రేషన్ బియ్యం పట్టివేత
-
రైస్‌మిల్లులో అక్రమంగా నిల్వచేసిన బియ్యం
జ్యోతినగర్: ప్రభుత్వం పేదలకు పంపిణీచేస్తున్న రేషన్ బియ్యాన్ని కొందరు అక్రమార్కులు పక్కదారి పట్టిస్తున్న వైనంపై రామగుండం రెవెన్యూ అధికారులు దృష్టి సారించారు. ఓ రైస్‌మిల్లులో అక్రమంగా నిల్వచేసిన 126 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని మంగళవారం సీజ్ చేశారు. రామగుండం గౌతమినగర్‌కు చెందిన వ్యాపారి గోలి రమణారెడ్డికి చెందిన శ్రీ సీతారామాంజనేయ స్వామి రైస్‌మిల్లులో అక్రమంగా రేషన్ బియ్యం నిల్వ చేశారనే సమాచారంతో ఆర్‌ఐ ఖాజామొహినొద్దిన్, వీఆర్‌ఓలు అజీం, అజయ్, రవీందర్ సిబ్బందితో తనిఖీలు చేపట్టారు. మిల్లులో నిల్వచేసిన 252 (50 కిలోల) సంచులను గుర్తించి సీజ్ చేశారు. అక్రమ నిల్వలతో పాటు రైస్‌మిల్లుకు కనీసం పేరు లేకుండా నిర్వహిస్తున్న వైనంపై ఉన్నతాధికారులకు నివేదికలు అందజేస్తామని అధికారులు తెలిపారు.