'సంక్షేమ పథకాలు శుద్ధ దండగ'
అనంతపురం : అనంతపురం ఎంపీ జేసీ దివాకర్రెడ్డి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రూ. 5 పెట్టి టీ కొంటున్నప్పుడు రూపాయికే చౌకధర బియ్యం ఎందుకివ్వాలని ప్రశ్నించారు. అనంతపురంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఉచిత విద్యుత్ పరిమిత స్థాయిలోనే ఉండాలన్నారు. ప్రభుత్వం కిలో బియ్యం రూ.1కే దారిద్ర్యరేఖకు దిగువన జీవిస్తున్న నిరుపేదలకు అందిస్తోంది గానీ, ప్రతి ఒక్కరూ రూ. 5 పెట్టి టీ తాగుతున్నప్పుడు ... కేజీ బియ్యం మాత్రం రూపాయికే ఇవ్వడం ఎంతవరకు సబబని జేసీ ప్రశ్నించారు.
సంక్షేమ పథకాలు శుద్ధ దండగ అని ఆయన అన్నారు. రాజకీయ పార్టీలన్నీ కేవలం ఓట్ల కోసమే సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నాయని వ్యాఖ్యానించారు. రూపాయికి కిలో బియ్యం వల్ల ప్రజలు మరింత సోమరిపోతులుగా మారే అవకాశం ఉందని ఆయన అన్నారు. బియ్యం పథకాన్ని ఎత్తేయాలని, మరింత ధర పెంచి.. ఆ అధిక ధరకే పేదలకు ఇవ్వాలని అనా్నరు. ఉచిత విద్యుత్ పథకం వల్ల రైతులకు విద్యుత్ విలువ తెలియడం లేదన్నారు. దీనికి కూడా మంగళం పాడి, రైతుల నుంచి సాధారణ ఫీజులు వసూలు చేయాలన్నారు.