జోగులాంబ: గద్వాలలో ధాన్యం గోల్‌మాల్ వ్యవహారంలో కొత్త ట్విస్టు చోటుచేసుకుంది. ఈవ్యవహారంపై ఇటీవల మంత్రి జూపల్లి సమీక్షలో సివిల్‌సప్లయ్ శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేసిన విషయం విధితమే. అయితే, ప్రభుత్వం నుంచి మిల్లర్లకు ధాన్యం కేటాయించే సమయంలో సదరు మిల్లు యజమానితో పాటు అదనంగా మరో ముగ్గురితో హామీ తీసుకోవడం ప్రభుత్వ నిబంధన.
అందుకు అనుగుణంగానే ప్రభుత్వం మిల్లర్లకు ధాన్యం కేటాయించే సమయంలో సదరు మిల్లర్ల నుంచి మిల్లు యజమానితో పాటు మరో ముగ్గురితో హామీ తీసుకుంది. అయితే రూ.కోట్ల విలువైన ధాన్యం గోల్‌మాల్ వ్యవహారంలో తాము ఎవరికీ హామీ ఇవ్వలేదని, తమ సంతకాలను ఫోర్జరీ చేశారని కొందరు వ్యక్తులు పోలీసు ఠాణా వెళ్లడం సంచలనంగా మారింది. ఈ విషయంపై సదరు ఠాణా అధికారి ధృవీకరించడం.. అయితే వారు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయలేదని చెప్పడం ధాన్యం గోల్‌మాల్ వ్యవహారం చర్చకు దారితీసింది.
బియ్యం రికవరీలో ఉదాసీనత
తాము ఎవరికీ ష్యూరిటీ ఇవ్వలేదని గగ్గోలు పెడుతున్న కొందరి రైస్‌మిల్లర్ల వాదనలో నిజమే ఉందా..? అనే చర్చ మొదలైంది. ప్రభుత్వానికి హామీ ఇచ్చి తప్పించుకోవాలని చూస్తే నేర తీవ్రత మరింత పెరుగుతుందని సదరు మిల్లర్లకు తెలుసు. మరి ఎక్కడ పొరపాటు జరిగింది. ఇందులో సివిల్‌సప్లయ్ శాఖ అధికారుల పాత్ర, మరికొందరి మిల్లర్ల పాత్ర పైనే సరికొత్త చర్చకు దారితీసింది. ఆదినుంచి సివిల్‌సప్లయ్ శాఖలోని కొందరు అధికారులు సీఎమ్మార్ రైస్ రికవరీపై వ్యవహరిస్తున్న ఉదాసీనత, అక్రమార్కులను కాపాడేలా చేస్తున్న యత్నాలు పలు అనుమానాలకు తావిస్తోంది. పైగా గ్యారంటీ హామీలు పెట్టిన రైస్‌మిల్లు యజమానులు రెండు మిల్లర్లకు సైతం డబుల్ గ్యారెంటీలు హామీలు ఇచ్చినట్లు అధికారుల రికార్డుల ద్వారా తెలుస్తుండడం కూడా పలు సందేహాలకు తెరలేపింది.
హామీ ఇవ్వలే..
సూర్యాట్రేడర్స్ శాంతినగర్, కృష్ణారైస్ మిల్లు కాకులారం, అన్నపూర్ణ ట్రేడర్స్ గద్వాల రైస్‌మిల్లులకు 2021–22 రబీ, 2022–23 ఖరీఫ్ సీజన్లలో ప్రభుత్వం ధాన్యం కేటాయించింది. ఇందుకు సంబంధించి సదరు మూడు మిల్లు యజమానులతో పాటు మరో తొమ్మిది మంది రైస్‌మిల్లు యజమానులతో గ్యారెంటీలుగా హామీలు తీసుకుంది.
రాజోలికి చెందిన వీరాంజనేయ రైస్ మిల్ యజమాని బి.సురేష్‌కుమార్, గద్వాలకు చెందిన విశాలక్ష్మి రైస్ ఇండస్ట్రీస్ యజమాని జి.సుదర్శన్, కాకులారానికి చెందిన కృష్ణ రైస్ మిల్ యజమాని కృష్ణగౌడ్, శాంతినగర్‌కు చెందిన భాను ట్రేడర్స్ యజమాని బి.అశోక్‌కుమార్, అయిజకు చెందిన ఈశ్వర్ రైస్ మిల్ యజమాని జి.తేజాశ్, గద్వాలకు చెందిన రాజారాజేశ్వరి రైస్ మిల్లు యజమాని యు.సుదర్శన్‌రెడ్డి, కోదండాపురానికి చెందిన శ్రీలక్ష్మీ వెంకట సాయి పీబీఆర్‌ఎం యజమాని పి.నర్సింహులు పైన పేర్కొన్న డిఫాల్టర్లుగా మారిన మూడు రైస్ మిల్లులకు గ్యారెంటీలు, హామీ (ష్యూరిటీ) ఇవ్వలేదని అధికారులు రికార్డు చూపెడుతున్నారు. అయితే ఇందులో ముగ్గురు రైస్‌మిల్లు యజమానులు తాము ఎలాంటి గ్యారెంటీలు, హామీ పెట్టలేదని తమ సంతకాలను ఫోర్జరీ చేసి తమను బలిచేస్తున్నారని పేర్కొంటూ మంగళవారం గద్వాల రూరల్ పోలీసుస్టేషన్‌కు వెళ్లారు. అక్కడి ఎస్‌ఐ ఆనంద్‌తో తమ గోడును వెల్లబోసుకున్నారు. అయితే దీనిపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయలేదు.
నోటిమాటగా చెప్పారు..
ఈ విషయపై గద్వాల రూరల్ ఎస్‌ఐ ఆనంద్‌ను ‘సాక్షి’ సంప్రదించగా కొంతమంది రైస్‌మిల్లు యజమానులు తమ పోలీసుస్టేషన్‌కు వచ్చిన మాట నిజమేనని, అయితే వాళ్లు ఎలాంటి లిఖితపూర్వక ఫిర్యాదు చేయలేదని కేవలం నోటిమాట ద్వారా చెప్పారన్నారు. లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామని సమాధానమిచ్చారు.
నోటీసులు ఇచ్చాం..
గ్యారెంటీలు, హామీలు ఇవ్వలేదని చెప్పడం పూర్తి అబద్దం. వీరందరికి ఇదివరకే నోటీసులు ఇచ్చాం. ఇప్పుడు ఆర్‌ఆర్ యాక్టు ప్రకారం తప్పకుండా మిల్లు యజమానులతోపాటు, గ్యారెంటీలు, హామీలు ఇచ్చినవారితో వసూలు చేస్తాం. ఈవిషయంలో కలెక్టర్ చాలా సీరియస్‌గా ఉన్నారు. ఆర్‌ఆర్ యాక్టు అమలుకు రంగం సిద్ధం. మంత్రి జూపల్లి హెచ్చరికల నేపథ్యంలో జిల్లా అధికారయంత్రాంగంలో కదలిక వచ్చింది. ధాన్యం తీసుకుని ఎగ్గొట్టిన వారిపై ఆర్‌ఆర్ యాక్టు అమలు చేసేందుకు రంగం సిద్ధం చేశాం. దీంతో అటు ధాన్యం ఇవ్వాల్సిన రైస్‌మిల్లర్లు, వారికి గ్యారెంటీ హామీలు ఇచ్చిన వారిలో దడ మొదలైంది. – రేవతి, డీఎస్‌ఓ సివిల్‌సప్లై శాఖ
ఇవి కూడా చదవండి: మరొకరితో కలిసి తమ్ముడిని అన్న దారుణంగా..
Comments
Please login to add a commentAdd a comment