ఈనాడు సమస్త విశ్వాన్ని వేధిస్తున్న ప్రధాన సమస్య భయం. ఇది ఏదైనా సరే ఒకసారి పట్టుకుందంటే అది వ్యక్తిత్వాన్ని దుర్బలపరుస్తుంది. ఆత్మగౌరవాన్ని దెబ్బతీసి ఆందోళనకు అభద్రతకు గురి చేస్తుంది. ఇదొక మానసిక వేదన. దీనివల్ల మొత్తం మనిషి జీవితం నిర్వీర్యమవుతుంది. ఇది సామాజిక వాతావరణం నుంచి ఉద్భవిస్తుంది తప్ప అంతర్గతంగా ఉండదు. బయట వాతావరణాన్ని బట్టి అంతర్గత లక్షణాలు ప్రకోపిస్తాయి. ఈ లక్షణాలే భయానికి ప్రధాన కారణమవుతున్నాయి.
నిత్యజీవితంలో మనిషి రకరకాల భయాలతో కాలం వెళ్ళదీస్తుంటాడు. అవి ప్రాకృతికమైనా, సామాజికమైనా, సాంస్కృతికమైనా వాటిని అధిగమించడం ద్వారానే మనిషి మామూలు మనిషి కావడం సాధ్యపడుతుంది. అయితే ఈ భయాలను అధిగమించాలంటే మనిషనేవాడికి వ్యక్తిగత సాధన, విమర్శనాత్మక పరిశీలన ముఖ్యం. ప్రతిమనిషి నిత్యం ఆలోచనలతో జీవిస్తూ ఉంటాడు. వర్తమానాన్ని విడిచి పెట్టి, భవిష్యత్‌లో ఏం జరుగుతుందోనని తీవ్రంగా ఆలోచిస్తాడు.
ఇలాంటి ఆలోచనలే భయాన్ని ప్రోదిచేస్తాయి. మనస్సంటే ఒక భాగం జ్ఞాపకాలు, మరో భాగం ఊహలతో నిండి ఉంటుంది. నిజానికి ఈ రెండు ఊహలే. మనిషి ఇలా ఊహల్లో మునిగిపోవడం వల్లనే భయం కలుగుతుంది. ఈ భయమే మన చుట్టూ హద్దులను గీస్తుంది. ఆ హద్దుల వల్ల మనకి మనం సురక్షితంగా ఉండొచ్చునేమో కానీ, అది జీవించడాన్నుంచి, జీవితం నుంచి కూడా దూరం చేస్తుంది.
భయం వల్ల మనిషి తనకు తానే పరిమితులు నిర్దేశించుకుని తన ప్రపంచంలో తాను మునిగి తేలుతాడు. ఈ క్రమంలో అటు ఆనందానికి, ఇటు స్వేచ్ఛకు దూరమైపోతాడు. అంతేకాదు హాయిగా నవ్వలేడు.. హృదయంతో ఏడ్వలేడు... అసలు మనస్ఫూర్తిగా, ఇష్టంగా ఏ పనీ చేయలేడు. ఏ మనిషైనా భయపడేది భవిష్యత్ గురించే.. తాను చేస్తున్న పనిలో విజయం సాధించగలనా... తన కుటుంబానికి ఆస్తిపాస్తులివ్వగలనా.. తన పిల్లలు చక్కగా చదువుకోగలరా.. తనకు భవిష్యత్‌లో ఆరోగ్యం సహకరిస్తుందా.. ఇలా రకరకాలుగా, వాస్తవంలో లేని వాటి గురించి బాధపడుతూ భయాన్ని పెంచుకుంటూ ఉంటారు.
భయం జీవితం నుంచి పుట్టింది కాదు. భ్రాంతులతో నిండిపోయిన మనస్సు నుంచి పుట్టింది. అస్తిత్వంలో లేని దాని గురించి బాధ పడడం వల్లనే భయం ఆవరిస్తుంది. నిత్యం భవిష్యత్‌లో బతకడం వల్లనే భయం కలుగుతోంది. ఈ భయం నుంచి మనల్ని మనం రక్షించుకోవాలంటే ఎవరికి వారు సాధన చేయాలి.. ఆత్మ విమర్శ చేసుకోవాలి.. తామెందుకు భయపడుతున్నామని ప్రశ్నించుకోవాలి.. నిజానికి తాము భయపడాల్సిన అవసరం ఉందా అని ఆలోచించుకోవాలి.
భయం కల్గించే భవిష్యత్ గురించి ఆలోచించడం మాని వాస్తవంలోకి రావాలి. లేని వాటి గురించి ఊహించుకోకుండా, భ్రమలు తొలగించుకుని ప్రస్తుత పరిస్థితులకనుగుణంగా జీవితాన్ని అదుపు చేసుకుంటే భయానికి తావే ఉండదు. ఒక్కసారి భ్రమలన్నీ తొలగిపోతే ఇక భయానికి ఆస్కారమే ఉండదు. భయపడాల్సిన అవసరమే రాదు. అందువల్ల ఊహల్లో మునిగి పోవడమే భయానికి మూలం. ఊహల నుంచి వాస్తవంలోకి వస్తే భయం సమస్యే ఉండదన్న వాస్తవాన్ని తెలుసుకోవాలి.
అసలు భయం అంటే ఏమిటి? మనం ఎందుకు భయపడతాం? భయం ఎన్ని రకాలు? భయం లేని మనుషులు వుంటారా? అసలు భయం ఎప్పుడు ఎలా పుట్టింది? ఈ ప్రశ్నలన్నిటినీ నిర్భయంగా చర్చించుకుంటే తప్ప భయం నుంచి విముక్తులు కాలేం. ఈ క్రమంలో కారణాలు తెలిసిన భయాలు కొన్ని.. కారణాలు తెలియని భయాలు కొన్ని. తెలిసిన భయాలకు అర్థవంతమైన వివరణ ఇస్తే పరిష్కారం చూపిస్తే పోతుంది. కాని తెలియని భయాలు అలా కాదు. అవి ఫలానా కారణం వల్ల కలిగాయని ఎవ్వరూ చెప్పరు. అందువల్ల మన భయాలకు మూల కారణాలు తెలుసుకుని, భయాన్ని పోగొట్టుకోవాలి.
తన చేతుల్లో లేని ప్రకృతికి దైవత్వం ఆపాదించిన ప్రాచీన మానవుడు దానిపట్ల భయమూ భక్తి పెంచుకున్నాడు. భక్తి పెంచుకోక పోతే నష్టం కలుగుతుందని భయపడ్డాడు. ఫలితంగా మూఢ నమ్మకాలకు లోనయ్యాడు.
మూఢత్వం భయానికి మొదటి హేతువు. మూఢనమ్మకాల వల్ల కలిగే భయాలు ఎవరినీ వదలి పెట్టవు. పైగా తమ సంపద పోతుందేమోనన్న భయంతో పోకుండా కాపాడుకోవాలన్నది అదనపు భయంగా తయారవుతుంది. మనుషుల మీద నమ్మకాలు సడలిపోవడం వల్ల ఎవరినీ నమ్మలేని విశ్వాస రాహిత్యం వెన్నాడుతుంది. అలాగే, మంచివారు చెడు చేయరు గనక దుర్మరణం పాలైన వారే ప్రేతాలై హింసిస్తారన్న నమ్మకం ఈ భయం వల్లనే ఏర్పడుతుంది. ఇలా మూఢత్వం అనేక భయాలకు దారి తీసింది.
ఇలా అనాదిగా తన పరిధిని పెంచుకున్న భయం నేడు విశ్వ వ్యాప్తమై మనిషిని నిర్జీవంగా తయారు చేస్తోంది. భయానికి సంబంధించి మన పురాణాలలో అనేక ఘట్టాలు ఉదాహరణలుగా కనిపిస్తాయి. పురాణాలలో ఆయా కథలలోని భయాలకు ఓ సముచితమైన కారణం, దిశానిర్దేశం ఉండడం వల్లనే వారంతా మహనీయులయ్యారు. అదే విధంగా మనిషి కూడా తాను నిత్యం వేధించే భయాలతో కృంగి కృశించి పోకుండా, తమ భయాలకు అసలు సిసలైన కారణాలు తెలుసుకుని, వాటి పరిష్కారాలకు ప్రయత్నించినపుడే భయం అనే మహమ్మారి నుంచి విముక్తులవుతారు.
భయం కల్గించే భవిష్యత్ గురించి ఆలోచించడం మాని వాస్తవంలోకి రావాలి. లేని వాటి గురించి ఊహించుకోకుండా, భ్రమలు తొలగించుకుని ప్రస్తుత పరిస్థితులకనుగుణంగా జీవితాన్ని అదుపు చేసుకుంటే భయానికి తావే ఉండదు. ఒక్కసారి భ్రమలన్నీ తొలగిపోతే ఇక భయానికి ఆస్కారమే ఉండదు. భయపడాల్సిన అవసరమే రాదు. అందువల్ల ఊహల్లో మునిగిపోవడమే భయానికి మూలం. ఊహల నుంచి వాస్తవంలోకి వస్తే భయం సమస్యే ఉండదన్న వాస్తవాన్ని తెలుసుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment