Rebranding
-
ఫ్యూచర్ స్టోర్స్ రీబ్రాండింగ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భవన యజమానులకు బకాయిలు చెల్లించలేక మూతపడ్డ ఫ్యూచర్ రిటైల్ స్టోర్లను రిలయన్స్ ఇండస్ట్రీస్ తీసుకోవడం ప్రారంభించింది. దేశవ్యాప్తంగా తొలి దశలో 250 కేంద్రాలను రిలయన్స్ చేజిక్కించుకుంటోంది. వీటిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 20 వరకు ఔట్లెట్స్ ఉన్నట్టు సమాచారం. ఫ్యూచర్ గ్రూప్ నిర్వహణలో దేశవ్యాప్తంగా 1,700లకుపైగా కేంద్రాలు ఉన్నాయి. ఫ్యూచర్ రిటైల్ ఆస్తుల విషయంలో రిలయన్స్ ఇండస్ట్రీస్, అమెజాన్ మధ్య లీగల్ వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇది కాస్తా బకాయిలు పేరుకుపోవడానికి దారి తీయడం, అద్దెలు చెల్లించలేకపోవడంతో ఫ్యూచర్ రిటైల్ ఔట్లెట్స్ కాస్తా మూసివేతకు గురవుతున్నాయి. కాగా, రీబ్రాండింగ్‌తో ఎఫ్‌బీబీ స్టోర్లు ట్రెండ్స్ కేంద్రాలుగా మారనున్నాయి. బిగ్ బజార్ స్టోర్స్ రిలయన్స్ స్మార్ట్ పాయింట్ లేదా రిలయన్స్ మార్కెట్, ఈజీ డే ఔట్లెట్స్ రిలయన్స్ ఫ్రెష్‌గా పేరు మారనున్నాయి. ఫ్యూచర్ రిటైల్ నెట్‌వర్క్‌లో పని చేస్తున్న ఉద్యోగులను కొనసాగించాలని రిలయన్స్ నిర్ణయించింది. ఈ నిర్ణయం సుమారు 30,000 మందికి ఊరట కలిగించనుంది. ‘నెలల తరబడి కొనసాగిన అనిశ్చితికి తెరపడింది. విక్రేతలు, సరఫరాదార్లు తమ బకాయిలు పొందుతున్నారు. భవన యజమానులు సైతం తమ స్టోర్స్‌ను రిలయన్స్‌కు లీజుకు ఇస్తున్నారు. గత ఏడాది అద్దెలు ఫ్యూచర్ గ్రూప్ నుంచి వీరికి అందలేదు. ఆ బకాయిలను సంస్థ తీర్చింది. అయితే నష్టాలు వస్తున్న ఔట్‌లెట్స్‌ను కంపెనీ తీసుకోవడంతో దివాలా ప్రక్రియలో కొంత జాప్యం జరిగే అవకాశం ఉంది. సర్దుబాటు పథకం గనుక ఆమోదం పొందితే తమ బకాయిలు రాగలవని రుణదాతలు భావిస్తున్నారు’ అని రిలయన్స్ వెల్లడించింది. -
ఇక ‘ఫెయిర్’కు గుడ్‌బై..
న్యూఢిల్లీ: తెల్లని మేనిఛాయే సౌందర్యానికి, ఆత్మవిశ్వాసానికి ప్రామాణికమనే విధంగా అనేక సంవత్సరాలుగా ప్రమోట్ చేస్తూ వస్తున్న ఫెయిర్ అండ్ లవ్లీ బ్రాండ్ తాజాగా కొత్త మార్పులకు లోను కానుంది. రీబ్రాండింగ్ కసరత్తులో భాగంగా ఉత్పత్తి పేరు మార్చనున్నట్లు ఫెయిర్ అండ్ లవ్లీ తయారీ సంస్థ హిందుస్తాన్ యూనిలీవర్ (హెచ్‌యూఎల్) ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా వర్ణవివక్షకు వ్యతిరేకంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో హెచ్‌యూఎల్ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. అన్ని వర్ణాలకు ప్రాధాన్యమిచ్చేలా ఇకపై తమ చర్మ సౌందర్య సాధనాల పోర్ట్‌ఫోలియో ఉంటుందని కంపెనీ తెలిపింది. ‘ఇకపై ఫెయిర్ అండ్ లవ్లీతో పాటు హెచ్యూఎల్కి చెందిన మిగతా స్కిన్‌కేర్ సాధనాల పోర్ట్‌ఫోలియో కూడా సౌందర్యానికి సంబంధించి కొత్త దృష్టికోణాన్ని ఆవిష్కరించే విధంగా ఉంటుంది‘ అని హెచ్‌యూఎల్ సీఎండీ సంజీవ్ మెహతా పేర్కొన్నారు. ఫెయిర్ అండ్ లవ్లీకి సంబంధించి కొత్త పేరు గురించి దరఖాస్తు చేసుకున్నట్లు, నియంత్రణ సంస్థ నుంచి అనుమతులు వచ్చాక త్వరలోనే దీన్ని ప్రకటించనున్నట్లు మెహతా తెలిపారు. మరికొద్ది నెలల్లో మారిన పేరుతో ఈ ఉత్పత్తి మార్కెట్లో లభ్యమవుతుందని వివరించారు. అలాగే మహిళల విద్యాభ్యాసానికి స్కాలర్షిప్లు ఇచ్చేందుకు 2003లో ఏర్పాటు చేసిన ఫెయిర్ అండ్ లవ్లీ ఫౌండేషన్‌కు కూడా త్వరలో కొత్త పేరు ప్రకటించనున్నట్లు మెహతా పేర్కొన్నారు. ఫెయిర్, ఫెయిర్‌నెస్, వైట్, వైటెనింగ్, లైట్, లైటెనింగ్ వంటి పదాలన్నింటినీ తమ ఉత్పత్తుల ప్యాక్‌లు, ప్రకటనల నుంచి తొలగించనున్నట్లు హెచ్‌యూఎల్ మాతృసంస్థ యూనిలీవర్ వెల్లడించింది. బ్రాండ్ పేరు మార్చాలంటూ చేంజ్డాట్ఆర్గ్ ద్వారా సంతకాల ఉద్యమం చేస్తున్న కార్యకర్తలు హెచ్‌యూఎల్ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు. -
యాహూ! సరికొత్తగా...
ఒకప్పుడు ఇంటర్నెట్ సెర్చి ఇంజిన్‌గా, ఈ–మెయిల్‌కు పర్యాయపదంగా వెలిగిన యాహూ ఆ తర్వాత మిగతా సంస్థల నుంచి పోటీ ని తట్టుకోలేక వెనుకబడిపోయింది. అయితే, పూ ర్వ వైభవాన్ని సంపాదించుకునేందుకు యాహూ మెయిల్ తాజాగా ప్రయత్నాల్లో ఉంది. ఇందులో భాగంగా సరికొత్త ఫీచర్స్‌తో పాటు మొబైల్ యాప్‌ను రీబ్రాండింగ్ చేయడం ద్వారా యూజర్లను ఆకర్షించేందుకు కసరత్తు చేస్తోంది. పోటీ సంస్థలు గూగుల్‌కి చెందిన జీమెయిల్, మైక్రోసాఫ్ట్ అవుట్‌లుక్ వంటివి తమ యాప్స్‌ను ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లు, సర్వీసులతో రీ–బ్రాండ్ చేసుకుంటూనే ఉన్న నేపథ్యంలో యాహూ తాజా ప్రయత్నాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 22 కోట్ల మంది యూజర్లు.. యాహూ మెయిల్‌కు ప్రపంచవ్యాప్తంగా 22.76 మిలియన్ల మంది నెలవారీ యూజర్లు ఉన్నారు. మొబైల్ ఫోన్లు, ట్యాబ్లెట్ పీసీలు, కంప్యూటర్స్ మొదలైన వివిధ డివైజ్‌ల ద్వారా వీరిలో చాలా మంది ఈమెయిల్ సర్వీసులు ఉపయోగించుకుంటున్నారు. మొత్తం యూజర్లలో ప్రతి నెలా 7.5 కోట్ల మంది యూజర్లు కేవలం తమ మొబైల్స్, ట్యాబ్లెట్స్ ద్వారానే యాహూ మెయిల్‌ను ఉపయో గిస్తున్నారు. యాహూ మెయిల్ వినియోగదారుల్లో 60 శాతం మంది అమెరికాయేతర దేశాలవారే. ప్రస్తుతం ఉన్న యూజర్లు మరో ఈమెయిల్ సేవల సంస్థ వైపు మళ్లకుండా తమవద్దే అట్టే పెట్టుకునే దిశగా కొత్త మొబైల్ యాప్ ఫీచర్స్‌ను తీర్చిదిద్దినట్లు సంస్థ వర్గాలు తెలిపాయి. దీంతో పాటు భారత్‌లో తెలుగు, తమిళం, కన్నడం, హిందీ, గుజ రాతీ, బెంగాలీ, మరాఠీ వంటి ఏడు ప్రాంతీయ భాషల్లో సేవలు అందిస్తున్నట్లు వివరించాయి. కొత్త ఫీచర్స్‌లో కొన్ని .. అన్నింటికన్నా ప్రధానంగా మిగతా సంస్థలతో పోలిస్తే యాహూ మెయిల్ అత్యధికంగా 1 టెరాబైట్ (టీబీ) స్టోరేజీ స్పేస్ అందిస్తోంది. సుమారు 250–300 సినిమాలకు సరిపడేంత స్టోరేజీ ఇది. పోటీ సంస్థ జీమెయిల్ కేవలం 15 జీబీ స్టోరేజీ ఇస్తోంది. ఈ పరిమితి దాటితే.. అప్పటికే ఉన్న మెయిల్స్ కొన్నింటిని డిలీట్ చేసుకుని.. ఆ మేరకు పెరిగిన స్పేస్‌ను వాడుకోవాల్సి ఉంటోంది. లేదా నెలవారీ కొంత మొత్తం చెల్లించి అదనంగా స్టోరేజీ స్పేస్ కొనుక్కోవాల్సి వస్తోంది. ఇక, ఇన్‌బాక్స్‌లో స్పామ్ బాదరబందీ లేకుండా కాంటాక్ట్స్ నుంచి వచ్చే మెయిల్సే కనిపించేలా .. యాహూ మెయిల్ యూజర్లు..‘పీపుల్ వ్యూ’ పేరిట మరో కొత్త ఫీచర్ వినియోగించుకోవచ్చు. పీపుల్, ట్రావెల్, రిసీట్స్ వంటి మూడు కేటగిరీల్లో కింద మెయిల్స్‌ను విడగొట్టుకోవచ్చు. ఇవే కాకుండా పలు రకాల ఫిల్టర్స్, అటాచ్మెంట్ ఆప్షన్లు మొదలైనవి ఇందులో ఉన్నాయి. మిగతా ఈ–మెయిల్ సర్వీస్ ప్రొవైడర్స్ తరహాలోనే బహుళ ఈ–మెయిల్ ఖాతాలను యాహూ మెయిల్ యాప్‌నకు అనుసంధానించుకోవచ్చు. పెద్ద ఫోన్స్‌ను ఒంటి చేత్తో ఆపరేట్ చేసేటప్పుడు కూడా సులువు గా ఉపయోగించుకోగలిగేలా యాప్‌లో ఫీచర్స్‌ను తీర్చిదిద్దినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. మెయిల్ ప్రో రీబ్రాండింగ్.. యూజర్లకు ఉచిత సర్వీసులు అందిస్తున్నప్పటికీ.. మెయిల్స్‌లో ప్రకటనల ద్వారా యాహూ మెయిల్‌కు కొంత ఆదాయం లభిస్తుంది. దీనితో పాటు ప్రకటనల బాదరబందీ లేని సబ్స్క్రిప్షన్ ఆధారిత యాహూ మెయిల్ ప్రో సర్వీసును కూడా సంస్థ గతంలో ప్రవేశపెట్టింది. సుమారు 6–7 ఏళ్ల క్రితం ప్రవేశపెట్టిన ఈ సర్వీసును కూడా ప్రస్తుతం రీబ్రాండ్ చేస్తోంది. అలాగే, కొత్త యాహూ మెయిల్ అప్లికేషన్‌ను మొబైల్ ఫోన్స్‌లో ప్రీ–ఇన్స్టాల్ చేసేలా ఫోన్స్ తయారీ సంస్థలతోనూ చర్చలు జరుగుతున్నాయని సంస్థ వర్గాలు తెలిపాయి. ఎంటర్ప్రైజ్ ఈ–మెయిల్ విభాగంలో ప్రవేశించే యోచనేదీ లేదని.. సాధారణ యూజర్లపైనే ప్రధానంగా దృష్టి పెట్టనున్నామని పేర్కొన్నాయి. -
బ్రాండ్ రాహుల్‌కు కాంగ్రెస్ కసరత్తు
సాక్షి,న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సారథ్య బాధ్యతలను తలకెత్తుకోనున్న రాహుల్ గాంధీని కీలక రాజకీయ శక్తిగా మలిచేందుకు, ప్రధాని మోదీని దీటుగా ఢీ కొట్టేందుకు అవసరమైన కసరత్తుకు ఏఐసీసీ శ్రీకారం చుట్టింది. బ్రాండ్ రాహుల్‌ను ప్రమోట్ చేసేందుకు పలు వ్యూహాలకు పదును పెడుతోంది. ముందుగా ట్విట్టర్లో మోదీ కన్నా బాగా వెనుకబడిన యువనేతను సోషల్ మీడియాలో ప్రొజెక్ట్ చేయడంపై దృష్టిసారించింది. ఇందులో భాగంగా రాహుల్ ట్విట్టర్ ఐడీని మార్చే పనిలో పడింది.ప్రస్తుతం ఆఫీస్ఆఫ్ఆర్జీగా ఉన్న ఐడీని రాహుల్‌గాంధీగా మార్చనుంది. ప్రధాని మోదీకి ట్విట్టర్లో ఇప్పటికే 3.5 కోట్ల మంది ఫాలోయర్లు ఉండగా, రాహుల్‌ను కేవలం 37 లక్షల మందే అనుసరిస్తున్నారు. ట్విట్టర్లో రాహుల్ ఫాలోవర్ల సంఖ్యను పెంచడంతో పాటు సోషల్ మీడియాలో పార్టీ కార్యకలాపాలను వేగవంతం చేయడం, నెటిజన్లతో అనుసంధానం పెంచడంపై పార్టీ నేతలు దృష్టిసారించారు. రాహుల్ సైతం ఇటీవల మోదీ సర్కార్‌పై పదేపదే పదునైన పంచ్‌లతో విరుచుకుపడుతున్నారు. నోట్ల రద్దు, సర్జికల్ స్ర్టైక్స్, జీఎస్టీ వంటి అంశాలపై రాహుల్ నేరుగా మోదీపై విమర్శనాస్ర్తాలు ఎక్కుపెడుతూ వార్తల్లో నిలుస్తున్నారు. మరోవైపు రాహుల్‌ను పార్టీ అధ్యక్ష పగ్గాలను చేపట్టాలని కోరుతూ ఉత్తరాఖండ్ కాంగ్రెస్ ఏకగ్రీవ తీర్మానం చేసింది. బీజేపీ నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్న గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ముందు రాహుల్‌కు కీలక బాధ్యతలు అప్పగించే క్రమంలో రాహుల్ రీబ్రాండింగ్‌పై ఆ పార్టీ నేతలు కసరత్తు ముమ్మరం చేశారు. -
మైక్రోసాప్ట్గా మారనున్న నోకియా షోరూంలు
-
నోకియా స్థానంలో మైక్రోసాఫ్ట్ స్టోర్లు
భారత్‌లో 8,872 ఔట్లెట్ల రీబ్రాండింగ్ నోకియా, మైక్రోసాఫ్ట్ బ్రాండ్లలో ఫోన్లు ‘సాక్షి’తో మైక్రోసాఫ్ట్ మొబైల్ డెరైక్టర్ నిఖిల్ మాథుర్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నోకియా ఔట్లెట్లు కొద్ది రోజుల్లో కనుమరుగు కానున్నాయి. రీబ్రాండింగ్‌లో భాగంగా ప్రపంచవ్యాప్తంగా తొలి దశలో జూన్ నాటికి 15,684 ఔట్లెట్లు ‘మైక్రోసాఫ్ట్’ పేరుతో దర్శనమీయనున్నాయి. వీటిలో భారత్‌లో 8,872 ఔట్‌లెట్లతోపాటు 119 సర్వీసింగ్ కేంద్రాలు ఉన్నాయి. నోకియా ఎక్స్‌క్లూజివ్ ఔట్లెట్లు మైక్రోసాఫ్ట్ ప్రియారిటీ రీసెల్లర్ స్టోర్లుగా, మల్టీబ్రాండ్ ఔట్లెట్లు మైక్రోసాఫ్ట్ మొబైల్ రీసెల్లర్ స్టోర్లుగా మారనున్నాయి. మైక్రోసాఫ్ట్ ప్రియారిటీ రీసెల్లర్ స్టోర్స్‌లో మైక్రోసాఫ్ట్ ఉత్పత్తులైన ఎక్స్‌బాక్స్ గేమింగ్ కన్సోల్స్, పీసీలు, మొబైల్ ఫోన్లు, యాక్సెసరీస్ విక్రయిస్తారు. దక్షిణాది రాష్ట్రాల్లో 2,100 స్టోర్లు రీబ్రాండ్ చేస్తున్నామని మైక్రోసాఫ్ట్ మొబైల్ ఓవై బిజినెస్ సేల్స్, ఆపరేటర్ చానల్స్ డెరైక్టర్ నిఖిల్ మాథుర్ సాక్షి బిజినెస్ బ్యూరోకు బుధవారం చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్‌కు ఉన్న బ్రాండ్ ఇమేజ్ జూన్ తర్వాతి నుంచి ప్రస్ఫుటంగా కనిపిస్తుందని అన్నారు. గోల్డెన్ డేస్ దిశగా.. ఐడీసీ ప్రకారం 2014 జనవరి-మార్చి త్రైమాసికంలో నోకియా వాటా 4 శాతానికి వచ్చి చేరింది. కొన్నేళ్ల క్రితం భారత్‌లో అగ్రశ్రేణి కంపెనీగా నోకియా వెలుగొందిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ బ్రాండ్ తోడవ్వడంతో మార్కెట్లో పట్టుకు రంగంలోకి దిగింది. లూమియా ఫోన్ల ధరను కంపెనీ తగ్గిస్తూ వస్తోంది. లూమియా 430 మోడల్‌ను రూ.5,299లకే ఆవిష్కరించింది. లూమియా స్మార్టఫోన్లు ఇక నుంచి మైక్రోసాఫ్ట్ బ్రాండ్‌తోనే వస్తాయి. ఫీచర్ ఫోన్లకు ఇంకా డిమాండ్ ఉన్నందున ఈ విభాగంలో నోకియా బ్రాండ్ మోడళ్లను కొనసాగిస్తామని నిఖిల్ పేర్కొన్నారు. ‘కస్టమర్ల అవసరాలను అధ్యయనం చేస్తున్నాం. ఫీచర్, స్మార్ట్‌ఫోన్ విభాగాల్లో అత్యుత్తమ మోడళ్లను అందించిన ఘనత మాది. అదే ఊపుతో విభిన్న ఫీచర్లతో సరికొత్త మోడళ్లను తీసుకొస్తున్నాం’ అని తెలిపారు. కంపెనీకి తిరిగి మంచి రోజులు వస్తాయన్న ధీమా వ్యక్తం చేశారు. 4జీలో సత్తా చాటుతాం.. దేశంలో 4జీ ఇప్పుడిప్పుడే ప్రవేశిస్తోంది. చాలా లూమియా ఫోన్లు 4జీని సపోర్ట్ చేస్తాయి. మరిన్ని మోడళ ్లను టెలికం కంపెనీలతో కలిసి పరీక్షిస్తున్నామని నిఖిల్ తెలిపారు. టెక్నాలజీ విస్తరించగానే ఈ కంపెనీల భాగస్వామ్యంతో విభిన్న మోడళ్లను ప్రవేశపెడతామన్నారు. 4జీలో సత్తా చాటుతామని పేర్కొన్నారు. కాగా, నోకియా మొబైల్, సర్వీస్ విభాగాలను గతేడాది మైక్రోసాఫ్ట్ 7.5 బిలియన్ డాలర్లకు దక్కించుకుంది. సెబైక్స్ ఎగ్జిమ్ సొల్యూషన్స్ ప్రకారం 2015 జనవరి-మార్చి కాలంలో మైక్రోసాఫ్ట్ 9.30 లక్షల యూనిట్ల స్మార్ట్ఫోన్లను భారత్‌కు దిగుమతి చేసింది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఈ పరిమాణం 28 శాతం అధికం కావడం గమనార్హం.