సొమ్ము రాజీవ్ విద్యా మిషన్‌ది.. సోకు శైలజానాథ్‌ది! | Rajiv education mission | Sakshi
Sakshi News home page

సొమ్ము రాజీవ్ విద్యా మిషన్‌ది.. సోకు శైలజానాథ్‌ది!

Published Mon, Jul 7 2014 2:31 AM | Last Updated on Fri, Jun 1 2018 8:47 PM

సొమ్ము రాజీవ్ విద్యా మిషన్‌ది.. సోకు శైలజానాథ్‌ది! - Sakshi

సొమ్ము రాజీవ్ విద్యా మిషన్‌ది.. సోకు శైలజానాథ్‌ది!

అనంతపురం ఎడ్యుకేషన్ : అత్తసొమ్ము అల్లుడు దానం చేసినట్లు రాజీవ్ విద్యా మిషన్ సిబ్బంది వ్యవహరిస్తే.. సొమ్మొకరది.. సోకొకరిది అన్నట్లు అధికారమే పరమావధిగా హల్‌చల్ చేసిన నేపథ్యం ఆ మాజీ మంత్రిది. కార్యాలయ అవసరాల కోసం వచ్చిన పరికరాలను తాను మంత్రిగా ఉన్నప్పుడు సొంత అవసరానికి తీసుకెళ్లిన ఆయన.. ఇప్పటికీ తిరిగి ఇవ్వకపోవడంతో అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. వివరాల్లోకి వెళితే.. ఫైవ్ స్టార్ హోటళ్లకు వెళ్లే కోటీశ్వరులు కొందరు చెంచాలు దొంగిలిస్తుంటారు. వేలాది రూపాయల విలువ చేసే పట్టు చీరలు కొనే ఉన్నత వర్గ మహిళల్లో కొందరు చేతిరుమాళ్లు నొక్కేస్తుంటారు. పెద్ద పెద్ద స్థానాల్లో ఉంటూ ఇలా చిన్న చిన్న వస్తువులు కొట్టేయడం ఓ జబ్బు. దీన్ని వైద్యపరిభాషలో ‘క్లిప్టోమానియా’ అంటారు. రాజీవ్ విద్యామిషన్(ఆర్వీఎం)కు చెందిన ఓ ఫ్యాక్స్ మిషన్, కంప్యూటర్, ఫెడస్టల్ ఫ్యాన్లు లాంటి వాటిని డాక్టర్ సాకే శైలజానాథ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు తన ఇంట్లో ఉంచుకున్నారు. ఆయన మాజీ అయ్యాక కూడా తిరిగి ఇవ్వలేదు. దీంతో ఈయనకు కూడా ‘క్లిప్టోమానియా’ ఉందేమోనని ఆర్వీఎంలో పలువురు చర్చించుకుంటున్నారు. ఆర్వీఎం ప్రాజెక్ట్ అధికారి (పీఓ) కార్యాలయంలో ఉండే కొన్ని వస్తువులను అప్పట్లో కొందరు సిబ్బంది శైలజానాథ్ ఇంటికి తరలించి విధేయతను చాటుకున్నట్లు సమాచారం. మంత్రికి ప్రొటోకాల్ మర్యాదలు పాటించే మిషతో సిబ్బంది గతంలో భారీగానే నిధులు భోంచేశారు.
 
 ఈ విషయం సమాచార హక్కు చట్టం ద్వారా వెలుగుచూసింది. కార్యాలయ అవసరాల కోసం ప్రభుత్వం సరఫరా చేసిన ఫ్యాక్స్, ప్రింటర్ లాంటి వస్తువులు సైతం తరలించిన వైనం తాజాగా ‘సాక్షి’ పరిశీలనలో వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వం మారిన తర్వాత కూడా వాటిని సదరు మాజీ మంత్రి వెనక్కు పంపకపోవడం గమనార్హం.
 
  ఫ్యాక్స్ మిషన్ (08554-242418)  తరలించడంతో పాటు అప్పటి నుంచి బిల్లు కూడా ప్రతినెలా ఆర్వీఎం అధికారులే చెల్లిస్తూ వచ్చినట్లు తెలిసింది. ప్రస్తుతం ఆర్వీఎంలో ఉన్నతాధికారులకు ఏదైనా ఫ్యాక్స్ చేయాలంటే బయట నుంచి పంపాల్సిన దుస్థితి నెలకొంది. కార్యాలయానికి ఎవరైనా ఫ్యాక్స్ పంపుతామంటే మిషన్ పని చేయడం లేదంటూ సిబ్బంది చెప్పడం అలవాటుగా మారిపోయింది. కార్యాలయానికి నాలుగు ఫెడస్టల్ ఫ్యాన్లు తెప్పించగా, వాటిలో మూడింటిని అప్పట్లోనే శైలజానాథ్ నివాసానికి తరలించినట్లు సమాచారం.
 
 కార్యాలయంలో కనిపించని కంప్యూటర్
 ఆర్వీఎం కార్యాలయ అవసరాల పేరిట మూడేళ్ల క్రితం అధికారులు రూ.38 వేలు పెట్టి అనంతపురంలోని ఓ షాపులో కంప్యూటర్ కొనుగోలు చేశారు. దాన్ని కార్యాలయానికి తీసుకురాకుండా నేరుగా శైలజానాథ్ ఇంటికి తరలించారు. ఇప్పటికీ అది అక్కడే ఉంది. ఇందుకు సంబంధించిన బిల్లు నేటికీ మంజూరు చేయలేదు. సదరు షాపు యజమాని ఆర్వీఎం కార్యాలయం చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. బిల్లు విషయంలో ఇటీవల ఆర్వీఎంలోని ఓ ఉద్యోగితో తీవ్రస్థాయిలో వాగ్వాదానికి దిగాడు.
 
 కార్యాలయంలో లేని కంప్యూటర్‌కు బిల్లు మంజూరు చేయాలంటే అధికారులు వెనకడుగు వేస్త్తున్నారు. ఒకవేళ బిల్లు ఇస్తే భవిష్యత్తులో వచ్చే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని గతంలో ఇక్కడ పని చేసిన ఇద్దరు అధికారులు నాన్చుడి ధోరణి అవలంబిస్తూ వచ్చారు. ఇదిలాఉండగా.. ఫ్యాక్స్ మిషన్ విషయమై కార్యాలయ సూపరింటెండెంట్ ప్రవీణ్‌కుమార్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా...‘చాలా రోజులుగా కార్యాలయంలో ఫ్యాక్స్ మిషన్ లేదు. రిపేరీ ఉందనే విషయం సిబ్బంది చెప్పార’ంటూ పేర్కొన్నారు. మాజీ మంత్రి శైలజానాథ్ వివరణ తీసుకునేందుకు ప్రయత్నించగా.. ఆయన ఫోన్‌లో అందుబాటులోకి రాలేదు.
 
 విషయం తెలీదు  
 ఫ్యాక్స్ మిషన్, ఫెడస్టల్ ఫ్యాన్లు, కంప్యూటర్ తదితర వస్తువుల విషయం నాకు తెలీదు. కంప్యూటర్ కొనుగోలు బిల్లు కూడా నా వద్దకు రాలేదు. ఒకసారి మావాళ్లతో మాట్లాడి కార్యాలయానికి సంబంధించిన వస్తువులు ఎక్కడైనా ఉంటే వెంటనే తె ప్పించే లాచ చర్యలు తీసుకుంటా.
 - మధుసూదన్‌రావు, పీఓ, ఆర్వీఎం
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement