సాక్షి, హైదరాబాద్ : డేట్ డ్రగ్ ఎంఫెటమైన్ (8.5 కేజీలు) భారీస్థాయిలో పట్టుబడింది. దీనిని రేప్ డ్రగ్ అని కూడా అంటారు. డేటింగ్ పేరుతో యువతులను తీసుకెళ్లి వారికి తెలియకుండా వారు తాగే నీరు, కూల్‌డ్రింక్స్‌లో కలిపి ఇచ్చేసి అప స్మారక స్థితిలోకి చేరాక అఘాయిత్యాలకు పాల్పడటానికి కొందరు ఈ డ్రగ్‌ను వినియోగిస్తారు. అంతర్జాతీయ మార్కెట్‌లో దీని విలువ రూ.8.5 కోట్లు ఉంటుందని నగర పోలీసు కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి తెలిపారు. డీసీపీలు సాధన రష్మి పెరుమాళ్, వైవీఎస్.సుధీంద్రలతో కలిసి సోమవారం ఏర్పాటు చేసిన విలేక రుల సమావేశంలో హైదరాబాద్ సీపీ ఆ వివరాలు వెల్లడించారు.
బౌరంపేటకు చెందిన గోసుకొండ అంజిరెడ్డి సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో చంద్రారెడ్డి గార్డెన్స్ పేరుతో ఫంక్షన్‌హాల్, స్విమ్మింగ్ పూల్ నిర్వహించేవాడు. సాయికుమార్‌గౌడ్, రాకే‹శ్ కొన్నాళ్ల క్రితం ఫార్మా కంపెనీల్లో పనిచేశారు. వీరికి కెమికల్ ప్రాసెసింగ్‌పై పట్టు ఉంది. వీరితో కలిసి అల్ప్రాజోలం తయారు చేయాలని అంజిరెడ్డి పథకం వేశాడు. కొత్తపల్లికి చెందిన ప్రభాకర్‌గౌడ్ సహకారంతో అదే గ్రామంలో ఓ కోళ్ల ఫారం అద్దెకు తీసుకున్నారు. అందులో ఓ గదిలో డ్రగ్స్ ప్రాసెసింగ్‌కు అవసరమైన రియాక్టర్ ఏర్పాటు చేశారు.
అంజిరెడ్డి బాలానగర్ నుంచి ముడి సరుకులు ఖరీదు చేసి ఇచ్చేవాడు. వీటిని వినియోగించి సాయి, రాకేశ్‌లు అల్ప్రాజోలం, ఎంఫిటమైన్ తయారు చేసేవారు. డిప్రెషన్ వంటి రుగ్మతలకు వైద్యుల చీటీ ఆధారంగా విక్రయించే ఔషధాలను తయారు చేయడానికి ఈ రెండింటినీ వాడతారు. వీటిని దుర్వినియోగం చేస్తూ మాదకద్రవ్యాలుగా వీరు విక్రయించడం మొదలు పెట్టారు.
టీజీ ఏఎన్‌బీకి ఫిర్యాదుతో....
ల్యాబ్‌లో మిగిలిన రసాయన వ్యర్థాలను కొత్తపల్లి శివార్లలో పడేసేవారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అక్కడ వస్తున్న వాసనలతో స్థానికులు దీనిపై టీజీ ఏఎన్‌బీకి ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు జూన్ 18న దాడి చేసి అంజిరెడ్డి తదితరులను అరెస్టు చేసి 2.6 కేజీల అల్ప్రాజోలం స్వాధీనం చేసుకున్నారు. ఇదే ల్యాబ్‌లో అంజిరెడ్డి ఎంఫిటమైన్ తయారు చేయించాడు. అరెస్టు కావడానికి పదిరోజుల ముందు తన అనుచరుడైన కుంచల నాగరాజును పిలిచాడు.
తన వద్ద ఉన్న 8.5 కేజీల ఎంఫిటమైన్‌ను అప్పగించి భద్రపర చాలన్నాడు. అంజిరెడ్డి అరెస్టు కావడం.. జైలుకు వెళ్లి రెండు నెలలు దాటినా అతడు బయటకు రాకపోవడంతో నాగరాజు ఆ సరుకును ముందు గ్రామం నుంచి నగరానికి చేరుద్దామని, ఆపై ఖరీదు చేయ డానికి ఆసక్తి చూపిన వారికి విక్రయిద్దామని భావించాడు. దీనికోసం వినోద్‌కుమార్‌గౌడ్, శ్రీశైలంలను సంప్రదించాడు. ఈ ముగ్గురూ కలిసి వాహనంలో ఎంఫిటమైన్ పెట్టుకొని బయలుదేరారు. దీనిపై హెచ్–న్యూకు సమాచారం అందింది.
బోయిన్‌పల్లి చౌరస్తా వద్ద కాపుకాసి...
ఇన్‌స్పెక్టర్లు శ్రీనివాస్, డానియేల్, బోయిన్ పల్లి ఇన్ స్పెక్టర్ బి.లక్ష్మీనారాయణరెడ్డి బోయిన్‌పల్లి చౌరస్తా వద్ద కాపుకాశారు. అటుగా వస్తున్న వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా ఎంఫిటమైన్ దొరికింది. దీంతో ముగ్గురు నిందితులను అరెస్టు చేసి డ్రగ్‌తో పాటు వాహనం స్వాధీనం చేసుకున్నారు. ‘అత్యంత తీవ్ర ప్రభావం చూపే ఈ డ్రగ్‌ను ముక్కు ద్వారా పీల్చడం, నీరు/కూల్‌డ్రింక్స్‌లో కలిపి తాగడం, నీళ్లల్లో కలిపి ఇంజెక్షన్‌లా చేసుకోవడం ద్వారా సేవిస్తుంటారు.
అనేక మందికి తెలియకుండానే దీనిని కూల్‌డ్రింక్‌లో కలిపి ఇచ్చి వారినీ బానిసలుగా మారు స్తారు. ఈ నేపథ్యంలోనే అపరిచితులు, డ్రగ్స్ అలవాటు ఉన్నవారు ఇచ్చే పార్టీలకు యువత వెళ్లకూడదు. ఈ కేసులో అంజిరెడ్డి కూడా నిందితుడిగా ఉన్నాడు. ప్రస్తుతం జైల్లో ఉన్న అతడిని పీటీ వారెంట్‌పై అరెస్టు చేస్తాం’ అని కొత్వాల్ శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment