జహీరాబాద్ టౌన్: నిత్యం తాగి గొడవకు దిగుతున్న భర్త వైఖరికి మనస్తాపంతో భార్య వ్యవసాయ బావిలోకి దూకింది.. అది గమనించిన భర్త కూడా బావిలో దూకాడు. ఇద్దరికీ ఈత రాకపోవడంతో నీట మునిగి మృత్యువాత పడ్డారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం గోవింద్‌పూర్‌లో ఆదివారం జరిగిన ఈ సంఘటన వివరాలివి. మృతుని తల్లి పెంటమ్మ, పోలీసుల కథనం ప్రకారం.. జహీరాబాద్ మండలం ఆనేగుంటకు చెందిన రాజగిర వెంకటి (35)కి భార్య లక్ష్మి (28), కూతుళ్లు గీతాంజలి, మల్లీశ్వరి, కుమారుడు సాయి ఉన్నారు.
వెంకటి కుటుంబంతో గోవింద్‌పూర్‌లోని ఒక వ్యవసాయ క్షేత్రంలో ఉంటూ కూలి చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. తాగుడుకు బానిసైన వెంకటి తరచూ భార్యతో గొడవ పడేవాడు. గతంలో ఒకసారి గొడవ జరిగినప్పుడు వెంకటి బావిలో దూకగా చుట్టుపక్కల వారు రక్షించారు. ఆ సమయంలో కాలికి తీవ్ర గాయాలయ్యాయి. ఆదివారం ఉదయం కూడా మద్యం తాగిన వెంకటి భార్యతో గొడవకు దిగాడు.
దీంతో మనస్తాపానికి గురైన భార్య లక్ష్మి సమీపంలోని వ్యవసాయ బావిలో దూకింది. ఆమెను కాపాడేందుకు వెంకటి కూడా బావిలోకి దూకగా, ఇద్దరు నీట మునిగారు. ఇది గమనించిన వెంకటి తల్లి పెంటమ్మ ఇద్దరినీ కాపాడేందుకు డ్రిప్ పైపులు బావిలోకి జార విడిచినా ప్రయోజనం లేకుండా పోయింది. దంపతుల మృతితో పదేళ్ల లోపున్న ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు. బావిలోంచి మృతదేహలను వెలికితీసిన చిరాగ్‌పల్లి పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం జహీరాబాద్ ఆస్పత్రికి తరలించారు. మృతుడు వెంకటి తల్లి పెంటమ్మ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు చిరాగ్‌పల్లి ఎస్‌ఐ కాశీనాథ్ తెలిపారు.
అనాథలైన చిన్నారులు
Comments
Please login to add a commentAdd a comment