ఆంధ్రప్రదేశ్‌లో పేదలకు చేరాల్సిన ప్రజాపంపిణీ వ్యవస్థ బియ్యం (పీడీఎస్ బియ్యం) కృష్ణపట్నం పోర్టు ద్వారా ఆఫ్రికాకు భారీ ఎత్తున తరలిస్తున్న గుట్టు రట్టయింది. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ దాడుల్లో అక్రమ రవాణా వ్యవహారం వెలుగు చూసింది. 1,645 టన్నుల బియ్యం కృష్ణపట్నం పోర్టులో అనధికారికంగా నిల్వ ఉంచారంటే.. ఈ స్కామ్‌లో ఎంత పెద్ద నెట్‌వర్క్ నడిచిందో ఇట్టే అర్థమవుతోంది. ప్రభుత్వ శాఖలు, పోర్టు సిబ్బంది సైతం కుమ్మక్కు అయినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో ఎక్స్‌పోర్టర్లకు సంబంధించిన నలుగురు వ్యక్తులను విజిలెన్స్ అధికారులు విచారిస్తే ఆఫ్రికా దేశానికి రవాణా చేసేందుకు తరలిస్తున్నట్లు బయటపడింది.
నెల్లూరు (క్రైమ్): కృష్ణపట్నం పోర్టులో సీబార్డ్ గోదాముల్లో భారీ ఎత్తున ప్రజాపంపిణీ వ్యవస్థ (పీడీఎస్) బియ్యం శనివారం విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల తనిఖీల్లో పట్టుబడిన నేపథ్యంలో తీగలాగితే డొంకంతా కదులుతోంది. 1,645 టన్నుల బియ్యం అక్రమ నిల్వలు బయట పడిన విషయం తెలిసిందే. భారీ స్థాయిలో బియ్యం నిల్వ చేయడం వెనుక ప్రభుత్వ శాఖల హస్తం ఉందన్న విషయం స్పష్టమవుతోంది. ఈ స్థాయిలో నిల్వ చేయాలంటే సుమారు ఆరు నెలలకు పైగానే సమయం పడుతుందని అధికారులు అంచనా వేశారు. ప్రజా పంపిణీ వ్యవస్థకు బియ్యాన్ని సరఫరా చేసే సప్లయిర్లు నేరుగా ఎక్స్‌పోర్టర్స్‌తో సంబంధాలు పెట్టుకుని ఈ దందా కొనసాగిస్తున్నారని ప్రాథమిక సమాచారం. రేషన్ షాపులకు పంపే బియ్యాన్ని ఎంఎల్‌ఎస్ పాయింట్ల నుంచే నేరుగా లారీల్లో రైస్ మిల్లలకు తరలిస్తున్నారు.
అక్కడ బియ్యం గోతాలను మార్చి అనువైన బ్రాండ్స్‌తో కొత్తగా ప్యాకింగ్ చేసి లారీల్లో పోర్టులోని గోదాములకు తరలిస్తున్నారు. అయితే ఇక్కడకు చేరిన లారీలకు వే బిల్లులు, అధికార పూర్వకంగా ఉండాల్సిన పత్రంలో ఏ వివరాలు లేవని తేలింది. ఈ ప్రక్రియ అంతా ప్రభుత్వ సంబంధిత శాఖల కనుసన్నల్లోనే జరుగుతోందని సమాచారం. పోర్టుకు చేరిన అనంతరం అక్కడ జరగాల్సిన తంతు పోర్టు సిబ్బంది చూసుకుంటారు. షిప్‌మెంట్ జరిగే సమయంలో మాత్రమే సంబంధిత వే బిల్లులు, క్వాలిటీ, ఎన్ని రోజులు నిల్వ ఉంచారన్న అంశాలపై కస్టమ్స్ అధికారులు పరిశీలిస్తారు. ఈ క్రమంలోనే భారీ స్థాయిలో అక్రమ నిల్వలు బయట పడ్డాయని అధికారులు వెల్లడించారు. అయితే పోర్టు, సంబంధిత ప్రభు త్వ అధికారుల నడుమ ఒప్పందాలు బహిర్గతం కావడంతో అసలు విషయం బయటకు పొక్కిందని తెలుస్తోంది. జిల్లా కలెక్టర్ అనుమతులు తీసుకుని పోర్టులో విజిలెన్స్ అధికారులు దాడులు చేయాల్సి వచ్చింది.
బియ్యం సేకరణ ఇలా..
దాడుల్లో ప్రధానంగా బియ్యం తరలించే నలుగురు సప్లయిర్స్, నలుగురు ఎక్స్‌పోర్టర్లను గుర్తించారు. వీరిలో ఇతర రాష్ట్రాలకు చెందిన వారు సైతం ఉండటం గమనార్హం. సప్లయిర్స్‌లో కర్ణాటకకు చెందిన శ్రీవీరభద్రేశ్వర ఇండస్ట్రీ నుంచి రాధిక బ్రాండ్ పేరుతో 30 టన్నుల బియ్యాన్ని రాజస్థాన్‌కు చెందిన రాధికా ఎంటర్ ప్రైజస్ ఎక్స్‌పోర్టర్‌కు సీషల్ లాజిస్టిక్ ద్వారా సరఫరా చేశారు. రైస్ మిల్లర్ల దగ్గర నుంచి పోర్టు సిబ్బంది వరకు భారీ స్థాయిలో సొమ్ము చేతులు మారకపోతే ఇంత పెద్ద రాకెట్ దందాకు ఆస్కారం లేదని తెలుస్తోంది.
►గుంటూరు జిల్లాకు చెందిన సీతారామాంజనేయ రైస్ అండ్ ఫ్లోర్ మిల్ నుంచి ఓషన్ బ్రాండ్ పేరుతో 1263.50 క్వింటాళ్ల బియ్యాన్ని ఢిల్లీ నవభారత్ ట్రేడింగ్ కంపెనీ ఎక్స్‌పోర్టర్స్ చాకియాత్ ఏజెన్సీ ద్వారా సరఫరా చేశారు. ఈ నలుగురు సప్లయిర్స్ ఈ–వేబిల్లులు లేకుండా, ఏఎంసీ సెస్‌లు చెల్లించకుండా చేర్చినట్లు సమాచారం. గుంటూరు జిల్లాకు చెందిన సీతారామాంజనేయ రైస్ అండ్‌ఫ్లోర్ మిల్ నుంచి ఈగల్ బ్రాండ్ పేరుతో రెండు దఫాలుగా 63 క్వింటాళ్ల బియ్యాన్ని ఢిల్లీ నవభారత్ ట్రేడింగ్ కంపెనీ ఎక్స్‌పోర్టర్స్ చాకియాత్ ఏజెన్సీ ద్వారా సరఫరా చేశారు.
►చెన్నైకు చెందిన శివకేశవ ట్రేడర్స్ నుంచి సలోని బ్రాండ్ పేరుతో 3,900 క్వింటాళ్ల బియ్యాన్ని కాకినాడకు చెందిన సిస్టర్ కన్‌సైన్‌మెంట్ కాకినాడ అండ్ సరలా ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎక్స్‌పోర్టర్స్ నుంచి ఏవీకే లాజిస్టిక్స్‌కు సరఫరా చేశారు.
►విజయవాడకు చెందిన ఎస్‌ఎంఆర్ ట్రేడింగ్ కంపెనీ నుంచి సూపర్ టైగర్ బ్రాండ్ పేరుతో 11,225 క్వింటాళ్ల బియ్యాన్ని కాకినాడకు చెందిన ఎంఓఐ కమోడిటీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఎక్స్‌పోర్టర్స్ సీవేస్ షిపింగ్ అండ్ లాజిస్టిక్ లిమిటెడ్ ద్వారా సరఫరా చేసినట్లు దాడుల్లో అధికారులు గుర్తించారు.
సప్లయిర్స్, ఎక్స్‌పోర్టర్స్ వివరాల సేకరణ
అసలు ఇలాంటి వ్యవహారాలు ఎప్పటి నుంచి జరుగుతున్నాయో అనే వివరాలు సేకరించేందుకు విజిలెన్స్ అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అందుకు కస్టమ్స్ అధికారుల నుంచి 2016–17 నుంచి 2019–20 వరకు సప్లయిర్స్, ఎక్స్‌పోర్టర్స్, ట్రాన్స్‌పోర్టర్స్ వివరాలు సేకరించే పనిలో ఉన్నారు.
బయటపడిందిలా..
బియ్యం బ్యాగ్‌లు మార్చి, పేర్లు మార్చి, బిల్లులు లేకుండా పోర్టు గోదాముకు చేరిన బియ్యం అమ్మిన ధరను తెలిపే బిల్లులు అక్రమాల పుట్టను బయట పెట్టాయి. బియ్యం రూ.25, రూ.20 ఇలా తక్కువ ధరలకు కొని విదేశాలకు ఎగుమతి చేయడం ఎలా సాధ్యమవుతుందని తొలుత కస్టమ్స్ అధికారుల్లో రేగిన ఆలోచనలు అసలు విషయాన్ని బయట పెట్టాయి. శ్రీవీరభద్రా ఇండస్ట్రీస్ కేజీ బియ్యం రూ.25కు కొనుగోలు చేసినట్లు, సీతారామాంజనేయ రైస్ అండ్ ఫ్లోర్‌మిల్లు కేజీ రూ 21.40లకు కొనుగోలు చేసినట్లు, శివకేశవ ట్రేడర్స్ రూ.25, ఎస్‌ఎంఆర్ ట్రేడింగ్ కంపెనీ రూ.20.60 కేజీకి కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు. ఈ నలుగురు సప్లయిర్స్ ఈ వే బిల్లులు లేకుండా, ఏఎంసీ సెస్ చెల్లించనట్లు అధికారులు గుర్తించారు. ఈ బియ్యం విజయవాడ, కాకినాడ, గుంటూరు, చెన్నై, కర్ణాటక తదితర ప్రాంతాల నుంచి సుమారు 40 లారీల ద్వారా పోర్టులోని సీబోర్డ్ గోదాముకు తరలినట్లు అధికారులు గుర్తించారు. సంబంధిత కస్టమ్స్ హౌస్ ఏజెంట్లను విజిలెన్స్ అధికారులు విచారించగా అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో అధికారులు బియ్యాన్ని సీజ్ చేసి 6ఏ కింద కేసు నమోదు చేశారు. అదే క్రమంలో కృష్ణపట్నం పోర్టు పోలీస్‌స్టేషన్‌లో క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment