21) విషయం వేరు. ముంబైకి చెందిన ఈ ఇంజినీరింగ్ విద్యార్థి ఏడాదికి రూ.1.2 కోట్ల వేతనంతో గూగుల్ సంస్థలో ఉద్యోగంలో చేరబోతున్నాడు..! ఆ ఉద్యోగానికి దరఖాస్తు చేయకుండానే ఈ ఘనత సాధించాడు. అదెలా? సౌదీ అరేబియాలో పాఠశాల విద్య పూర్తి చేసుకున్న అబ్దుల్లా ఖాన్ ముంబైకి వచ్చి ఐఐటీలో చేరేందుకు తీవ్రంగా ప్రయత్నించి విఫలమయ్యాడు. దీంతో ముంబై మీరా రోడ్డులో ఉన్న శ్రీ ఎల్ఆర్ తివారీ ఇంజినీరింగ్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశాడు. కంప్యూటర్ కోడింగ్ అంటే ఇష్టపడే అబ్దుల్లా.. ఉద్యోగం కోసమని కాకుండా, యథాలాపంగా గూగుల్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ పోటీల్లో పాల్గొనేందుకు తన ప్రొఫైల్ ఉంచాడు. దీనిని చూసి ఇంప్రెస్ అయిన గూగుల్ అధికారులు ఇంటర్వ్యూకు రమ్మంటూ మెయిల్ పంపారు. మొదట్లో దీనిని అబ్దుల్లా నమ్మలేదు. ఇలాంటి మెయిల్ తన స్నేహితుడి పరిచయస్తునికి కూడా రావడంతో వివరాలు తెలుసుకున్నాడు. అనంతరం పలు విడతలుగా జరిగిన ఇంటర్వ్యూల్లో అబ్దుల్లా విజేతగా నిలిచాడు. దీంతోపాటు మార్చి మొదటి వారంలో లండన్‌లో జరిగిన ఫైనల్ స్క్రీనింగ్ టెస్ట్‌లోనూ పాసయ్యాడు. దీంతో, సెప్టెంబర్‌లో లండన్‌లోని గూగుల్ కార్యాలయంలో ‘రిలయబిలిటీ ఇంజినీరింగ్ టీం’ సభ్యునిగా ఉద్యోగంలో జాయిన్ కావాలంటూ గూగుల్ నుంచి అబ్దుల్లాకు పిలుపొచ్చింది. ఏడాది వేతనం రూ.54.5 లక్షలు కాగా కంపెనీ బోనస్‌లో 15 శాతం, నాలుగేళ్లకు కలిపి రూ.58.9 లక్షల విలువైన కంపెనీ షేర్లు అతడికి అందుతాయి. ఇవన్నీ కలిపితే ఏడాదికి అతడికి అందే మొత్తం సుమారు రూ.1.2 కోట్లు అవుతుంది. రూ.2 కోట్ల స్కాలర్షిప్ అమెరికాలోని ప్రఖ్యాత బోస్టన్ యూనివర్సిటీలో చదివేందుకు నోయిడాకు చెందిన ఆర్నవ్ మిశ్రా అనే విద్యార్థి ఎంపికయ్యాడు. బోస్టన్ వర్సిటీ ట్రస్టీ స్కాలర్‌షిప్‌పై చదివేందుకు ప్రపంచవ్యాప్తంగా ఎంపికైన 20 మందిలో భారత్‌కు చెందిన ఏకైక విద్యార్థి మిశ్రా కావడం గమనార్హం. ట్రస్టీ స్కాలర్ షిప్ ఎంపిక పరీక్షలో 1,600 మార్కులకు గాను 1,500 మార్కులు, యూనివర్సిటీ స్కాలర్ షిప్ ఎంపిక పరీక్షలో 99 శాతం మార్కులు మిశ్రా సాధించాడు. దీంతో అతడు నాలుగేళ్లకు కలిపి దాదాపు రూ.2 కోట్ల మేర ఉపకార వేతనానికి ఎంపికయ్యాడు. -
స్త్రీలోక సంచారం
►‘ఆడవాళ్లకు బయటికి వెళ్లి పని చేయవలసిన అవసరం ఏమిటి?’ అనే వ్యంగ్య, హాస్య కథాంశంతో ‘అఫ్గానిస్తాన్ టీవీ’లో ‘రోయా’ అనే ఒక స్త్రీవాద సీరియల్ ఈ నెలలో మొదలవుతోంది. యు.ఎస్.లో వీక్షకాదరణ పొందిన ‘అగ్లీ బెట్టీ’ సీరీస్లానే ఈ ‘రోయా’ సీరియల్లో.. ఆడవాళ్లు ఉద్యోగం చేయవలసిన అవసరాన్ని.. ‘ఆడవాళ్లు ఉద్యోగం చేయవలసిన అవసరం ఏమిటి?’ అనే సంప్రదాయవాదుల కోణంలో నరుక్కొస్తూ సరదా సన్నివేశాలతో ఆలోచన రేకెత్తించేలా చిత్రీకరిస్తున్నారు. ►ఈరోజు (గురువారం) యు.ఎస్.లోని గూగుల్ కంపెనీలో పని చేస్తున్న 200 మంది మహిళా ఇంజనీర్లు వాకౌట్ చేయబోతున్నారు! గూగుల్ పూర్వపు ఉద్యోగి, ఆండ్రాయిడ్ సృష్టికర్త అయిన ఆండీ రూబిన్ 2013లో ఒక హోటల్ గదిలో తన కోరిక తీర్చమని తనను వేధించినట్లు గూగుల్ కంపెనీ మహిళా ఉద్యోగి ఒకరు ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ జరిపిన అనంతరం ఆండీ రూబిన్ను తొలగిస్తూ గూగుల్ అతడికి 90 మిలియన్ డాలర్ల పరిహారాన్ని (665 కోట్ల 75 లక్షల 25 వేల రూపాయలు) ఇచ్చి పంపిందని ‘న్యూయార్క్ టైమ్స్’ గత వారం ప్రచురించిన వార్తకు ఉలిక్కిపడిన గూగుల్ మహిళా సిబ్బంది.. లైంగిక దుష్ప్రవర్తన కలిగిన వ్యక్తికి ఇంత డబ్బు ఇవ్వడమేంటని.. వాకౌట్ ద్వారా తమ నిరసనను వ్యక్తం చేయదలచుకున్నారు. ►రేపటి తరం పురుషులు స్త్రీల పట్ల మర్యాదస్తులుగా మెసులుకోవాలంటే.. వారిని ఇప్పట్నుంచే (బాలురుగా ఉన్నప్పట్నుంచే) తల్లిదండ్రులు.. స్త్రీలు ఎందులోనూ, ఏ మాత్రం తక్కువ కాదన్న స్పృహతో సహానుభూతితో, సంస్కారవంతులుగా పెంచాలని ‘ది గార్డియన్’ సైట్‌కు రాసిన తాజా వ్యాసంలో ప్రముఖ మహిళా జర్నలిస్టు సైమా మిర్ సూచించారు. ►గత ఏడాది ఏప్రిల్‌లో మరణించిన ప్రసిద్ధ ఇంగ్లండ్ రచయిత్రి, కవయిత్రి, ‘ది లిటరరీ కన్సల్టెన్సీ’ వ్యవస్థాపకురాలు రెబెక్కా స్విఫ్ట్ స్మృత్యర్థం ప్రారంభమైన ‘ఉమెన్ పొయెట్స్ ప్రైజ్’ కు తొలి ఏడాది విజేతలుగా క్లెయిర్ కాలిసన్, నినా మింగ్యా పావెల్స్, అనితా పతి ఎంపికయ్యారు. స్త్రీ సాధికారత అంశాలపై సృజనాత్మకమైన ప్రతిభ కనబరుస్తున్న కవయిత్రులకు ఈ అవార్డు ఇస్తారు. -
హ్యాపీ బర్త్ డే గూగుల్
సాక్షి, హైదరాబాద్: కోటానుకోట్ల సెర్చ్ పేజీలు.. లెక్కకు మించిన అప్లికేషన్లు.. వందల కోట్ల సంఖ్యలో వినియోగదారులు... లక్షల కోట్ల డాలర్ల టర్నోవర్...ఇలా చెప్పుకుంటూ పోతే సాఫ్ట్వేర్ దిగ్గజ సంస్థ గూగుల్ గురించి చాలానే ఉంది. 1998 లో లారీ పేజ్, సెర్జీ బ్రిన్ లు స్థాపించిన గూగుల్ నేడు సాఫ్ట్వేర్ రంగంలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆ కంపెనీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గూగుల్ గురించి ఇప్పుడిదంతా ఎందుకంటే.. ఈ రోజు ఆ సంస్థ బర్త్ డే మరి..! లారీ పేజ్, సెర్జీ బ్రిన్ లలో ఎవరూ కూడా తాము గూగుల్‌ను స్థాపించిన తేదీని గుర్తు పెట్టుకోలేదు. ఫలితంగా దాని వ్యవస్థాపక దినోత్సవాన్ని మొదట్లో సెప్టెంబర్ 26, సెప్టెంబర్ 7, సెప్టెంబర్ 8 తేదీల్లో జరిపేవారు. ఇక గూగుల్‌కు చెందిన వికీ పేజ్‌లో చూస్తే దాని వ్యవస్థాపక దినోత్సవం సెప్టెంబర్ 4, 1998 అని ఉంటుంది. ఈ క్రమంలో ఒక నిర్దిష్ట తేదీ నాడే గూగుల్ బర్త్ డే జరపాలని ఆ కంపెనీ యాజమాన్యం నిర్ణయించింది. దీంతో 2006 నుంచి సెప్టెంబర్ 27వ తేదీన గూగుల్ బర్త్ డేను నిర్వహిస్తూ వస్తున్నారు. కాగా గూగుల్ 19వ పుట్టిన రోజు సందర్భంగా గూగుల్ హోం పేజీలో ప్రత్యేక డ్యూడుల్ దర్శనమిచ్చింది. ప్రముఖుల పుట్టిన రోజులు, ప్రత్యేక సందర్భాల్లో నూతన డూడుల్స్ ఏర్పాటు చేసే గూగుల్ తన 19వ పుట్టిన రోజు సందర్భంగా సరికొత్త డూడుల్ రూపొందించింది. బర్త్‌డే కేక్, బెలూన్స్, గిఫ్ట్స్‌తో డూడుల్ సిద్ధం చేయడంతో పాటు సర్ప్రైజ్ స్పిన్నర్‌ను ఏర్పాటు చేసింది. స్పిన్నర్ ను క్లిక్ చేస్తే 19 రకాల డూడుల్ గేమ్స్ దర్శనమిస్తాయి. -
గూగుల్ తల్లికి ఈ రోజు వెరీ స్పెషల్
-
గూగుల్ తల్లికి ఈ రోజు వెరీ స్పెషల్
ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్‌కు సెప్టెంబర్ 27వ తేదీ చాలా ప్రత్యేకమైనది. ఈ రోజు గూగుల్ కంపెనీ 18వ బర్త్ డే. ఈ సందర్భంగా గూగుల్ హోం పేజీలో ప్రత్యేక డ్యూడుల్ దర్శనమిచ్చింది. గాల్లో బెలూన్లు వేలాడుతున్నట్టుగా.. జీ ఫర్ గూగుల్ అనే అక్షరాలతో బర్త్ డే సెలెబ్రేట్ చేసుకుంటున్నట్టు డ్యూడుల్ను రూపొందించారు. 1998 సెప్టెంబర్‌లో లారీ పేజ్, సెర్జీ బ్రిన్.. గూగుల్‌ను స్థాపించారు. కాగా కంపెనీని ఏ తేదీన స్థాపించారన్న విషయంపై స్పష్టత లేదు. పేజ్, బ్రిన్ సహా ఎవరూ వ్యవస్థాపక దినాన్ని గుర్తుపెట్టుకోలేదు. దీంతో గూగుల్ కంపెనీ ఆరు వేర్వేరు తేదీల్లో బర్త్ డే జరుపుకొంది. మొదట్లో సెప్టెంబర్ 26, సెప్టెంబర్ 7, సెప్టెంబర్ 8న బర్త్ డే చేసుకున్నారు. గూగుల్ హిస్టరీ లిస్ట్‌లో వ్యవస్థాపకం దినం సెప్టెంబర్ 4 అని ఉంది. 2006 నుంచి మాత్రం సెప్టెంబర్ 27వ తేదీన బర్త్ డే నిర్వహించాలని యాజమాన్యం నిర్ణయించింది. -
ఫొటోతోనే కేలరీలు లెక్కించే యాప్
వాషింగ్టన్: ఫొటోలోని ఆహారపదార్థాలను స్కాన్ చేసి అందులో కేలరీల సంఖ్యను చెప్పే యాప్‌ను గూగుల్ సంస్థ రూపొందించింది. ‘ఐఎం2 కేలరీస్’ అనే పేరుతో రూపొందించిన ఈ యాప్ ఇమేజ్ ప్రాసెసింగ్ టెక్నాలజీతో ఆహారపదార్థాలను గుర్తిస్తుంది. ఒకవేళ ఈ యాప్ ఫుడ్‌ఐటమ్స్‌ను గుర్తించలేకపోతే వినియోగదారులు సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేసుకునే వీలు కల్పించింది. దీంతో ఈ యాప్ మరింత మెరుగుపడే అవకాశముంటుందని సంస్థ పేర్కొంటోంది. ఇటీవలే దీని పేటెంట్ హక్కుల కోసం గూగుల్ దరఖాస్తు చేసుకుంది. అయితే ఇది అందుబాటులోకి రావడానికి మరింత సమయం పట్టొచ్చని చెబుతున్నారు. ఈ యాప్ విజయవంతమైతే ట్రాఫిక్ విశ్లేషణ, పార్కింగ్ ప్రదేశాలు ఎక్కడున్నాయనే సమాచారాన్ని అందించేలా మార్పులు చేయాలని చూస్తున్నారు. -
గూగుల్ డూడుల్ పోటీ విజేత వైదేహి రెడ్డి
న్యూఢిల్లీ: ఇంటర్నెట్ సెర్చింజన్ దిగ్గజం గూగుల్ కంపెనీ నిర్వహించిన ‘డూడుల్4గూగుల్’ పోటీలో పుణే విద్యార్థిని వైదేహి రెడ్డి విజేతగా నిలిచింది. పుణేలోని ఆర్మీ పబ్లిక్ స్కూల్లో చదువుతున్న వైదేహి ‘సహజ, సాంస్కృతిక స్వర్గం- అస్సాం’ పేరుతో డూడుల్‌ను రూపొందించి ఈ పోటీలో విజయం సాధించింది. గూగుల్ హోం పేజీలో ప్రత్యేక సందర్భానికి అనుగుణంగా బొమ్మలతో రూపొందించే ‘గూగుల్’ లోగోను డూడుల్‌గా పిలుస్తారు. ‘భారత్‌లో నేను చూడాలనుకుంటున్న ప్రదేశం’ అనే కాన్సెప్ట్‌తో డూడుల్‌ను రూపొందించాలని ఈ ఏడాది 50 పట్టణాల్లోని 1700 స్కూళ్లలో డూడుల్ పోటీ నిర్వహించగా 12 మంది విద్యార్థులు ఫైనల్‌కు చేరుకున్నారు. ఈ పోటీకి ఏకంగా పది లక్షల ఎంట్రీలు రావడం విశేషమని కంపెనీ వర్గాలు తెలిపాయి. -
జీమెయిల్ ఇన్‌బాక్స్...
భలే ఆప్స్ గూగుల్ కంపెనీ తాజాగా సిద్ధం చేసిన సరికొత్త ఈమెయిల్ అనుభూతి ఈ ఇన్‌బాక్స్ అప్లికేషన్. జీమెయిల్‌తోపాటు ఇతర అకౌంట్లతోనూ పనిచేసుకోగల సౌకర్యం కల్పిస్తుంది ఇది. స్మార్ట్ఫోన్లలో జీమెయిల్ అప్లికేషన్ స్థానంలో దీన్ని ఉపయోగించవచ్చు. అయితే ప్రస్తుతానికి ఇది కేవలం ఆహ్వానాల ద్వారా మాత్రమే అందుబాటులో ఉంది. మీ మిత్రుల్లో ఎవరికైనా ఆహ్వానం అందిఉంటే వారి నుంచి ఇన్‌బాక్స్ ఇన్వైట్‌ను అందుకోవచ్చు. లేదంటే నేరుగా జీమెయిల్‌కే ఓ మెయిల్ పెట్టాల్సి ఉంటుంది. ఈ కొత్త అప్లికేషన్ ద్వారా జీమెయిల్ మరిన్ని అదనపు ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది. ఇన్‌బాక్స్ స్క్రీన్ డిజైన్‌లో కొన్ని మార్పులు చేయడంతోపాటు స్క్రీన్ పైభాగంలో కుడివైపున మీ ఫొటో కనిపించే చోట ఓ డ్రాప్‌డౌన్ మెనూను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా చదవని మెయిళ్లు స్పష్టమైన అక్షరాలతో కనిపించేలా... మిగిలినవి కొంచెం మసకబారిన చందంగా చేశారు. కొత్త మెయిల్‌ను కంపోజ్ చేసుకునేందుకు ఉద్దేశించిన బటన్ స్క్రీన్ అడుగుభాగంలో తేలియాడుతున్నట్లు ఓ పెన్ ఐకాన్‌తో ఏర్పాటు చేయడం విశేషం. యాహూ, ఔట్లుక్, ఏఓఎల్, తదితర ఐఎంఏపీ/పీఓపీ ఆధారిత మెయిల్ అకౌంట్లన్నింటినీ దీనికి అనుసంధానించుకునే అవకాశం ఉండటం మరో గమనించదగ్గ మార్పు. ఒక పేజీ వెబ్సైట్లకు టాక్... నెట్లో ఒక పేజీ మాత్రమే ఉండే వెబ్సైట్లను సిద్ధం చేసేందుకు ఉద్దేశించింది ఈ అప్లికేషన్. ఒక పేజీకి మించని సమాచారాన్ని అందమైన డిజైన్లను ఉపయోగించి ప్యాక్ చేయడంతోపాటు పబ్లిక్గానైనా, ప్రైవేట్‌గానైనా ఇతరులతో పంచుకోగలగడం దీని ప్రత్యేకతలు. ఇతరులు షేర్ చేసుకుని టాక్ వెబ్సైట్లను బ్రౌజ్ చేయగలగడం, మీ అభిరుచులకు సరిపోయే ఇతర వెబ్సైట్లను ఫాలో కావచ్చు కూడా. అంతేకాకుండా ఈ వెబ్సైట్లు కొలాబరేటివ్గానూ పనిచేస్తాయి. అంటే మీరే ఏదైనా ఒక సంభాషణను మొదలుపెట్టవచ్చు. లేదా ఇతరుల వెబ్సైట్లకు మీరు సమాచారం అందించవచ్చు కూడా. ప్రస్తుతానికి ఈ అప్లికేషన్ ఆపిల్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. కెమెరా 51.... స్మార్ట్ఫోన్లు వచ్చిన తరువాత కెమెరాలకు కాలం చెల్లిందన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ ఫోన్లతో తీసే ఫొటోలేవీ అంత ప్రొఫెషనల్‌గా ఉండవన్నదీ నిష్టుర సత్యం. ఈ సమస్యను అధిగమించాలనుకుంటున్నారా? అయితే కెమెరా 51 అప్లికేషన్‌ను డౌన్లోడ్ చేసేసుకోండి. గూగుల్ ప్లేలో ఉచితంగా లభించే ఈ అప్లికేషన్ ప్రత్యేకమైన అల్గారిథమ్‌ల ద్వారా మీరు తీసే ఫొటోల్లోని లోపాలను కొన్నింటినైనా సవరిస్తుంది. స్మార్ట్‌ఫోన్ కెమెరాను ఏ కోణంలో పట్టుకోవాలన్న అంశం మొదలుకొని ఎప్పుడు క్లిక్ చేయాలన్న విషయం వరకూ అనేక అంశాల్లో సలహాలు ఇచ్చే ఈ అప్లికేషన్‌తో ఓ చిన్న చిక్కూ ఉంది. రకరకాల కంప్యూటేషన్లు చేస్తూంటుంది కాబట్టి ప్రాసెసర్ సామర్థ్యంలో ఎక్కువ భాగం వాడేస్తూంటుంది ఈ అప్లికేషన్. మీ స్మార్ట్‌ఫోన్ ప్రాసెసర్ సామర్థ్యానికి అనుగుణంగా ఈ అప్లికేషన్ వాడకంపై ఒక నిర్ణయం తీసుకుంటే మేలు. -
దృష్టి లోపాలున్నా ‘గూగుల్ చూపు’
న్యూయార్క్: ప్రపంచాన్ని మన ‘కళ్ల’ముందు ఉంచేలా సెర్చ్ఇంజిన్ దిగ్గజం గూగుల్ కంపెనీ అభివృద్ధి చేస్తున్న గూగుల్ గ్లాస్ మరిన్ని హంగులతో మన ముందుకు రాబోతుంది. దృష్టిలోపాలకు అనుగుణంగా, మనకు నచ్చే ఆకృతిలో కంటిఅద్ధాలను తయారు చేయనున్నట్లు గూగుల్ ప్రకటించింది. ఇంకా పరీక్ష దశలోనే ఉన్న గూగుల్ గ్లాస్ ఈ ఏడాది చివరిలోపు మార్కెట్లోకి విడుదలకానుంది. సరికొత్త హంగులతో, మనకునచ్చే రీతిలో లభించే వీటి ధర సుమారు రూ.14,000 ఉంటుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. -
హ్యాక్ చేయండి.. లక్షలు పట్టుకుపోండి!
న్యూఢిల్లీ: ఇంటర్నెట్ సెర్చింజన్ దిగ్గజం గూగుల్ కంపెనీ హ్యాకర్లకు ఈ ఏడాది కూడా బంపర్ ఆఫర్ ప్రకటించింది. క్రోమ్ ఓఎస్(ఆపరేటింగ్ సిస్టమ్)తో పనిచేసే తమ బ్రౌజర్‌ను నియంత్రణలోకి తీసుకుంటే భారీ మొత్తంలో ప్రైజ్‌మనీని ఇస్తామంటూ ‘పోనియమ్ 4 హ్యాకింగ్ కాంటెస్ట్’ పేరుతో సవాల్ విసిరింది. మార్చిలో కెనడాలోని వాంకోవర్‌లో జరిగే ‘కాన్సెక్వెస్ట్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్’లో ఈ పోటీని నిర్వహిస్తారు. క్రోమ్‌ని హ్యాక్ చేసినవారికి మొత్తం 2.7 మిలియన్ డాలర్ల (రూ.16.92 కోట్లు) బహుమతులు అందజేస్తారు. క్రోమ్‌ను గెస్ట్మోడ్లో లేదా లాగ్డ్-ఇన్ యూజర్ రూపంలో నియంత్రణలోకి తీసుకుంటే రూ.68 లక్షలు, హెచ్‌పీ, ఏసర్ క్రోమ్‌బుక్‌లను రీబూట్ తర్వాత హ్యాక్ చేస్తే రూ.94 లక్షలు అందుతాయి. గూగుల్ బ్రౌజర్లో లోపాలను తెలుసుకునేందుకే ఈ పోటీ నిర్వహిస్తున్నారు. ఇంతకుముందు ఇంటెల్ ఆధారిత క్రోమ్ ఓఎస్ డివైస్ల మీదే పోటీలు పెట్టగా.. ఈసారి ఏఆర్ఎం క్రోమ్ బుక్, హెచ్‌పీ క్రోమ్‌బుక్, ఏసర్ సీ720 క్రోమ్బుక్లపైనా హ్యాకింగ్‌కు అవకాశం కల్పించారు. -
రోడ్డు ప్రమాదంలో ‘గూగుల్’ ఉద్యోగిని దుర్మరణం
రాప్తాడు, న్యూస్‌లైన్ : మరూరు వద్ద 44వ జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో ‘గూగుల్’ కంపెనీ ఉద్యోగిని దుర్మరణం చెందింది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు... తిరుపతిలోని ఎన్జీవో కాలనీకి చెందిన సుదర్శిని (30) హైదరాబాద్‌లో గూగుల్ కంపెనీలో పని చేస్తోంది. తోటి ఉద్యోగి థామస్‌జాన్‌తో కలిసి కంపెనీ పనిపై ఇటీవల కేరళకు వెళ్లారు. అక్కడ పని ముగించుకుని బుధవారం బెంగళూరు చేరుకున్నారు. అక్కడి నుంచి హైదరాబాద్‌కు కారులో బయల్దేరారు. మరూరు వద్దకు రాగానే టైరు పంక్చర్ కావడంతో వేగంలో అదుపుతప్పి కుడి వైపునకు తిరిగి డివైడర్‌ను ఢీకొంది. ముందుభాగంలో ఎడమవైపు సీట్లో కూర్చున్న సుదర్శినికి డివైడర్ ఇనుపచువ్వలు తగిలి తల నుజ్జునుజ్జయ్యి అక్కడికక్కడే మృతిచెందింది. డ్రైవింగ్ చేస్తున్న థామస్‌జాన్‌కు ఎటువంటి గాయాలూ కాలేదు. మృతురాలికి ఒక కూతరు ఉంది. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనంతపురం సర్వజనాస్పత్రికి తరలించారు. ఎస్ఐ తమీమ్ అహమ్మద్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.