సాక్షి, హైదరాబాద్: రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యంలో తేమ, తాలు పేరుతో ఇష్టానుసారం కోత విధిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రైస్ మిల్లర్లను పౌర సరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి హెచ్చరించారు. కలెక్టర్లు స్వయంగా క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించాలని ఇప్పటికే ఆదేశాలిచ్చామన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రతీ ధాన్యం గింజను కొనుగోలు చేస్తామన్నారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ధాన్యాన్ని ఆరబెడితే గ్రామంలో ఉండే రైతు బంధు కోఆర్డినేటర్లు, వ్యవసాయ శాఖ అధికారులు పంట తేమ శాతం నిర్ధారించి టోకెన్లు అందజేస్తారన్నారు. గన్నీ సంచుల సమస్యను అధిగమించేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామని తెలిపారు.
బిహార్ నుంచి హమాలీలు
హమాలీల కొరతతో ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి లోడింగ్, అన్ లోడింగ్ కు సమస్యలు ఎదురవుతున్నాయని మారెడ్డి తెలిపారు. ఎక్కువగా బిహార్ నుంచి హమాలీలు వచ్చి ఇక్కడ పనిచేస్తారని, వారు ఇక్కడికి రావడానికి సంసిద్ధంగా ఉన్నారన్నారు. సీఎం ఆదేశాల మేరకు చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ బీహార్ ప్రభుత్వానికి లేఖ రాశారని, వాళ్లు ఇక్కడికి రావడానికి కావాల్సిన చర్యలు చేపడుతున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment