ఆగని దందా | PDS rice in black market | Sakshi
Sakshi News home page

ఆగని దందా

Published Wed, Dec 17 2014 8:31 AM | Last Updated on Sat, Sep 2 2017 6:20 PM

బహిరంగ మార్కెట్‌లో కిలో బియ్యం రూ.38 నుం చి రూ.52కు లభిస్తున్నాయి.

 ‘రూపాయి’పై రాబందులు
 పక్కదారి పడుతున్న పేదోళ్ల బియ్యం
 యథేచ్ఛగా సాగుతున్న అక్రమ రవాణా
 సంచులు మార్చి, రీసైక్లింగ్ చేసి లెవీకి
 పక్క రాష్ట్రాలకూ లారీల్లో తరలింపు
 పర్యవేక్షణ లోపంతో అక్రమాలు
 
 నిజామాబాద్: బహిరంగ మార్కెట్‌లో కిలో బియ్యం రూ.38 నుం చి రూ.52కు లభిస్తున్నాయి. రేషన్ దుకాణాల ద్వారా ప్రభుత్వం రూపాయికే కిలో బియ్యం సరఫరా చేస్తోంది. బజారులో ఆ నాణ్యత ఉన్న బియ్యం ధర రూ.30కి పైనే పలుకుతోంది. అక్రమాలను అడ్డుకునే వ్యవస్థ లేకపోవడంతో రేషన్‌బియ్యం పథకం కొందరు అవినీతిపరులకు వరంగా మారింది. బియ్యం అక్రమ రవాణాకు దళారులు తహతహలాడుతుండగా, అధికారులు మాత్రం చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది.
 
 ఫలితంగా ఉత్తర తెలంగాణ లో ‘రేషన్ దందా’ జోరుగా సాగుతుం డగా, నామమాత్రం గా రోజుకో కేసు నమోదు అవుతోంది. కరీంనగర్ జిల్లా కోరుట్ల నుంచి నిజామాబాద్‌కు రెండు డీసీఎం వ్యాన్ల లో తరలిస్తున్న 204 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని జిల్లాకు చెందిన టాస్క్‌ఫోర్స్ అధికారులు మంగళవారం పట్టుకున్నారు. ‘దొరికితే దొంగలు లేదంటే దొరలు’ అన్నట్టుగా సాగుతున్న ఈ దందాలో కొందరు రేషన్ డీలర్లు, మండల స్థాయి స్టాక్ పాయింట్ (ఎంఎల్‌ఎస్) నిర్వాహకులే భాగస్వాములు కావడంపై విమర్శలు వస్తున్నాయి.
 
 నిత్యకృత్యంగా మారిన దందా
 రేషన్ బియ్యం దందా నిత్యకృత్యంగా మారింది. చూడడానికి చిన్న విషయంగానే కనిపిస్తున్నా, అక్రమార్కులు దీనితో ఏటా కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. బో గస్ రేషన్ కార్డులు డీల్లర్లు, మండల లెవెల్ స్టాక్ పాయింట్ అధికారులకు ‘కాసులు’ కురిపిస్తున్నాయి.
 
 రెండు నెలల క్రితం బియ్యాన్ని నేరుగా ఎంఎల్‌ఎస్ పాయింట్ నుంచి నిజామాబాద్ జిల్లా కేంద్రానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న అర్సపల్లి రామకష్ట ఆగ్రో ఇండస్ట్రీస్‌కి తరలించి రీ-సైక్లింగ్ చేస్తుండగా పౌరసరఫరాలశాఖ అధికారులు పట్టుకున్నారు. ఈ బియ్యం విలువ సుమారుగా రూ. 28 లక్షలని వెల్లడించారు. అదే నెలలో గాంధారికి చెందిన డీలర్ 13.85 క్వింటాళ్ల బియ్యాన్ని ముందస్తుగా ఎంఎల్‌ఎస్ పాయింట్ నిర్వాహకుడికి అప్పగించగా, డీఎస్‌ఓ కొండల్‌రావు తనిఖీ చేసి కేసు నమోదు చేశారు.
 
 తాజాగా కరీంనగర్ జిల్లా కోరుట్ల నుంచి ఎపీ15-టీబీ 8966 , ఏపీ 15-టీఏ 9128 నంబర్లు గల రెండు డీసీఎం వ్యాన్లలో తరలిస్తున్న 204 క్వింటాళ్ల బియ్యాన్ని రెవెన్యూ టాస్క్‌ఫోర్స్ అధికారులు వలపన్ని పట్టుకున్నారు.ఆ బియ్యాన్ని త్రివేణి రైసుమిల్లుకు తరలించిన అధికారులు నిజామాబాద్ నాల్గవ టౌన్‌లో కేసు నమో దు చేసి, వాహనాలను అక్కడికి తరలించారు. దయామా కార్పొరేషన్ పేరిట సరఫరా అవుతున్న ఈ బియ్యం మొత్తం కూడ పీడీఎస్ (ప్రజా పంపిణీ వ్యవస్థ)కు చెందినవి కావడమే విశేషం.అక్కడక్కడా కొందరు నిజాయితీ గల అధికారుల దాడులతో కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం దష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.
 
 దందా సాగుతుందిలా
 రేషన్ బియ్యం పక్కదారి పడుతున్న వైనంలో అందరికీ వాటాలేనన్న ప్రచా రం ఉంది. పౌరసరఫరాల శాఖలోని ‘నిఘా’ అధికారులు కొందరికీ ఇది ‘మామూలే’నన్న విమర్శలూ వినిపిస్తున్నాయి. నిత్యావసర సరుకులు నల్ల బజారుకు తరలుతున్నాయని బహిరంగంగా చర్చ జరుగుతున్నా, సదరు అధికారులు పట్టీపట్టనట్లుగా వ్యవహరించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా వుండగా కిలో బియ్యం రెండు రూపాయలున్న తరుణం లో నాలుగో వంతు నల్లబజారుకు తరలించిన వ్యాపారులకు ఇప్పుడు కిలో పై ఇంకో రూపాయి అదనంగా లభించనుంది.
 
 
 సాధారణంగా ప్రభుత్వం లబ్ధిదారుడికి రూపాయికి కిలో బియ్యం ఇస్తుండగా,వారి నుంచి స్థానికంగా ఉండే వ్యాపారులు తొమ్మిది రూపాయలకు కిలో చొప్పున ఖరీదు చేస్తున్నా రు. వారు టోకు వ్యాపారికి పది రూపాయలకు విక్రయిస్తున్నారు. అక్కడి నుంచి సిండి కేట్‌కు రూ.13కు అమ్ముతున్నట్లు సమాచారం. ఇక్కడే మిల్లర్లు, దళారులు ప్రవేశించి రీమిల్లింగ్, రీ సైక్లింగ్‌లాంటి ప్రక్రియ ద్వారా ఎఫ్‌సీఐకి పంపిస్తున్నారు. భూమి గుండ్రంగా ఉందన్న రీతిలో సాగుతున్న ఈ అక్రమ దందా ద్వారా బియ్యం ఎక్కడి నుంచి వస్తున్నాయో, వివిధ మార్గాల ద్వారా మళ్లీ అక్కడికే వెళ్తున్నాయి. కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి. ఉన్నతాధికారులు దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.
 
 
 190 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత
 ప్రగతినగర్ : కరీంనగర్ జిల్లా కోరుట్ల నుంచి మహారాష్ట్ర వైపునకు రెండు డీసీఎం వ్యాన్‌లలో రవాణా అవుతున్న 190 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు మంగళవారం ఉదయం నగరంలోని కంఠేశ్వర్‌లో పట్టుకొన్నారు. పక్కా సమాచారం రావడంతో డీఎస్‌ఓ కొండల్‌రావు దాడులకు ఆదేశించారు.
 
 దీంతో డీటీలు బాల్‌రాజ్, సుభాష్, సురేష్, పుడ్ ఇన్స్‌పెక్టర్ విజయ్‌కాంత్‌రావు బైపాస్ రహదారిపై మాటువేసి వ్యాన్‌లను పట్టున్నారు. వాహనాలను ఠాణాకు తరలించి, నిందితులపై కేసు నమోదు చేశారు. బియ్యం ఎక్కడి నుంచి ఎక్కడికి తరులుతున్నాయనేది తెలియాల్సి ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement