బహిష్కరణ ప్రకటన నేపథ్యంలో అమెరికాలో అక్రమ వలసదారుల్లో పెరిగిన ఆందోళన
చర్చిలు, పాఠశాలలనూ క్షుణ్ణంగా తనిఖీ చేస్తామన్న హోమ్‌ల్యాండ్ అధికారులు
శాన్‌ఫ్రాన్సిస్కో: అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించిన వలసదారులపై ఉక్కుపాదం మోపుతానని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో అక్రమవలసదారుల్లో భయందోళనలు ఎక్కువయ్యాయి. తమ పిల్లలను బడికి పంపడానికి కూడా అక్రమ వలసదారుల కుటుంబాలు భయపడుతున్నాయి.
పాఠశాలలు పిల్లలకు సురక్షితమైన ప్రదేశాలు అని అక్కడి విద్యావేత్తలు వలస తల్లిదండ్రులకు భరోసా ఇచ్చారు. అయితే ఫెడరల్ ఇమ్మిగ్రేషన్ ఏజెన్సీ అధికారులు పాఠశాలలు, చర్చిలు, ఆసుపత్రులనూ క్షుణ్ణంగా తనిఖీచేసి అక్రమవలసదారులుంటే అక్కడే అరెస్ట్ చేసే అధికారం ఇస్తామని ట్రంప్ ప్రభుత్వం మంగళవారం ప్రకటించిన నేపథ్యంలో వీరిలో ఆందోళనలు మరింత పెరిగాయి.
సున్నితమైన ప్రదేశాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ చర్యలు చేపట్టరాదన్న మార్గదర్శకాలను అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న చర్యలు తుడిచిపెట్టేశాయి. అరెస్టు నుంచి తప్పించుకునేందుకు నేరగాళ్లు ఇకపై అమెరికాలోని పాఠశాలలు, చర్చిల్లో తలదాచుకోలేరని డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ ఒక ప్రకటనలో తెలిపింది. తాజా విధానం ప్రకారం.. ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్, కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ ఏజెన్సీలు పాఠశాలల్లోకి ప్రవేశించొచ్చు.
మైగ్రేషన్ పాలసీ ఇన్‌స్టిట్యూట్ గణాంకాల ప్రకారం 7,33,000 మంది పాఠశాల వయస్సు పిల్లలు అమెరికాలో అక్రమంగా ఉన్నారు. ఇన్నాళ్లూ జన్మతః పౌరసత్వం నిబంధనతో వీరిలో చాలా మందికి అమెరికా పౌరసత్వం ఉన్నప్పటికీ వీళ్ల తల్లిదండ్రులకు పౌరసత్వం లేదు. తల్లిదండ్రులు చట్టవిరుద్ధంగా అమెరికాకు వచ్చి స్థిరపడ్డారు. ఇలాంటి లక్షలాది మందిని బహిష్కరిస్తామని ట్రంప్ ప్రకటించారు. అనేక వలస కుటుంబాలు బహిరంగంగా తిరిగేందుకు భయపడుతున్నాయి. పిల్లల్ని స్కూళ్లకు పంపించకపోవడంతో విద్యార్థుల హాజరుపై ప్రభావం చూపుతుందంటున్నారు విద్యావేత్తలు.
తల్లిదండ్రులకు భరోసా కల్పిస్తున్న పాఠశాలలు
కొన్ని రాష్ట్రాలు, జిల్లాల్లోని విద్యాశాఖాధికారులు అక్రమవలసదారుల పిల్లలకు అండగా ఉంటామని ప్రతిజ్ఞ చేశారు. కాలిఫోర్నియాలో ఇమ్మిగ్రేషన్ చట్టాన్ని అమలు చేయడంలో పాఠశాలలు ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు సహాయం చేయవని చికాగో పబ్లిక్ స్కూల్స్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ నవంబర్‌లో తీర్మానాన్ని ఆమోదించింది. క్రిమినల్ వారెంట్ లేకుండా అధికారులను పాఠశాలల్లోకి అడుగుపెట్టనివ్వమని స్పష్టం చేసింది. విద్యార్థి ఇమ్మిగ్రేషన్ స్థితిపై సమాచారం సేకరించకూడదనే విధానాలను గత నెలలో న్యూయార్క్ నగర ప్రధానోపాధ్యాయులకు గుర్తు చేసింది.
అయితే కొన్ని చోట్లా కుటుంబాలకు ఇలాంటి భరోసా దక్కట్లేదు. ట్రంప్ చర్యతో విద్యార్థులు, కుటుంబాలు భయభ్రాంతులకు గురవుతున్నాయని జార్జియా రెఫ్యూజీస్ అకాడమీ చార్టర్ స్కూల్ అధ్యాపకులు చెప్పారు. చాలా మంది విద్యార్థులు పాఠశాలకు దూరమవుతారని భావించి, వారు ముఖ్యమైన పరీక్షలను కోల్పోకుండా ఉండటానికి పరీక్ష షెడ్యూల్‌ను ముందుకు జరిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ఇంటికి పరిమితం చేస్తున్నారని అమెరికా సెంటర్ ఫర్ ఇమ్మిగ్రెంట్ రైట్స్ అధికారి మైఖేల్ ల్యూకెన్స్ తెలిపారు. వలసదారులు తమంతట తాముగా అమెరికాను వీడేలా ప్రభుత్వం భయపెడుతోందని ఆయన ఆరోపించారు.
కంటి మీద కునుకు లేదు
‘‘ఇప్పుడు మా పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. 14 ఏళ్ల క్రితం గ్వాటెమాల నుంచి వచ్చి బోస్టన్‌లో ఉంటున్నాం. మా పిల్లలు బోస్టన్ స్కూళ్లలో చదువుతున్నారు. అక్రమవలసదారులని ముద్రవేసి ఇప్పుడు మమ్మల్ని పనిచేసుకోనివ్వకపోతే ఏం చేయాలి. న్యాయం కోసం కోర్టుకెళ్లలేను. లైసెన్స్ ఉన్నాసరే కారులో బయటకు కూడా వెళ్లలేని పరిస్థితి. తలచుకుంటే నిద్రకూడా పట్టట్లేదు. చట్టబద్ధత రుజువు కోసం స్కూళ్లో మా పిల్లలను అధికారులను నిలదీస్తే ఏం చేయాలో పాలుపోవట్లేదు’’అని ఐరిస్ గొంజాలెజ్ అని మహిళ వాపోయారు.
ఇలా చేస్తారని ఊహించలేదు : కార్మెన్
‘‘వాళ్లు ఇలా చేస్తారని నేను ఊహించలేదు’’అని మెక్సికో నుంచి వలస వచ్చిన కార్మెన్ అనే వృద్దురాలు ఆవేదన వ్యక్తంచేశారు. ‘‘శాన్‌ఫ్రాన్సిస్కో బే పాఠశాలకు నా ఇద్దరు మనవరాళ్లను ఇప్పుడెలా తీసుకెళ్లాలి?. అండగా ఉంటామని పాఠశాల హామీ ఇచ్చింది. అయినా భయంగానే ఉంది. తరిమేస్తే సొంతదేశం అస్సలు వెళ్లలేం. డ్రగ్స్ ముఠాలు రాజ్యమేల మెక్సికోలోని మిచోకాన్ రాష్ట్రం నుంచి వచ్చాం. రెండేళ్ల క్రితం అక్కడ మా అల్లుడిని కిడ్నాప్‌చేశారు. బెదిరింపులు పెరగడంతో అమెరికాకు వలసవచ్చాం. శాన్‌ఫ్రాన్సిస్కోలో ఉండటానికి అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నా ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు ఇక్కడ ఉండలేం. ఎక్కడికీ వెళ్లలేం. దేవుడా మా ప్రాణాలి్న, మా పిల్లల్ని కాపాడు’’అని ఆమె ఏడుస్తూ చెప్పారు. ఇలా పేద అక్రమవలసదారుల వ్యథలు ఇప్పుడు అమెరికా వ్యాప్తంగా వినపడుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment