Recycling danda
-
పగలంతా మూత.. రాత్రివేళ రీసైక్లింగ్
సాక్షి, వనపర్తి: నిరుపేద కుటుంబాల కోసం రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యంతో కొందరు అక్రమ వ్యాపారానికి తెర లేపారు. రైస్ మిల్లుల యజమానులతో కుమ్మక్కై గ్రామాల్లో రూ.10 లకే బియ్యాన్ని సేకరించి దానిని రీసైక్లింగ్ చేసి సన్నబియ్యంగా మార్చి అధిక రేట్లకు అమ్ముకుని లక్షలు గడిస్తున్నారు. ఈ విషయం గురించి అధికారులకు అందరికి తెలిసినా.. కొందరు నేరుగా ఫిర్యాదులు చేసినా ఇన్నాళ్లూ అధికారులు చూసీచూడనట్లు వదిలేశారు. అయితే ఇటీవల పాన్‌గల్ మండలం సీఎంఆర్ అనుమతి పొందిన పరమేశ్వరీ రైస్ మిల్లులో పెద్దఎత్తున అక్రమ రేషన్ బియ్యం నిల్వలను స్వయంగా కలెక్టర్ గుర్తించి కేసు నమోదు చేశారు. ఈ విషయం మరువకముందే మరో ఘరానా దళారుల బాగోతం వెలుగు చూస్తోంది. కొత్తకోట కేంద్రంగా.. ఈ రేషన్ దందా శ్రీరంగాపూర్ మండలానికి చెందిన ఇద్దరు, గద్వాల జిల్లాకు చెందిన ఇద్దరు వ్యక్తులు కలిసి చేస్తున్నారు. వనపర్తి, పెబ్బేరు, కొత్తకోట, వనపర్తి మున్సిపాలిటీ పరిధిలోని రేషన్ వినియోగదారుల నుంచి బియ్యం సేకరించడానికి కొందరిని నియమించుకున్నారు. వారంతా రాత్రి సమయాల్లో వాహనాల్లో గ్రామాలకు వెళ్లి బియ్యాన్ని సేకరించి కొత్తకోట మండలం నాటవెళ్లి గ్రామ శివారులోని ఓ రైస్ మిల్లులోకి తరలిస్తారు. ఇదివరకే ఆ రైస్ మిల్లుకు జిల్లా సివిల్ సప్లయ్ అధికారులు మరో ట్రేడర్ పేరుతో సీఎంఆర్ అనుమతి ఇచ్చారు. ప్రభుత్వం కొనుగోలు చేసిన వరిధాన్యంను ఆ రైస్ మిల్లుకు పంపించారు. సదరు మిల్లుకు కెటాయించిన సీఎంఆర్ కెటాయింపులకు అనుగుణంగా వారు రైస్ ప్రభుత్వానికి సరఫరా చేయాల్సి ఉంది. సరఫరా చేసే రైస్ స్థానంలో గ్రామాల్లో చోటా దళారులు సేకరించిన రేషన్ బియ్యం పంపించి రీసైక్లింగ్ చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. సీఎంఆర్ అనుమతి కూడా.. కొత్తకోట మండలం నాటవెళ్లి గ్రామ శివారులోని సప్తగిరి రైస్ మిల్లును మరో వ్యక్తి లీజుకు తీసుకుని వేరే పేరు సాయిచరణ్ ట్రేడర్స్ పేరుతో సీఎంఆర్ అనుమతి పొందారు. అనుమతి తీసుకున్న వ్యక్తికి బదులు ఇతరులు మిల్లు వద్ద కార్యకలాపాలు చేస్తూ అక్రమ దందాకు తెరలేపినట్లు సమాచారం. ఈ రైస్ మిల్లుకు సివిల్ సప్లయ్ అధికారులు 2114.660 మెట్రిక్ టన్నుల వరిధాన్యం సీఎంఆర్ కోసం అలాట్మెంట్ చేశారు. ఫలితంగా 1416.822 మెట్రిక్ టన్నుల రైస్ ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉండగా ఇప్పటివరకు 1266.340 రైస్ ప్రభుత్వానికి సరఫరా చేశారు. ఇంకా 150.482 మెట్రిక్ టన్నుల రైస్ ప్రభుత్వానికి సరఫరా చేయాల్సి ఉన్నట్లు ఎన్‌పోర్స్‌మెంటు టీడీ వేణు తెలిపారు. కార్యకలాపాలన్నీ రాత్రివేళే.. రీసైక్లింగ్ రేషన్ దందా కార్యకలాపాలను పూర్తిగా రాత్రి సమయంలోనే చేస్తారని తెలుస్తోంది. వనపర్తి, పెబ్బేరు, కొత్తకోట మండలాల్లోని గ్రామాల నుంచి ఆటోల్లో రాత్రి సమయాల్లో రేషన్ బియ్యం ఈ మిల్లులోకి చేర్చి ప్రభుత్వ ముద్ర ఉండే బ్యాగుల్లోకి రేషన్ బియ్యంగా మార్చి ప్రభుత్వానికి సరఫరా చేస్తారనే విమర్శలు ఉన్నాయి. నేషనల్ హైవే 44కు ఆనుకుని ఉన్న కారణంగా అక్రమార్కులకు రీసైక్లింగ్ రేషన్ దందా చేయటం చాలా సులభమైందని చెప్పవచ్చు. నామమాత్రంగా తనిఖీలు ఈ మిల్లులో అక్రమ రేషన్ దందా యదేచ్ఛగా కొనసాగుతుందని ఫిర్యాదులు రావటంతో సివిల్ సప్లయ్ అధికారులు నామమాత్రంగా దాడులు చేశారు. దీంతో జిల్లాస్థాయి అధికారి ఒకరు కొత్తకోట తహసీల్దార్‌ను మిల్లును తనిఖీ చేయాలని ఆదేశించటంతో మిల్లు వద్దకు వెళ్లిన తహసీల్దార్ లోపల కొన్ని బ్యాగులు ఉండటాన్ని గమనించి మిల్లును సీజ్ చేశారు. లోపల ఉన్న బియ్యం రేషన్ బియ్యమా.. కాదా అని తెలుసుకునేందుకు తహసీల్దార్ టెక్నికల్ విభాగం అధికారులకు సిఫారస్ చేశారు. మా దృష్టికి రాలేదు రేషన్ బియ్యం రిసైక్లింగ్ చేస్తున్న విషయం మా దృష్టికి రాలేదు. ఇదివరకే కలెక్టర్‌కు ఫిర్యాదులు వస్తే కొత్తకోట తహసీల్దార్ మిల్లును తనిఖీ చేశారు. అక్కడ ఉన్న బస్తాలతో సహా మిల్లుకు సీల్ వేశారు. టెక్నికల్ అధికారులతో విచారణ చేయించి తదుపరి నిర్ణయం తీసుకుంటాం. మిల్లులో ఉన్న బియ్యం బస్తాలు ఇదివరకే ప్రభుత్వానికి పంపించాం. రిటర్న్ చేసినవని డీటీ ఎన్‌ఫోర్స్‌మెంటు వేణు తెలిపారు. – రేవతి, డీఎస్ఓ ఇలాచేస్తే.. నిజాలు తెలుస్తాయి సప్తగిరి రైస్ మిల్లుకు ఆరు నెలలుగా వచ్చిన కరెంటు బిల్లులను పరిశీలిస్తే ఎంతమేరకు మిల్లులోని మిషన్లు నడింపించారో తెలుస్తోంది. ప్రతి మిల్లుకు సాధారణంగా మిషన్లు నడిస్తే తక్కువలో తక్కువ రూ.లక్షలోపు బిల్లు వస్తుంది. కానీ ఈ మిల్లుకు గడిచిన నెల విద్యుత్ మిల్లు కేవలం రూ.12,197 మాత్రమే వచ్చింది. ఈ కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తే నిజాలు వెలుగుచూసే అవకాశం ఉంటుంది. అలాగే అమరచింత మండలానికి చెందిన దాసరి రాజశేఖర్ అనే వ్యక్తి అక్రమ రేషన్ దందా చేస్తూ ఏడుసార్లు పట్టుబడ్డాడు. అతనిపై కేసు కూడా నమోదు అయ్యింది. కౌన్సిలింగ్ ఇచ్చినా మారకపోవటంతో ఎస్పీ స్వయంగా అతనిపై పీడీ యాక్టు కేసు నమోదు చేశారు. ఇలాంటివారు జిల్లా వ్యాప్తంగా చాలామందే ఉన్నారు. లోతుగా విచారణ చేస్తే అక్ర మార్కుల లిస్టు బయటపడుతుంది. -
రేషన్ బియ్యాన్ని నూకలుగా మార్చి..
సాక్షి, కామారెడ్డి: రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా సర్కారు ఎన్ని చర్యలు తీసుకుంటుందో.. తమ దందా కొనసాగించడానికి బియ్యం మాఫియా అంతకన్నా ఎక్కువే ప్రయత్నిస్తోంది. ఎప్పటికప్పుడు కొత్త దారులు వెతుకుతూ దర్జాగా అక్రమ దందా సాగిస్తోంది. తాజాగా అధికారుల కళ్లుగప్పేందుకు రేషన్ బియ్యాన్ని నూకలుగా మార్చి సరిహద్దులు దాటిస్తూ సొమ్ము చేసుకుంటోంది. బియ్యం స్మగ్లర్లు చట్టానికి చిక్కకుండా ఎప్పటికప్పుడు కొత్త దారులు వెతుకుతున్నారు. ముఖ్యంగా పేదలకు పంపిణీ చేసే రే షన్ బియ్యంతో సొమ్ము చేసుకోవడానికి అలవా టుపడ్డ కొందరు.. తమ దందాలో కొత్తదారులు వెతుకుతూ రెండు చేతులా సంపాదిస్తున్నారు. రేషన్ బియ్యాన్ని ఇతర ప్రాంతాలకు రవాణా చేయాలంటే అనేక సమస్యలు ఎదురవుతాయి. ఎక్కడో ఒక చోట లీకై లారీలకు లారీలు సీజ్ అవుతున్న నేపథ్యంలో స్మగ్లర్లు బియ్యాన్ని నూకలుగా మార్చి కొత్త దందా మొదలుపెట్టారు. వేరే రాష్ట్రాల్లో నూక క్వింటాలుకు రూ. 2 వేల నుంచి రూ. 2,200 వరకు ధర పలుకుతోంది. దీంతో వారు ఈ కొత్తదారి వెతుక్కున్నారు. నూకలుగా మార్చి.. బియ్యం మాఫియా రేషన్‌కార్డుదారులకు కిలోకు రూ. 10 నుంచి రూ. 12 చొప్పున ఇస్తూ రేషన్ బియ్యం సేకరిస్తోంది. అనంతరం రేషన్ బియ్యాన్ని రీ సైక్లింగ్ చేసి నూకలుగా మారుస్తున్నారు. నూకలను బస్తాల్లో నింపి ఏదో ఒక రైస్‌మిల్లు పేరుతో దర్జాగా ఇతర రాష్ట్రాలకు సర ఫరా చేస్తున్నారు. రేషన్ బియ్యం అమ్మడానికి ఎందరినో మేనేజ్ చేయాల్సి రావడం, అంత చే సినా ఎక్కడో ఒక చోట చిక్కుతుండడంతో ఏ ఇబ్బందీ లేకుండా నూక దందా మొదలుపెట్టారు. కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున నూక ఇతర రాష్ట్రాలకు తరలుతోంది. ముఖ్యంగా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలతో పాటు రాయలసీమ ప్రాంతానికి పెద్ద ఎత్తున నూకలు రవాణా చేస్తున్నట్లు తెలుస్తోంది. నూకలకు సంబంధించిన అన్ని పత్రాలను వెంట తీసుకుని వెళుతుండడంతో ఎవనూ ఆపడం లేదు. చిక్కకుండా ఉండేందుకు.. రేషన్ బియ్యంతో సొమ్ము చేసుకోవడానికి అలవాటుపడ్డ కొందరు బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి అనుమానం రాకుండా ఇతర బస్తాల్లో నింపి తరలించేవారు. అయితే ఎక్కడో ఒక చోట ఆ బియ్యం తనిఖీలలో చిక్కుతుండడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంతో ఎవరికీ చిక్కకుండా ఉండేందుకు బియ్యాన్ని నూకలుగా మారుస్తున్నట్టు తెలుస్తోంది. రీసైక్లింగ్ సమయంలో బియ్యాన్ని నూకగా మార్చి బస్తాల్లో నింపుతున్నారు. అనంతరం రైస్‌మిల్లు వేబిల్లులపై నూకను దర్జాగా తరలిస్తున్నారు. ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యాన్ని సేకరించి మిల్లర్లకు అప్పగిస్తోంది. వాళ్లు మరపట్టి బియ్యాన్ని ప్రభుత్వానికి ఇస్తారు. అయితే కస్టమ్ మిల్లింగ్‌కు సంబంధించి బియ్యం మరపట్టినపుడు వచ్చే నూక కొంతే అయినప్పటికీ కొన్ని మిల్లుల నుంచి పెద్ద ఎత్తున నూక ఇతర రాష్ట్రాలకు తరలివెళుతోంది. రేషన్ బియ్యాన్ని నూకగా రీ సైక్లింగ్ చేస్తుండడం వల్లే ఇది సాధ్యమవుతోందని తెలుస్తోంది. ఈ విషయం అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. రైతుల నుంచి పూర్తిస్థాయిలో ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నపుడు ఆయా మిల్లులకు ఇచ్చిన ధాన్యానికి ఎంత బియ్యం వస్తుంది, అందుకు నూక ఎంత మిగులుతుందన్నదానిని అధికారులు పరిశీలించాల్సి ఉంది. ఆయా రైస్‌మిల్లుల్లో జరిగిన ధాన్యం మిల్లింగ్ ద్వారా వచ్చే నూక ఎంత? మిల్లు పేరిట వెళుతున్న నూక ఎంత? అన్నదాన్ని పరిశీలిస్తే వాస్తవాలు వెలుగు చూసే అవకాశాలుంటాయి. అధికార యంత్రాంగం నూకల రవాణా విషయంలో లోతుగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. -
బియ్యం ధరలు పైపైకి
ఆదిలాబాద్ అగ్రికల్చర్ : సన్నం బియ్యం ధరలు గత రెండు నెలల్లోనే ఆకాశాన్ని తాకేలా పెరిగాయి. బీపీటీ, సోనామసూరి, జేజీలుకు క్వింటాల్‌కు రూ.350 నుంచి రూ.600 వరకు పెరిగింది. సాధారణ రకం బియ్యం క్వింటాల్‌కు ధర మార్కెట్లో రూ.3,500 ఉండగా.. ప్రస్తుతం రూ.4,000లకు చేరింది. కొత్త బియ్యానికే ఈ ధర పలుకుతోంది. ఇక పాత బియ్యానికి అదనంగా రూ.300 వరకు చెల్లించాల్సి వస్తోంది. సన్న బియ్యం హెచ్ఎంటీ గతంలో క్వింటాల్‌కు రూ.5,500 ఉండగా.. ప్రస్తుతం రూ.6,000లకు చేరింది. జైశ్రీరామ్ క్వింటాల్‌కు రూ.5,500 నుంచి రూ.6,100కి పెరిగింది. బీపీటీ (బాపట్టా) రూ.3,300 నుంచి రూ.4,000లకు చేరింది. ఇప్పటికే వర్షాభావ పరిస్థితులతో జిల్లాలో వరి సాగు తగ్గి మార్కెట్‌కు ధాన్యం ఆశించిన స్థాయిలో రాకపోవడంతో వీటి ధరలకు రెక్కలొస్తున్నాయి. కరువు కాటు.. జిల్లాలో గడిచినా ఏడాది ఖరీఫ్‌లో ఆశించిన స్థాయిలో వర్షాలు లేక రైతులు వరి సాగుకు మొగ్గు చూపలేదు. వరి విత్తనాలు అలికినా నాట్లు వేసుకునే సమయానికి వర్షాలు పడలేదు. దీంతో పొలాల్లోనే నారు వదిలేశారు. రబీ నీరు అందించేందుకు కరెంటు కోత తలెత్తేలా ఉం దని ప్రభుత్వమే వరి సాగు చేసుకోవద్దని సూచించింది. దీంతో పంట వేసుకోలేదు. సాధారణ వరి విస్తీర్ణం 1.45 లక్షల ఎకరాలు కాగా.. తీవ్రమైన వర్షాభావ పరిస్థితులతో 59 వేలకే పరిమితమైంది. రబీ సాధారణ వరి విస్తీర్ణం 72 వేల ఎకరాలకు గాను 29 వేల ఎకరాలే సాగైంది. ఇది కూడా ప్రధాన ఆయకట్టు కింద సాగు చేసిందే. ఖరీఫ్‌లో కరువు కాటేస్తే, రబీలో అకాల వర్షా లు దిగుబడి దశలో తీవ్రంగా దెబ్బతిశాయి. ఏటా ఖరీ ఫ్, రబీలో ధాన్యం దిగుబడి 2 లక్షల 20 వేల మెట్రిక్ టన్నుల బియ్యం సుమారుగా అందుబాటులో ఉండేది. కానీ.. ఈ ఏడాది ఖరీఫ్, రబీ కలిపి లక్ష మెట్రిక్ ట న్నులు కూడా అందుబాటులో లేకుండాపోయింది. వరి దిగుబడి అనంతరం రైతుల కోసం తమ వద్ద కొంత నిల్వ చేసేవారు. మిగతా ధాన్యాన్ని మార్కెట్ తరలించేవారు. కానీ.. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా అన్నదాతకు తినేందుకు తిండిగింజా దొరకని దుస్థితి దాపురించిం ది. ఖరీఫ్, రబీ సాగులో వరితోపాటు కంది, మినము లు, పెసర, శనగ, గోధుమ పంటలదీ అదే పరిస్థితి. సాధారణం కంటే సాగు తగ్గడమే కాకుండా విత్తుకున్న పంట దిగుబడి లేక రైతులు తీవ్రంగా నష్టపోయారు. రీసైక్లింగ్ దందా.. కరువు కారణంగా వినియోగానికి ధాన్యం అందుబాటు లో లేకపోవడంతో వ్యాపారులు, మిల్లర్లు కల్తీ వ్యాపారానికి తెరలేపారు. జిల్లాలో ప్రభుత్వం ఆహార భద్రతా కార్డుల ద్వారా అందిస్తున్న రేషన్ (దొడ్డు) బియ్యాన్ని కొంత మంది మిల్లర్లు ప్రధాన పట్టణాల్లో ఆధునిక యంత్రాల ద్వారా రీసైక్లింగ్ చేస్తే సన్నబియ్యంగా మార్చుతున్నారు. కొంత మంది మిల్లర్లు రేషన్ డీలర్లను మచ్చిక చేసుకుని లక్షల క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని క్వింటాల్‌కు రూ.1,200 నుంచి 1,400 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. బోగస్ రేషన్ కార్డుల ద్వారా తదితర జిమ్మిక్కులతో రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. దొడ్డు బియ్యాన్ని సన్నరకంగా మార్చి రూ.3,800 నుంచి రూ.4,500 వరకు అమ్మకాలు సాగిస్తున్నారు. జిల్లాలో నెలకు లక్షల క్వింటాళ్ల రేషన్ బియ్యం రీసైక్లింగ్ జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వినియోగదారులు గుర్తు పట్టనంతగా మారుతున్నాయి. క్విం టాలు దొడ్డు బియ్యం రీసైక్లింగ్ చేస్తే 75 నుంచి 80 క్విం టాళ్ల వరకు వస్తోంది. వ్యాపారులు, మిల్లర్లు లక్షల్లో లా భాలు ఘడిస్తున్నారు. ప్రధానంగా ఈ రీసైక్లింగ్ వ్యవహారం బెల్లంపల్లి, మంచిర్యాల, కాగజ్‌నగర్, నిర్మల్, ఆదిలాబాద్ ప్రాంతాలలో ఎక్కువగా సాగుతోంది. నియంత్రణ కరువు.. బియ్యం ధరలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. ధరలు సమీక్షించాల్సిన అధికారులు ఆ దిశగా చొరవ చూపకపోవడంతో వ్యాపారుల ధరలను ఇష్టానుసారంగా పెంచేస్తున్నారు. కొందరు వ్యాపారులు బియ్యంతోపాటు, నిత్యావసర పప్పులు అక్రమంగా నిల్వ చేసి కృత్రిమ కొరత సృష్టించి ధరలు పెంచుతున్నారు. గతేడాది ఇదే సమయంలో ఉన్నతాధికారులు సమీక్షించి ధరల నియంత్రణకు ప్రభుత్వం తరఫున పలు చర్యలు చేపట్టారు. సోనమసూరి బియ్యం రూ.కిలో 27 చొప్పున విక్రయించాలని జిల్లాలో ఎనిమిది కేంద్రాలు ఏర్పాటు చేశారు. కానీ.. ప్రస్తుతం ఆ కేంద్రాల్లో అధిక ధరలకు విక్రయాలు జరుగుతున్నయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి బియ్యం ధరలకు కళ్లెం వేయాలని కోరుతున్నారు.