పెద్దశంకరంపేట గోదాం వద్ద డీలర్ పడేసిన ముక్కిన బియ్యం
అల్లాదుర్గం(మెదక్): అల్లాదుర్గం మండలం చిల్వెర గ్రామంలోని రేషన్ షాపునకు రెండు నెలల క్రితం ముక్కిన బియ్యం సరఫరా చేశారు. వాటిని తీసుకొని ఏం చేసుకోవాలని వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. డీలర్ నర్సింహులు విషయాన్ని అధికారులకు తెలపడంతో బియ్యాన్ని గోదాంకు తిరిగి పంపించాలని సూచించారు. ఎఫ్‌సీఐ గోదాం ఇన్‌చార్జిని సంప్రదిస్తే రేపు మాపు అంటూ రెండు నెలలు కాలయాపన చేశాడు. మంగళవారం డీలర్ స్వయంగా 10 క్వింటాళ్ల ముక్కిన బియ్యం బస్తాలు పెద్దశంకరంపేట ఎఫ్‌సీఐ గోదాంకు తీసుకెళ్లాడు.
ఈ బియ్యానికి తనకు సంబంధం లేదని, మీరే ఏమైనా చేసుకోవాలని గోదాం ఇన్‌చార్జి తేల్చి చెప్పాడు. దీంతో ముక్కిన బియ్యాన్ని డీలర్ అక్కడే పడేసి వచ్చాడు. అధ్వాన్న బియ్యం సరఫరా చేస్తూ గోదాం ఇన్‌చార్జిలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని డీలర్లు ఆరోపిస్తున్నారు. ఈ సంఘటనపై కలెక్టర్ విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment