మానవ జన్మ తత్వజ్ఞానమే... ఈశావాస్యోపనిషత్తు | Philosophies of human life | Sakshi
Sakshi News home page

మానవ జన్మ తత్వజ్ఞానమే... ఈశావాస్యోపనిషత్తు

Published Sat, Jan 23 2016 10:59 PM | Last Updated on Sun, Sep 3 2017 4:10 PM

మానవ జన్మ తత్వజ్ఞానమే... ఈశావాస్యోపనిషత్తు

మానవ జన్మ తత్వజ్ఞానమే... ఈశావాస్యోపనిషత్తు

వేదాలలో భాగాలు, వాటికి అనుబంధాలూ, భారతీయ వైదిక సాహిత్యంలో ప్రధాన విభాగమూ అయిన ఉపనిషత్తుల గురించిన పరిచయాన్ని, వాటిలోని రకాలను, భాగాలను గురించి గతవారం తెలుసుకున్నాం కదా... ఉపనిషత్తులన్నిటిలోకీ తలమానికమైనదీ, మానవ జన్మలోని విశేషాలను విపులీకరించే ఈశావాస్యోపనిషత్తు గురించి ఈ వారం...
 
శుక్లయజుర్వేదం మాధ్యందిన సంహిత నలభైయవ అధ్యాయంలో వాజసనేయ సంహితోపనిషత్తుగా ఉన్న ఈ ఉపనిషత్తులో పద్ధెనిమిది మంత్రాలు మాత్రమే ఉన్నాయి. మొదటి మంత్రంలో మొదటి పదం ‘ఈశావాస్యమిదం’ అని ఉండటం వల్ల దీనికి ‘ఈశావాస్యోపనిషత్తు’ అనే పేరు ప్రసిద్ధమైంది. నాలుగు వేదాల్లో ప్రాచీనాలూ, ప్రసిద్ధాలూ అయిన పది ఉపనిషత్తులలో మొదటి స్థానం ఈ ఉపనిషత్తుకే. ఆదిశంకరులు దీనికి భాష్యం రాశారు. ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రాలు అధ్యయనం చేసే క్రమంలో ఈ ఉపనిషత్తు ముందుండి దారి చూపుతుంది. మానవజాతికి ఈ జన్మ ఎందుకు ఎత్తామో, ఎలా జీవించాలో ఏం తెలుసుకోవాలో ఇది స్పష్టంగా తెలియజేస్తుంది.
 
భగవంతుడు మానవ జన్మ ఎత్తినా అశాంతి, అస్పష్టత వెన్నాడుతూ ఉంటాయి. ధర్మవిగ్రహుడైన శ్రీరామచంద్రుడు ఒకరోజు అర్ధరాత్రి నిద్రపట్టక అశాంతితో వశిష్ట మహర్షి ఆశ్రమానికి వెళ్లి తలుపు తట్టాడు. ఆయన ‘ఎవరు?’ అని ప్రశ్నించాడు. ‘నేను ఎవరినో తెలుసుకోవడానికే మీ దగ్గరకు వచ్చాను’అని రాముడు సమాధానం చెప్పాడు. వశిష్టుడు రాముని గొంతు గుర్తుపట్టి తలుపు తీశాడు. జ్ఞానోపదేశం చేశాడు.
 
ఈ కథ నిజంగా ఇలా జరిగినా జరగకపోయినా మానవులందరూ ఈ స్థితిలో ఉన్నారనే సత్యం దీనిలో దాగి ఉంది. ఈశావాస్యోపనిషత్తు పరిమాణంలో చిన్నదే అయినా చాలా స్పష్టంగా జీవన ముఖ్యసూత్రాలను, మనోవికాసాన్ని, ఆలోచనావిధానాన్ని నిర్దేశిస్తుంది. తరువాత వచ్చిన ప్రవక్తలు, ఆచార్యులు, గురువులు, సిద్ధాంతకర్తలు, శాస్త్రవేత్తలు తిలక్, ఠాగూర్, గాంధీజీ వంటి పెద్దలు అందరూ ఈ ఉపనిషత్తును ప్రస్తావించారు. విన్నవారికి ఎవరికైనా వెంటనే జ్ఞానం కలిగించే సూత్రప్రాయమైన మహోపనిషత్తు ఈశావాస్యం.
 
ఈ ఉపనిషత్తులో మొదట సాకారంగా ఏ దేవతారూపమూ చెప్పబడలేదు. ఏ రూపమూ లేని పరబ్రహ్మమే జగత్తు అంతటా వ్యాపించి ఉంది. నీలోనూ నీ చుట్టూ అంతటా అదే ఉన్నది అనే సత్యాన్ని తెలుసుకో. నీకు లభించిన దానితో తృప్తిపడు. ఇతరుల సొమ్ము దొంగిలించకు. అనే మొదటి మంత్రం ఒక్కటే ఎన్నో సమస్యలను పరిష్కరిస్తుంది. మానవజాతి ప్రశాంత జీవనానికీ అన్ని మతాల సిద్ధాంతాలకూ, సమస్త వేదాంతానికీ బలమైన పునాది ఈ సూత్రం.
 
‘కర్మలు చేస్తూనే నూరేళ్లు జీవించాలి. బతికి ఉన్నంతకాలం సత్కర్మాచరణ తప్ప మరోదారిలేదు’ అనే రెండో మంత్రం మానవుణ్ణి కర్తవ్యపరాయణునిగా నూరేళ్లు బతకమని చెబుతోంది. పని చేసేవాడికే బతికే హక్కుంది. అవకాశం ఉంది. సత్కర్మ వల్ల శారీరక మానసిక ఆరోగ్యం లభిస్తుంది. ఆరోగ్యం వల్ల ఆయుర్దాయం చేకూరుతుంది. సోమరిపోతులకు సంపూర్ణంగా బతికే హక్కు, అవకాశమూ లేవు.
 ‘అసురులకు చెందిన లోకాలు కటిక చీకటిలో ఉంటాయి. ఆత్మహత్య చేసుకున్నవారు (ఆత్మను చంపుకున్నవారు) ఆ లోకాలకు చేరుకుంటారు’ అనే మూడోమంత్రం రాక్షసత్వంతో చీకటిలో మగ్గిపోవద్దని, వెలుగులోకి రమ్మంటోంది. తమను తాము చంపుకున్నవారు ఆత్మజ్ఞాన శూన్యులై ఉంటారు. కనుక వారు చీకటిలోకాల్లోకి పోతారు.
 
‘ఆత్మ చలించనిది, మనసుకన్నా వేగవంతం. దానికంటే ముందుగా వెళుతోంది. ఆత్మస్థిరంగా ఉంటుంది. అతివేగంగా ప్రయాణిస్తుంది. ఆత్మ వేగాన్ని ఎవరూ అందుకోలేరు. ఆత్మ అన్నిటికీ, అంతటా ప్రాణశక్తిని ఇస్తుంది’అనే నాలుగో మంత్రం అంతటా వ్యాపించి ఉన్న శక్తిని వివరిస్తోంది.
 
‘ఆత్మ ప్రయాణిస్తుంది. కదలకుండా ఉంటుంది. దూరంగా ఉంటుంది. దగ్గరగానూ ఉంటుంది. లోపలా బయటా ఉంటుంది’ అనే ఐదోమంత్రం చెప్పిన ఆత్మవర్ణనను ఆధునిక శాస్త్రీయ దృష్టితో విశ్వశక్తిగా తెలుసుకోవాలి. విశ్వశక్తినే నిర్గుణ పరబ్రహ్మం అంటాం. ఇది తెలుసుకున్న వారికి ఎదుటివారిపై ద్వేషం ఉండదు. ఎందుకంటే ఎదుటివారు వేరు కాదు కనుక. అందరినీ తనలో చూస్తాడు. తనను అందరిలో చూస్తాడు. ఈ ఆత్మజ్ఞానం కలిగి అంతా ఒకటిగా చూసేవాడికి మోహం, శోకం ఉండవు.
 
మానవుల దుఃఖానికి, రాగద్వేషాలకు, భిన్నాభిప్రాయాలకు అన్నిటికీ కారణం మోహం. వ్యక్తులపైన, వస్తువులపైన, దేహంపైన ఉన్న మోహంలోనే దుఃఖమూ కోపమూ మొదలైన మనోవికారాలు ఏర్పడుతున్నాయి. ఆత్మజ్ఞానం కలిగినవాడు ప్రదర్శన అయిపోయిన సినిమా తెరలాగా అయిపోతాడు.
 
ఆత్మతత్వం ఒకరు సృష్టించింది, కల్పించిందీ కాదు. దానంతటదే ఏర్పడింది. అంతటా వ్యాపించి ఉంది. దానికి శరీరం, కండలు ఉండవు. అది స్వచ్ఛం, పరిపూర్ణం. ఇప్పటివరకు విశ్వజ్ఞానాన్ని పొందడం వల్ల కలిగే లాభాలను చెప్పిన ఉపనిషత్తు ఆ దృష్టి లేకుండా కేవలం పశువులాగా జీవిస్తే అవిద్య వలన కటికచీకట్లో పడిపోతారని హెచ్చరిస్తోంది. ఆత్మజ్ఞానాన్ని కలిగించేది బ్రహ్మవిద్య. ఉపాధికి పనికి వచ్చేది అవిద్య. భౌతికంగా పనికొచ్చేది అవిద్య. సంపూర్ణజ్ఞానాన్ని ఇచ్చేది బ్రహ్మవిద్య. కనుక రెండూ అవసరమే అని చెప్పడం ఈశావాస్యం ప్రత్యేకత.
- డా. పాలపర్తి శ్యామలానంద ప్రసాద్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement