
ఆందోళనను అడ్డుకునే తీరును కనిపెట్టిన శాస్త్రవేత్తలు
ఫోబియాలున్న వ్యక్తులను థెరపీలతో బాగుచేసేందుకు అవకాశం
శాస్త్రవేత్తల కీలక ముందడుగు
తొలుత ఎలుకలపై ప్రయోగం
ప్రయోగం వివరాలను సెయిన్స్‌బరీ వెల్‌కమ్ సెంటర్‌లోని హాఫర్ ల్యాబ్‌లో పరిశోధకులు డాక్టర్ సారా మెడిరోస్, ప్రొఫెసర్ సోంజా హాఫర్ వివరించారు. ‘‘మనిషికి పుట్టుకతోనే కొన్ని భయాలుంటాయి. పెద్ద శబ్దాలు, హఠాత్తుగా తమ వైపు దూసుకొచ్చే వస్తువులను చూసి భయపడతాడు. అయితే కొన్నాళ్లకు కొన్ని భయాలు పోతాయి. చిన్నప్పుడు టపాసుల పేలుళ్లు భయపడిన వ్యక్తే ఆ తర్వాత తెగ టపాసులు కాలుస్తాడు.
ఇదే తరహాలో ఎలుకలపైకి పక్షుల లాంటి వస్తువులు దూసుకొస్తున్నట్లు ప్రయోగం చేశాం. ఎగిరొచ్చే వాటి నీడ పెద్దదయ్యే కొద్దీ ఎలుకలు భయపడ్డాయి. ప్రాణభయంతో పారిపోయాయి. అయితే నీడను ఇలా పదే పదే పెద్దగా చేశాక కేవలం నీడ పరిమాణం మాత్రమే పెరగడం ఎలుకలు గమనించి, ఆ తర్వాత భయపడటం మానేశాయి. పారిపోకుండా అలాగే చూశాయి.
ఇలాంటి దృగ్విషయంలో ఎలుక మెదడులోని వెంట్రో లేటరల్ జెనిక్యూలేట్ న్యూక్లియస్(వీఎల్‌జీఎన్) అనే ప్రాంతం క్రియాశీలక పాత్ర పోషిస్తోంది. మెదడులోని సెరిబ్రల్ కార్టెక్స్ ప్రాంతంలో నిక్షిప్తమయ్యే దృశ్యసంబంధ సమాచారం అత్యధికంగా వీఎల్‌జీఎన్‌కు భటా్వడా అవుతోంది. ఈ సమాచారాన్ని పదేపదే విశ్లేషించాక ఫలానా అంశంలో భయపడాల్సిన పనిలేదని వీఎల్‌జీఎన్ నిర్ధారిస్తోందని మేం ఓ అంచనాకొచ్చాం. దృశ్యసంబంధ కార్టెక్స్ అనేది ఏదైనా కొత్త విషయాన్ని నేర్చుకునేందుకు దోహపడుతోంది. ఇలాంటి అభ్యసన జ్ఞాపకాలు వీఎల్‌జీఎన్‌లో నిక్షిప్తమవుతున్నాయి.
నేర్చుకోవడం, గుర్తుంచుకోవడం, ప్రవర్తనకు సంబంధించిన అంశాల్లో సెరబ్రల్ కార్టెక్స్‌దే కీలకపాత్ర అని ఇన్నాళ్లూ భావించాం. కానీ అది తప్పు అని తేలింది. ఈ జ్ఞాపకాలన్నింటినీ వీఎల్‌జీఎన్ మాత్రమే భద్రపరుస్తోంది. దీంతో శ్వాస, గుండెలయ, స్పృహ, నిద్ర వంటి జ్ఞప్తియేతర విధులకు, అభ్యసన, ఆలోచన వంటి జ్ఞాపకశక్తి సంబంధ అంశాలకు మధ్య సంబంధం తెల్సుకునేందుకు అవకాశం చిక్కింది. వీఎల్‌జీఎన్ సర్క్యూట్‌లలో మార్పులు చేయడం ద్వారా రోగిని భయపడకుండా చేయొచ్చు. ఇందుకు సంబంధించి ఇంకా విస్తృతమైన పరిశోధనలు చేయాల్సి ఉంది’’అని శాస్త్రవేత్తలు చెప్పారు.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment