న్యూఢిల్లీ: ఇంటర్నెట్ సెర్చింజన్ దిగ్గజం గూగుల్ కంపెనీ నిర్వహించిన ‘డూడుల్4గూగుల్’ పోటీలో పుణే విద్యార్థిని వైదేహి రెడ్డి విజేతగా నిలిచింది. పుణేలోని ఆర్మీ పబ్లిక్ స్కూల్‌లో చదువుతున్న వైదేహి ‘సహజ, సాంస్కృతిక స్వర్గం- అస్సాం’ పేరుతో డూడుల్‌ను రూపొందించి ఈ పోటీలో విజయం సాధించింది. గూగుల్ హోం పేజీలో ప్రత్యేక సందర్భానికి అనుగుణంగా బొమ్మలతో రూపొందించే ‘గూగుల్’ లోగోను డూడుల్‌గా పిలుస్తారు. ‘భారత్‌లో నేను చూడాలనుకుంటున్న ప్రదేశం’ అనే కాన్సెప్ట్‌తో డూడుల్‌ను రూపొందించాలని ఈ ఏడాది 50 పట్టణాల్లోని 1700 స్కూళ్లలో డూడుల్ పోటీ నిర్వహించగా 12 మంది విద్యార్థులు ఫైనల్‌కు చేరుకున్నారు. ఈ పోటీకి ఏకంగా పది లక్షల ఎంట్రీలు రావడం విశేషమని కంపెనీ వర్గాలు తెలిపాయి.