
నిందితులు నాగవర్ధిని, దాసరి శ్రీనివాస్‌రెడ్డి
సాక్షి, బంజారాహిల్స్: టీవీ సీరియల్స్‌లో జరిగే ట్విస్ట్‌లను నిజ జీవితంలో కూడా ఆ టీవీ సీరియల్ నటులు చూపించారు. గుప్పెడంత మనసు, గుండమ్మ కథ సీరియల్స్‌లో నటిస్తున్న నాగవర్ధిని తమ ప్రేమకు అడ్డు వస్తున్నాడని తాజా ప్రియుడితో కలిసి మాజీ ప్రియుడిని రెండో అంతస్తు నుంచి కిందకు తోసి హత్యాయత్నానికి పాల్పడిన ఘటనలో బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి చంచల్‌గూడ జైలుకు తరలించారు.
వివరాల్లోకి వెళ్తే... యూసుఫ్‌గూడ శ్రీకృష్ణానగర్ సమీపంలోని హనుమాన్ టెంపుల్ వద్ద ఉంటున్న తిరుమారెడ్డి సూర్యనారాయణ సినిమాలు, టీవీ సీరియల్స్‌లో నటిస్తున్నాడు. ఆతడితో పాటు నటిస్తున్న నాగవర్ధినితో సూర్యనారాయణ నాలుగేళ్ల పాటు సహజీవనం చేశాడు. ఇటీవల మనస్పర్థలు రావడంతో విడిపోయారు. ఈ నేపథ్యంలో నాలుగు నెలల నుంచి నాగవర్ధిని తనతో పాటు టీవీ సీరియళ్లలో నటిస్తున్న దాసరి శ్రీనివాస్‌రెడ్డితో ప్రేమలో పడింది. ఇద్దరూ కలిసి సహజీవనం చేస్తున్నారు.
ఒకే అపార్ట్‌మెంట్‌లో మాజీ ప్రియుడు సూర్యనారాయణ ఓ గదిలో ఉంటుండగా నాగవర్ధిని, శ్రీనివాస్‌రెడ్డి మరో గదిలో అద్దెకుండేవారు. తరచూ సూర్యనారాయణతో వీరికి గొడవలు జరుగుతున్నాయి. రెండు రోజుల క్రితం నేరుగా నాగవర్ధిని ఇంట్లోకి వచ్చిన సూర్యనారాయణ ఆమెతో గొడవపడి శ్రీనివాస్‌రెడ్డిని వదిలేయాలని తనతో ఉండాలని వాగ్వాదానికి దిగాడు.
తమ ప్రేమకు అడ్డు పడుతున్నాడని భావించిన నాగవర్ధిని, శ్రీనివాస్‌రెడ్డి ఇద్దరూ పథకం ప్రకారం సూర్యనారాయణను రెండో అంతస్తు నుంచి కిందకు తోసేశారు. అతడికి తీవ్ర గాయాలు కాగా పంజగుట్టలోని మురుగన్ ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. నాగవర్ధిని, శ్రీనివాస్‌రెడ్డిలపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment