►‘ఆడవాళ్లకు బయటికి వెళ్లి పని చేయవలసిన అవసరం ఏమిటి?’ అనే వ్యంగ్య, హాస్య కథాంశంతో ‘అఫ్గానిస్తాన్ టీవీ’లో ‘రోయా’ అనే ఒక స్త్రీవాద సీరియల్ ఈ నెలలో మొదలవుతోంది. యు.ఎస్.లో వీక్షకాదరణ పొందిన ‘అగ్లీ బెట్టీ’ సీరీస్‌లానే ఈ ‘రోయా’ సీరియల్‌లో.. ఆడవాళ్లు ఉద్యోగం చేయవలసిన అవసరాన్ని.. ‘ఆడవాళ్లు ఉద్యోగం చేయవలసిన అవసరం ఏమిటి?’ అనే సంప్రదాయవాదుల కోణంలో నరుక్కొస్తూ సరదా సన్నివేశాలతో ఆలోచన రేకెత్తించేలా చిత్రీకరిస్తున్నారు.
►ఈరోజు (గురువారం) యు.ఎస్.లోని గూగుల్ కంపెనీలో పని చేస్తున్న 200 మంది మహిళా ఇంజనీర్లు వాకౌట్ చేయబోతున్నారు! గూగుల్ పూర్వపు ఉద్యోగి, ఆండ్రాయిడ్ సృష్టికర్త అయిన ఆండీ రూబిన్ 2013లో ఒక హోటల్ గదిలో తన కోరిక తీర్చమని తనను వేధించినట్లు గూగుల్ కంపెనీ మహిళా ఉద్యోగి ఒకరు ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ జరిపిన అనంతరం ఆండీ రూబిన్‌ను తొలగిస్తూ గూగుల్ అతడికి 90 మిలియన్ డాలర్ల పరిహారాన్ని (665 కోట్ల 75 లక్షల 25 వేల రూపాయలు) ఇచ్చి పంపిందని ‘న్యూయార్క్ టైమ్స్’ గత వారం ప్రచురించిన వార్తకు ఉలిక్కిపడిన గూగుల్ మహిళా సిబ్బంది.. లైంగిక దుష్ప్రవర్తన కలిగిన వ్యక్తికి ఇంత డబ్బు ఇవ్వడమేంటని.. వాకౌట్ ద్వారా తమ నిరసనను వ్యక్తం చేయదలచుకున్నారు.
►రేపటి తరం పురుషులు స్త్రీల పట్ల మర్యాదస్తులుగా మెసులుకోవాలంటే.. వారిని ఇప్పట్నుంచే (బాలురుగా ఉన్నప్పట్నుంచే) తల్లిదండ్రులు.. స్త్రీలు ఎందులోనూ, ఏ మాత్రం తక్కువ కాదన్న స్పృహతో సహానుభూతితో, సంస్కారవంతులుగా పెంచాలని ‘ది గార్డియన్’ సైట్‌కు రాసిన తాజా వ్యాసంలో ప్రముఖ మహిళా జర్నలిస్టు సైమా మిర్ సూచించారు.
►గత ఏడాది ఏప్రిల్‌లో మరణించిన ప్రసిద్ధ ఇంగ్లండ్ రచయిత్రి, కవయిత్రి, ‘ది లిటరరీ కన్సల్టెన్సీ’ వ్యవస్థాపకురాలు రెబెక్కా స్విఫ్ట్ స్మృత్యర్థం ప్రారంభమైన ‘ఉమెన్ పొయెట్స్ ప్రైజ్’ కు తొలి ఏడాది విజేతలుగా క్లెయిర్ కాలిసన్, నినా మింగ్యా పావెల్స్, అనితా పతి ఎంపికయ్యారు. స్త్రీ సాధికారత అంశాలపై సృజనాత్మకమైన ప్రతిభ కనబరుస్తున్న కవయిత్రులకు ఈ అవార్డు ఇస్తారు.
Comments
Please login to add a commentAdd a comment