rice mill owners
-
ఎవరికీ హామీ ఇవ్వలే.. ధాన్యం గోల్‌మాల్‌లో కొత్త ట్విస్టు!
జోగులాంబ: గద్వాలలో ధాన్యం గోల్మాల్ వ్యవహారంలో కొత్త ట్విస్టు చోటుచేసుకుంది. ఈవ్యవహారంపై ఇటీవల మంత్రి జూపల్లి సమీక్షలో సివిల్‌సప్లయ్ శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేసిన విషయం విధితమే. అయితే, ప్రభుత్వం నుంచి మిల్లర్లకు ధాన్యం కేటాయించే సమయంలో సదరు మిల్లు యజమానితో పాటు అదనంగా మరో ముగ్గురితో హామీ తీసుకోవడం ప్రభుత్వ నిబంధన. అందుకు అనుగుణంగానే ప్రభుత్వం మిల్లర్లకు ధాన్యం కేటాయించే సమయంలో సదరు మిల్లర్ల నుంచి మిల్లు యజమానితో పాటు మరో ముగ్గురితో హామీ తీసుకుంది. అయితే రూ.కోట్ల విలువైన ధాన్యం గోల్మాల్ వ్యవహారంలో తాము ఎవరికీ హామీ ఇవ్వలేదని, తమ సంతకాలను ఫోర్జరీ చేశారని కొందరు వ్యక్తులు పోలీసు ఠాణా వెళ్లడం సంచలనంగా మారింది. ఈ విషయంపై సదరు ఠాణా అధికారి ధృవీకరించడం.. అయితే వారు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయలేదని చెప్పడం ధాన్యం గోల్మాల్ వ్యవహారం చర్చకు దారితీసింది. బియ్యం రికవరీలో ఉదాసీనత తాము ఎవరికీ ష్యూరిటీ ఇవ్వలేదని గగ్గోలు పెడుతున్న కొందరి రైస్‌మిల్లర్ల వాదనలో నిజమే ఉందా..? అనే చర్చ మొదలైంది. ప్రభుత్వానికి హామీ ఇచ్చి తప్పించుకోవాలని చూస్తే నేర తీవ్రత మరింత పెరుగుతుందని సదరు మిల్లర్లకు తెలుసు. మరి ఎక్కడ పొరపాటు జరిగింది. ఇందులో సివిల్‌సప్లయ్ శాఖ అధికారుల పాత్ర, మరికొందరి మిల్లర్ల పాత్ర పైనే సరికొత్త చర్చకు దారితీసింది. ఆదినుంచి సివిల్‌సప్లయ్ శాఖలోని కొందరు అధికారులు సీఎమ్మార్ రైస్ రికవరీపై వ్యవహరిస్తున్న ఉదాసీనత, అక్రమార్కులను కాపాడేలా చేస్తున్న యత్నాలు పలు అనుమానాలకు తావిస్తోంది. పైగా గ్యారంటీ హామీలు పెట్టిన రైస్‌మిల్లు యజమానులు రెండు మిల్లర్లకు సైతం డబుల్ గ్యారెంటీలు హామీలు ఇచ్చినట్లు అధికారుల రికార్డుల ద్వారా తెలుస్తుండడం కూడా పలు సందేహాలకు తెరలేపింది. హామీ ఇవ్వలే.. సూర్యాట్రేడర్స్ శాంతినగర్, కృష్ణారైస్ మిల్లు కాకులారం, అన్నపూర్ణ ట్రేడర్స్ గద్వాల రైస్‌మిల్లులకు 2021–22 రబీ, 2022–23 ఖరీఫ్ సీజన్లలో ప్రభుత్వం ధాన్యం కేటాయించింది. ఇందుకు సంబంధించి సదరు మూడు మిల్లు యజమానులతో పాటు మరో తొమ్మిది మంది రైస్‌మిల్లు యజమానులతో గ్యారెంటీలుగా హామీలు తీసుకుంది. రాజోలికి చెందిన వీరాంజనేయ రైస్ మిల్ యజమాని బి.సురేష్‌కుమార్, గద్వాలకు చెందిన విశాలక్ష్మి రైస్ ఇండస్ట్రీస్ యజమాని జి.సుదర్శన్, కాకులారానికి చెందిన కృష్ణ రైస్ మిల్ యజమాని కృష్ణగౌడ్, శాంతినగర్‌కు చెందిన భాను ట్రేడర్స్ యజమాని బి.అశోక్‌కుమార్, అయిజకు చెందిన ఈశ్వర్ రైస్ మిల్ యజమాని జి.తేజాశ్, గద్వాలకు చెందిన రాజారాజేశ్వరి రైస్ మిల్లు యజమాని యు.సుదర్శన్‌రెడ్డి, కోదండాపురానికి చెందిన శ్రీలక్ష్మీ వెంకట సాయి పీబీఆర్ఎం యజమాని పి.నర్సింహులు పైన పేర్కొన్న డిఫాల్టర్లుగా మారిన మూడు రైస్ మిల్లులకు గ్యారెంటీలు, హామీ (ష్యూరిటీ) ఇవ్వలేదని అధికారులు రికార్డు చూపెడుతున్నారు. అయితే ఇందులో ముగ్గురు రైస్‌మిల్లు యజమానులు తాము ఎలాంటి గ్యారెంటీలు, హామీ పెట్టలేదని తమ సంతకాలను ఫోర్జరీ చేసి తమను బలిచేస్తున్నారని పేర్కొంటూ మంగళవారం గద్వాల రూరల్ పోలీసుస్టేషన్‌కు వెళ్లారు. అక్కడి ఎస్ఐ ఆనంద్‌తో తమ గోడును వెల్లబోసుకున్నారు. అయితే దీనిపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయలేదు. నోటిమాటగా చెప్పారు.. ఈ విషయపై గద్వాల రూరల్ ఎస్ఐ ఆనంద్‌ను ‘సాక్షి’ సంప్రదించగా కొంతమంది రైస్‌మిల్లు యజమానులు తమ పోలీసుస్టేషన్‌కు వచ్చిన మాట నిజమేనని, అయితే వాళ్లు ఎలాంటి లిఖితపూర్వక ఫిర్యాదు చేయలేదని కేవలం నోటిమాట ద్వారా చెప్పారన్నారు. లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామని సమాధానమిచ్చారు. నోటీసులు ఇచ్చాం.. గ్యారెంటీలు, హామీలు ఇవ్వలేదని చెప్పడం పూర్తి అబద్దం. వీరందరికి ఇదివరకే నోటీసులు ఇచ్చాం. ఇప్పుడు ఆర్ఆర్ యాక్టు ప్రకారం తప్పకుండా మిల్లు యజమానులతోపాటు, గ్యారెంటీలు, హామీలు ఇచ్చినవారితో వసూలు చేస్తాం. ఈవిషయంలో కలెక్టర్ చాలా సీరియస్‌గా ఉన్నారు. ఆర్ఆర్ యాక్టు అమలుకు రంగం సిద్ధం. మంత్రి జూపల్లి హెచ్చరికల నేపథ్యంలో జిల్లా అధికారయంత్రాంగంలో కదలిక వచ్చింది. ధాన్యం తీసుకుని ఎగ్గొట్టిన వారిపై ఆర్ఆర్ యాక్టు అమలు చేసేందుకు రంగం సిద్ధం చేశాం. దీంతో అటు ధాన్యం ఇవ్వాల్సిన రైస్‌మిల్లర్లు, వారికి గ్యారెంటీ హామీలు ఇచ్చిన వారిలో దడ మొదలైంది. – రేవతి, డీఎస్ఓ సివిల్సప్లై శాఖ ఇవి కూడా చదవండి: మరొకరితో కలిసి తమ్ముడిని అన్న దారుణంగా.. -
తేమ, తాలు అంటూ.. తరుగు తీస్తే కఠిన చర్యలు
సాక్షి, హైదరాబాద్: రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యంలో తేమ, తాలు పేరుతో ఇష్టానుసారం కోత విధిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రైస్ మిల్లర్లను పౌర సరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి హెచ్చరించారు. కలెక్టర్లు స్వయంగా క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించాలని ఇప్పటికే ఆదేశాలిచ్చామన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రతీ ధాన్యం గింజను కొనుగోలు చేస్తామన్నారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ధాన్యాన్ని ఆరబెడితే గ్రామంలో ఉండే రైతు బంధు కోఆర్డినేటర్లు, వ్యవసాయ శాఖ అధికారులు పంట తేమ శాతం నిర్ధారించి టోకెన్లు అందజేస్తారన్నారు. గన్నీ సంచుల సమస్యను అధిగమించేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామని తెలిపారు. బిహార్ నుంచి హమాలీలు హమాలీల కొరతతో ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి లోడింగ్, అన్ లోడింగ్ కు సమస్యలు ఎదురవుతున్నాయని మారెడ్డి తెలిపారు. ఎక్కువగా బిహార్ నుంచి హమాలీలు వచ్చి ఇక్కడ పనిచేస్తారని, వారు ఇక్కడికి రావడానికి సంసిద్ధంగా ఉన్నారన్నారు. సీఎం ఆదేశాల మేరకు చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ బీహార్ ప్రభుత్వానికి లేఖ రాశారని, వాళ్లు ఇక్కడికి రావడానికి కావాల్సిన చర్యలు చేపడుతున్నామన్నారు. -
కేజీ ప్లాస్టిక్‌కు కిలో బియ్యం
సాక్షి, పెద్దపల్లి : ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు కేజీ ప్లాస్టిక్ వ్యర్థాలను తీసుకుని కిలో బియ్యం అందించేందుకు రైస్‌మిల్లర్లు సహకరించాలని కలెక్టర్ శ్రీదేవసేన సూచించారు. పర్యావరణానికి, భూగర్భ జలాల పెంపునకు ఆటంకం కలిగించే సింగిల్ యూస్డ్ ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించామని కలెక్టర్ తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ‘మా గృహం స్వచ్ఛ గృహం, ప్లాస్టిక్ నిర్మూలన అంశాలపై జిల్లా రైస్‌మిల్లర్లు, పెట్రోల్ బంక్ డీలర్లతో సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్వచ్ఛత పరిశుభ్రతకు జిల్లా యంత్రాంగం సమన్వయంతో పనిచేస్తుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో డంపింగ్‌యార్డు, శ్మశానవాటికల నిర్మా ణానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. గ్రామాల్లోని స్వశక్తి మహిళలకు ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణ నిర్వహణ బాధ్యతలను అప్పగించడంతోపాటు అవసరమైన శిక్షణ అందించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. స్వచ్ఛ శుక్రవారం కార్యక్రమంలో భాగంగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్‌తోపాటు పెద్దపల్లి, మంథని, సుల్తానాబాద్ మున్సిపాలిటీల్లో ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. జాతీయస్థాయిలో స్వచ్ఛతలో ఉత్తమ జిల్లాగా కీర్తి గడిచిన పెద్దపల్లిని అదేస్థాయిలో నిలిపేందుకు రైస్‌మిల్లర్లు, పెట్రోల్‌బంక్ డీలర్లు సహకరించాలని కోరారు. ప్లాస్టిక్ వ్యర్థాలను తీసుకుని కేజీ ప్లాస్టిక్‌కు కిలో బియ్యం అందించాలని కలెక్టర్ కోరగా రైస్‌మిల్లర్ల ప్రతినిధులు అందుకు అంగీకరించారు. అనంతరం జాతీయస్థాయిలో జిల్లాకు గుర్తింపు తీసుకవచ్చిన జిల్లా కలెక్టర్‌ను రైస్‌మిల్లర్లు, పెట్రోల్‌బంకుల ప్రతినిధులు సత్కరించారు. కార్యక్రమంలో జేసీ వనజాదేవి, జిల్లా ఫౌరసరఫరాల అధికారి వెంకటేశ్, సివిల్సప్లై జిల్లా మేనేజర్ ప్రవీణ్‌కుమార్ పాల్గొన్నారు. -
పగలంతా మూత.. రాత్రివేళ రీసైక్లింగ్
సాక్షి, వనపర్తి: నిరుపేద కుటుంబాల కోసం రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యంతో కొందరు అక్రమ వ్యాపారానికి తెర లేపారు. రైస్ మిల్లుల యజమానులతో కుమ్మక్కై గ్రామాల్లో రూ.10 లకే బియ్యాన్ని సేకరించి దానిని రీసైక్లింగ్ చేసి సన్నబియ్యంగా మార్చి అధిక రేట్లకు అమ్ముకుని లక్షలు గడిస్తున్నారు. ఈ విషయం గురించి అధికారులకు అందరికి తెలిసినా.. కొందరు నేరుగా ఫిర్యాదులు చేసినా ఇన్నాళ్లూ అధికారులు చూసీచూడనట్లు వదిలేశారు. అయితే ఇటీవల పాన్‌గల్ మండలం సీఎంఆర్ అనుమతి పొందిన పరమేశ్వరీ రైస్ మిల్లులో పెద్దఎత్తున అక్రమ రేషన్ బియ్యం నిల్వలను స్వయంగా కలెక్టర్ గుర్తించి కేసు నమోదు చేశారు. ఈ విషయం మరువకముందే మరో ఘరానా దళారుల బాగోతం వెలుగు చూస్తోంది. కొత్తకోట కేంద్రంగా.. ఈ రేషన్ దందా శ్రీరంగాపూర్ మండలానికి చెందిన ఇద్దరు, గద్వాల జిల్లాకు చెందిన ఇద్దరు వ్యక్తులు కలిసి చేస్తున్నారు. వనపర్తి, పెబ్బేరు, కొత్తకోట, వనపర్తి మున్సిపాలిటీ పరిధిలోని రేషన్ వినియోగదారుల నుంచి బియ్యం సేకరించడానికి కొందరిని నియమించుకున్నారు. వారంతా రాత్రి సమయాల్లో వాహనాల్లో గ్రామాలకు వెళ్లి బియ్యాన్ని సేకరించి కొత్తకోట మండలం నాటవెళ్లి గ్రామ శివారులోని ఓ రైస్ మిల్లులోకి తరలిస్తారు. ఇదివరకే ఆ రైస్ మిల్లుకు జిల్లా సివిల్ సప్లయ్ అధికారులు మరో ట్రేడర్ పేరుతో సీఎంఆర్ అనుమతి ఇచ్చారు. ప్రభుత్వం కొనుగోలు చేసిన వరిధాన్యంను ఆ రైస్ మిల్లుకు పంపించారు. సదరు మిల్లుకు కెటాయించిన సీఎంఆర్ కెటాయింపులకు అనుగుణంగా వారు రైస్ ప్రభుత్వానికి సరఫరా చేయాల్సి ఉంది. సరఫరా చేసే రైస్ స్థానంలో గ్రామాల్లో చోటా దళారులు సేకరించిన రేషన్ బియ్యం పంపించి రీసైక్లింగ్ చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. సీఎంఆర్ అనుమతి కూడా.. కొత్తకోట మండలం నాటవెళ్లి గ్రామ శివారులోని సప్తగిరి రైస్ మిల్లును మరో వ్యక్తి లీజుకు తీసుకుని వేరే పేరు సాయిచరణ్ ట్రేడర్స్ పేరుతో సీఎంఆర్ అనుమతి పొందారు. అనుమతి తీసుకున్న వ్యక్తికి బదులు ఇతరులు మిల్లు వద్ద కార్యకలాపాలు చేస్తూ అక్రమ దందాకు తెరలేపినట్లు సమాచారం. ఈ రైస్ మిల్లుకు సివిల్ సప్లయ్ అధికారులు 2114.660 మెట్రిక్ టన్నుల వరిధాన్యం సీఎంఆర్ కోసం అలాట్మెంట్ చేశారు. ఫలితంగా 1416.822 మెట్రిక్ టన్నుల రైస్ ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉండగా ఇప్పటివరకు 1266.340 రైస్ ప్రభుత్వానికి సరఫరా చేశారు. ఇంకా 150.482 మెట్రిక్ టన్నుల రైస్ ప్రభుత్వానికి సరఫరా చేయాల్సి ఉన్నట్లు ఎన్‌పోర్స్‌మెంటు టీడీ వేణు తెలిపారు. కార్యకలాపాలన్నీ రాత్రివేళే.. రీసైక్లింగ్ రేషన్ దందా కార్యకలాపాలను పూర్తిగా రాత్రి సమయంలోనే చేస్తారని తెలుస్తోంది. వనపర్తి, పెబ్బేరు, కొత్తకోట మండలాల్లోని గ్రామాల నుంచి ఆటోల్లో రాత్రి సమయాల్లో రేషన్ బియ్యం ఈ మిల్లులోకి చేర్చి ప్రభుత్వ ముద్ర ఉండే బ్యాగుల్లోకి రేషన్ బియ్యంగా మార్చి ప్రభుత్వానికి సరఫరా చేస్తారనే విమర్శలు ఉన్నాయి. నేషనల్ హైవే 44కు ఆనుకుని ఉన్న కారణంగా అక్రమార్కులకు రీసైక్లింగ్ రేషన్ దందా చేయటం చాలా సులభమైందని చెప్పవచ్చు. నామమాత్రంగా తనిఖీలు ఈ మిల్లులో అక్రమ రేషన్ దందా యదేచ్ఛగా కొనసాగుతుందని ఫిర్యాదులు రావటంతో సివిల్ సప్లయ్ అధికారులు నామమాత్రంగా దాడులు చేశారు. దీంతో జిల్లాస్థాయి అధికారి ఒకరు కొత్తకోట తహసీల్దార్‌ను మిల్లును తనిఖీ చేయాలని ఆదేశించటంతో మిల్లు వద్దకు వెళ్లిన తహసీల్దార్ లోపల కొన్ని బ్యాగులు ఉండటాన్ని గమనించి మిల్లును సీజ్ చేశారు. లోపల ఉన్న బియ్యం రేషన్ బియ్యమా.. కాదా అని తెలుసుకునేందుకు తహసీల్దార్ టెక్నికల్ విభాగం అధికారులకు సిఫారస్ చేశారు. మా దృష్టికి రాలేదు రేషన్ బియ్యం రిసైక్లింగ్ చేస్తున్న విషయం మా దృష్టికి రాలేదు. ఇదివరకే కలెక్టర్‌కు ఫిర్యాదులు వస్తే కొత్తకోట తహసీల్దార్ మిల్లును తనిఖీ చేశారు. అక్కడ ఉన్న బస్తాలతో సహా మిల్లుకు సీల్ వేశారు. టెక్నికల్ అధికారులతో విచారణ చేయించి తదుపరి నిర్ణయం తీసుకుంటాం. మిల్లులో ఉన్న బియ్యం బస్తాలు ఇదివరకే ప్రభుత్వానికి పంపించాం. రిటర్న్ చేసినవని డీటీ ఎన్‌ఫోర్స్‌మెంటు వేణు తెలిపారు. – రేవతి, డీఎస్ఓ ఇలాచేస్తే.. నిజాలు తెలుస్తాయి సప్తగిరి రైస్ మిల్లుకు ఆరు నెలలుగా వచ్చిన కరెంటు బిల్లులను పరిశీలిస్తే ఎంతమేరకు మిల్లులోని మిషన్లు నడింపించారో తెలుస్తోంది. ప్రతి మిల్లుకు సాధారణంగా మిషన్లు నడిస్తే తక్కువలో తక్కువ రూ.లక్షలోపు బిల్లు వస్తుంది. కానీ ఈ మిల్లుకు గడిచిన నెల విద్యుత్ మిల్లు కేవలం రూ.12,197 మాత్రమే వచ్చింది. ఈ కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తే నిజాలు వెలుగుచూసే అవకాశం ఉంటుంది. అలాగే అమరచింత మండలానికి చెందిన దాసరి రాజశేఖర్ అనే వ్యక్తి అక్రమ రేషన్ దందా చేస్తూ ఏడుసార్లు పట్టుబడ్డాడు. అతనిపై కేసు కూడా నమోదు అయ్యింది. కౌన్సిలింగ్ ఇచ్చినా మారకపోవటంతో ఎస్పీ స్వయంగా అతనిపై పీడీ యాక్టు కేసు నమోదు చేశారు. ఇలాంటివారు జిల్లా వ్యాప్తంగా చాలామందే ఉన్నారు. లోతుగా విచారణ చేస్తే అక్ర మార్కుల లిస్టు బయటపడుతుంది. -
రైస్ మిల్ నిర్వాహకులు అరెస్ట్
కదిరి(అనంతపురం): చిత్తూరు జిల్లాకు చెందిన లక్ష్మీ వెంకటేశ్వర రైస్ మిల్ నిర్వాహకులు కిశోర్, రెడ్డెప్పలను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరు పలు జిల్లాల్లో రైతులు, మిల్లర్ల నుంచి ధాన్యం కొనుగోలు చేసి మోసం చేశారు. ఇటీవల అనంతపురం జిల్లా తలుపుల మండలం బట్రేపల్లికి చెందిన వేణుగోపాల్ అనే రైస్ మిల్లు యజమాని నుంచి ధాన్యం సేకరించి రూ. 9.50 లక్షల మేర ఎగ్గొట్టారు. ఆయన నేరుగా కోర్టును ఆశ్రయించటంతో కోర్టు ఉత్తర్వుల మేరకు తలుపుల పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. రైతులు, రైస్‌మిల్లు యజమానులను రూ.3 కోట్ల మేర మోసగించినట్లు తమ విచారణలో తేలిందని పోలీసులు వెల్లడించారు. వీరిని ధర్మవరం కోర్టులో హాజరుపరిచి, విచారణ నిమిత్తం కోర్టు అనుమతితో తిరిగి కస్టడీలోకి తీసుకుంటామన్నారు.