యాహూ! సరికొత్తగా... | Yahoo Rebranding and new features | Sakshi
Sakshi News home page

యాహూ! సరికొత్తగా...

Published Tue, Dec 3 2019 5:29 AM | Last Updated on Tue, Dec 3 2019 5:29 AM

Yahoo Rebranding and new features - Sakshi

ఒకప్పుడు ఇంటర్నెట్‌ సెర్చి ఇంజిన్‌గా, ఈ–మెయిల్‌కు పర్యాయపదంగా వెలిగిన యాహూ ఆ తర్వాత మిగతా సంస్థల నుంచి పోటీ ని తట్టుకోలేక వెనుకబడిపోయింది. అయితే, పూ ర్వ వైభవాన్ని సంపాదించుకునేందుకు యాహూ మెయిల్‌ తాజాగా ప్రయత్నాల్లో ఉంది. ఇందులో భాగంగా సరికొత్త ఫీచర్స్‌తో  పాటు మొబైల్‌ యాప్‌ను రీబ్రాండింగ్‌ చేయడం ద్వారా యూజర్లను ఆకర్షించేందుకు కసరత్తు చేస్తోంది. పోటీ సంస్థలు గూగుల్‌కి చెందిన జీమెయిల్, మైక్రోసాఫ్ట్‌ అవుట్‌లుక్‌ వంటివి తమ యాప్స్‌ను ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లు, సర్వీసులతో రీ–బ్రాండ్‌ చేసుకుంటూనే ఉన్న నేపథ్యంలో యాహూ తాజా ప్రయత్నాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.  

22 కోట్ల మంది యూజర్లు..
యాహూ మెయిల్‌కు ప్రపంచవ్యాప్తంగా 22.76 మిలియన్ల మంది నెలవారీ యూజర్లు ఉన్నారు. మొబైల్‌ ఫోన్లు, ట్యాబ్లెట్‌ పీసీలు, కంప్యూటర్స్‌ మొదలైన వివిధ డివైజ్‌ల ద్వారా వీరిలో చాలా మంది ఈమెయిల్‌ సర్వీసులు ఉపయోగించుకుంటున్నారు. మొత్తం యూజర్లలో ప్రతి నెలా 7.5 కోట్ల మంది యూజర్లు కేవలం తమ మొబైల్స్, ట్యాబ్లెట్స్‌ ద్వారానే యాహూ మెయిల్‌ను ఉపయో గిస్తున్నారు. యాహూ మెయిల్‌ వినియోగదారుల్లో 60 శాతం మంది అమెరికాయేతర దేశాలవారే. ప్రస్తుతం ఉన్న యూజర్లు మరో ఈమెయిల్‌ సేవల సంస్థ వైపు మళ్లకుండా తమవద్దే అట్టే పెట్టుకునే దిశగా కొత్త మొబైల్‌ యాప్‌ ఫీచర్స్‌ను తీర్చిదిద్దినట్లు సంస్థ వర్గాలు తెలిపాయి. దీంతో పాటు భారత్‌లో తెలుగు, తమిళం, కన్నడం, హిందీ, గుజ రాతీ, బెంగాలీ, మరాఠీ వంటి ఏడు ప్రాంతీయ భాషల్లో సేవలు అందిస్తున్నట్లు వివరించాయి.

కొత్త ఫీచర్స్‌లో కొన్ని ..
అన్నింటికన్నా ప్రధానంగా మిగతా సంస్థలతో పోలిస్తే యాహూ మెయిల్‌ అత్యధికంగా 1 టెరాబైట్‌ (టీబీ) స్టోరేజీ స్పేస్‌ అందిస్తోంది. సుమారు 250–300 సినిమాలకు సరిపడేంత స్టోరేజీ ఇది. పోటీ సంస్థ జీమెయిల్‌ కేవలం 15 జీబీ స్టోరేజీ ఇస్తోంది. ఈ పరిమితి దాటితే.. అప్పటికే ఉన్న మెయిల్స్‌ కొన్నింటిని డిలీట్‌ చేసుకుని.. ఆ మేరకు పెరిగిన స్పేస్‌ను వాడుకోవాల్సి ఉంటోంది. లేదా నెలవారీ కొంత మొత్తం చెల్లించి అదనంగా స్టోరేజీ స్పేస్‌ కొనుక్కోవాల్సి వస్తోంది. ఇక, ఇన్‌బాక్స్‌లో స్పామ్‌ బాదరబందీ లేకుండా కాంటాక్ట్స్‌ నుంచి వచ్చే మెయిల్సే కనిపించేలా .. యాహూ మెయిల్‌ యూజర్లు..‘పీపుల్‌ వ్యూ’ పేరిట మరో కొత్త ఫీచర్‌ వినియోగించుకోవచ్చు. పీపుల్, ట్రావెల్, రిసీట్స్‌ వంటి మూడు కేటగిరీల్లో కింద మెయిల్స్‌ను విడగొట్టుకోవచ్చు. ఇవే కాకుండా పలు రకాల ఫిల్టర్స్, అటాచ్‌మెంట్‌ ఆప్షన్లు మొదలైనవి ఇందులో ఉన్నాయి. మిగతా ఈ–మెయిల్‌ సర్వీస్‌ ప్రొవైడర్స్‌ తరహాలోనే బహుళ ఈ–మెయిల్‌ ఖాతాలను యాహూ మెయిల్‌ యాప్‌నకు అనుసంధానించుకోవచ్చు. పెద్ద ఫోన్స్‌ను ఒంటి చేత్తో ఆపరేట్‌ చేసేటప్పుడు కూడా సులువు గా ఉపయోగించుకోగలిగేలా యాప్‌లో ఫీచర్స్‌ను తీర్చిదిద్దినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి.  

మెయిల్‌ ప్రో రీబ్రాండింగ్‌..
యూజర్లకు ఉచిత సర్వీసులు అందిస్తున్నప్పటికీ.. మెయిల్స్‌లో ప్రకటనల ద్వారా యాహూ మెయిల్‌కు కొంత ఆదాయం లభిస్తుంది. దీనితో పాటు ప్రకటనల బాదరబందీ లేని సబ్‌స్క్రిప్షన్‌ ఆధారిత యాహూ మెయిల్‌ ప్రో సర్వీసును కూడా సంస్థ గతంలో ప్రవేశపెట్టింది. సుమారు 6–7 ఏళ్ల క్రితం ప్రవేశపెట్టిన ఈ సర్వీసును కూడా ప్రస్తుతం రీబ్రాండ్‌ చేస్తోంది. అలాగే, కొత్త యాహూ మెయిల్‌ అప్లికేషన్‌ను మొబైల్‌ ఫోన్స్‌లో ప్రీ–ఇన్‌స్టాల్‌ చేసేలా ఫోన్స్‌ తయారీ సంస్థలతోనూ చర్చలు జరుగుతున్నాయని సంస్థ వర్గాలు తెలిపాయి. ఎంటర్‌ప్రైజ్‌ ఈ–మెయిల్‌ విభాగంలో ప్రవేశించే యోచనేదీ లేదని.. సాధారణ యూజర్లపైనే ప్రధానంగా దృష్టి పెట్టనున్నామని పేర్కొన్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement