200 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత
మిర్యాలగూడ రూరల్: మండలం పరిధిలోని రాయినిపాలెం గ్రామంలో భారీగా నిల్వ ఉంచిన 200 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని మిర్యాలగూడరూరల్ పోలీసులు మంగళవారం ఉదయం 5 గంటల సమయంలో పట్టుకున్నారు. ఎస్‌ఐ కుంట శ్రీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలో మూతబడిన పీఏసీఎస్ గోదాములో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని లారీలోకి డంపు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు సిబ్బందితో వెళ్లి బియ్యం పట్టుకున్నారు.
బియ్యం భారీగా ఉండడంతో మిర్యాలగూడ డీఎస్పీ రాంగోపాల్‌రావు దృష్టికి తీసుకెళ్లారు. డీఎస్పీ వెంటనే అక్కడకు చేరుకుని నిల్వ ఉంచిన బియ్యాన్ని పరిశీలించారు. అనంతరం బియ్యం ఎవరు నిల్వ చేశారన్న విషయంపై విచారించారు. బియ్యం నిల్వ చేసిన మిర్యాలగూడ పట్టణానికి చెందిన రమణ, సహకరించిన రాయినిపాలెం గ్రామానికి చెందిన జయమ్మ, బియాన్ని తరలించేందుకు వచ్చిన లారీ యజమాని శ్రీనివాస్, డ్రైవర్ సకృపై కేసు నమోదు చేశారు. పట్టుబడిన బియాన్ని సివిల్ సప్లయ్ అధికారులకు అప్పగించినట్లు తెలిపారు.