న్యూఢిల్లీ: తెల్లని మేనిఛాయే సౌందర్యానికి, ఆత్మవిశ్వాసానికి ప్రామాణికమనే విధంగా అనేక సంవత్సరాలుగా ప్రమోట్ చేస్తూ వస్తున్న ఫెయిర్ అండ్ లవ్లీ బ్రాండ్ తాజాగా కొత్త మార్పులకు లోను కానుంది. రీబ్రాండింగ్ కసరత్తులో భాగంగా ఉత్పత్తి పేరు మార్చనున్నట్లు ఫెయిర్ అండ్ లవ్లీ తయారీ సంస్థ హిందుస్తాన్ యూనిలీవర్ (హెచ్‌యూఎల్) ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా వర్ణవివక్షకు వ్యతిరేకంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో హెచ్‌యూఎల్ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.
అన్ని వర్ణాలకు ప్రాధాన్యమిచ్చేలా ఇకపై తమ చర్మ సౌందర్య సాధనాల పోర్ట్‌ఫోలియో ఉంటుందని కంపెనీ తెలిపింది. ‘ఇకపై ఫెయిర్ అండ్ లవ్లీతో పాటు హెచ్‌యూఎల్‌కి చెందిన మిగతా స్కిన్‌కేర్ సాధనాల పోర్ట్‌ఫోలియో కూడా సౌందర్యానికి సంబంధించి కొత్త దృష్టికోణాన్ని ఆవిష్కరించే విధంగా ఉంటుంది‘ అని హెచ్‌యూఎల్ సీఎండీ సంజీవ్ మెహతా పేర్కొన్నారు. ఫెయిర్ అండ్ లవ్లీకి సంబంధించి కొత్త పేరు గురించి దరఖాస్తు చేసుకున్నట్లు, నియంత్రణ సంస్థ నుంచి అనుమతులు వచ్చాక త్వరలోనే దీన్ని ప్రకటించనున్నట్లు మెహతా తెలిపారు.
మరికొద్ది నెలల్లో మారిన పేరుతో ఈ ఉత్పత్తి మార్కెట్లో లభ్యమవుతుందని వివరించారు. అలాగే మహిళల విద్యాభ్యాసానికి స్కాలర్‌షిప్‌లు ఇచ్చేందుకు 2003లో ఏర్పాటు చేసిన ఫెయిర్ అండ్ లవ్లీ ఫౌండేషన్‌కు కూడా త్వరలో కొత్త పేరు ప్రకటించనున్నట్లు మెహతా పేర్కొన్నారు. ఫెయిర్, ఫెయిర్‌నెస్, వైట్, వైటెనింగ్, లైట్, లైటెనింగ్ వంటి పదాలన్నింటినీ తమ ఉత్పత్తుల ప్యాక్‌లు, ప్రకటనల నుంచి తొలగించనున్నట్లు హెచ్‌యూఎల్ మాతృసంస్థ యూనిలీవర్ వెల్లడించింది. బ్రాండ్ పేరు మార్చాలంటూ చేంజ్‌డాట్‌ఆర్గ్ ద్వారా సంతకాల ఉద్యమం చేస్తున్న కార్యకర్తలు హెచ్‌యూఎల్ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment