five stare hotel
-
సంగీత దర్శకుడికి షాక్.. మూడు కోడిగుడ్లు రూ.1672
అహ్మదాబాద్ : సాధారణంగా కోడిగుడ్డు ఐదు రూపాయిల నుంచి పది రూపాయిల వరకు ఉంటాయి. కానీ ఓ స్టార్ హోటల్లో మూడు కోడిగుడ్లకు ఏకంగా రూ.1672 బిల్లు వేశారు. ఈ సంఘటన గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లో జరిగింది. అహ్మదాబాద్‌లోని హయత్ రీజెన్సీ హోటల్లో మూడు ఉడికించిన కోడిగుడ్లకు గాను.. బాలీవుడ్ సంగీత దర్శకుడు శేఖర్ రావ్‌జియానీ చేతికి ఇచ్చిన బిల్లు రూ.1672 ఇదేనంటూ సోషల్ మీడియాలో చేసిన ట్వీట్ తెగ వైరల్ అవుతోంది. హయత్ రీజెన్సీ హోటల్లో బసచేసిన శేఖర్ రావ్ జియానీ గురువారం రోజున మూడు ఎగ్‌వైట్‌లతో భోజనం ఆర్డర్ చేశారు. అయితే హయత్ రీజెన్సీ హోటల్ సప్లయర్ మూడు బాయిల్డ్ ఎగ్స్‌ను ఇచ్చి శేఖర్ చేతిలో 1672 రూపాయల బిల్లు పెట్టాడు. బిల్లును చూసి శేఖర్ ఆశ్చర్యపోయాడు. షాక్ నుంచి కోలుకునేందుకు కొన్ని నిమిషాలు పట్టింది. కొన్ని నిమిషాల తర్వాత తేరుకున్న శేఖర్ రావూజీ దానిని తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశాడు. దీంతో ఇప్పుడీ బిల్లు వైరల్ అయింది. 15 రూపాయల కోడిగుడ్లకు రూ.1672 ఏంటంటూ నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. మూడు ఉడికించిన కోడిగుడ్లకు 1350 రూపాయలు, సర్వీస్ చార్జీగా 67.50 రూపాయలు, సీజీఎస్టీ 9శాతం కింద 127.58 పైసలు, ఎస్ జీఎస్టీ 9శాతం కింద మరో రూ.127.58 కలిపి మొత్తం 1672రూపాయలు చెల్లించాలని బిల్లులో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. -
ఫైవ్ స్టార్ హోటల్‌ను తలదన్నేలా..
సాక్షి, అశ్వారావుపేట( ఖమ్మం) : అది ఐదు నక్షత్రాల (ఫైవ్ స్టార్) హోటల్ కాదు. కనిపించీ కనిపించని లైటింగ్ ఉండదు. యూనిఫాం వేసుకుని వడ్డించే వారు అక్కడ కనిపించరు. కానీ, ప్లేట్లో ఉండే ఐటెమ్‌లు మాత్రం ఫైవ్ స్టార్ హోటల్‌ను తలదన్నేలా ఉంటాయి. అక్కడి రుచి అలాంటి హోటళ్లను మైమరిపిస్తాయి. 20 రకాల కూరలతో భోజనం, 20 రకాల ఐటెంలతో టిఫిన్ ఆరగిస్తూ అక్కడి ప్రజలు నూతన అనుభూతిని ఆస్వాదిస్తున్నారు. ఇదంతా అశ్వారావుపేటకు చెందిన, చేయి తిరిగిన చెఫ్ మున్నా చేస్తున్న అద్భుతం. తొలుత ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టి తీసేసి, ప్రస్తుతం కేటరింగ్ మారి సక్సెస్ సాధించాడు. ప్లేట్ భోజనం రూ.250 అయినప్పటికీ అక్కడి ప్రజలు ఆదరిస్తున్నారంటే అతడి చేయి నుంచి వచ్చిన వంటలు ఎలా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. అశ్వారావుపేటకు చెందిన చెఫ్ మున్నా తొలుత విశాఖపట్టణంలో హోటల్లో వంటలకు సంబంధించిన కోర్సు చేశాడు. అనంతరం వంటల్లో ప్రావీణ్యం సంపాదించాడు. స్వగ్రామమైన అశ్వారావుపేటలో హోటల్, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లను నిర్వహించాడు. అశ్వారావుపేట వంటి గ్రామీణ ప్రాంతంలో వ్యాపారం ముందుకు సాగక దానిని నిలిపివేశాడు. కానీ, మున్నా వంటకాలకు అలవాటు పడిన సన్నిహితులు, బంధుమిత్రులు తమ ఇంట్లో జరిగే వేడుకలకు మున్నాను సలహాలు, సూచనలతో మెనూ సిద్ధం చేసేవారు. అలా అలా పలు శుభకార్యాలకు మున్నా మార్క్ చూపించాడు. దీంతో పలు సమావేశాలకు వీఐపీ భోజనం కావాలంటే అశ్వారావుపేటలో మున్నాను ఆశ్రయించాల్సిందేననే పేరు సంపాదించాడు. వంటను ఓ ప్రవృత్తిగా భావించి ఐదేళ్లపాటు ఎలాంటి ఫీజు లేకుండా వంటలు చేసిన మున్నా మిత్రుల కోరిక మేరకు క్యాటరింగ్ రంగంలోకి బలవంతంగా అడుగుపెట్టాడు. ఒక్కో తలకు భోజనం వెల రూ.250 మాత్రమే. అంత ఖరీదైన భోజనం.. అదీ అశ్వారావుపేటలో అంటే కొందరు ముక్కున వేలు వేసుకున్నారు. కానీ, అందులోని భిన్న రకాల కూరలు తెలుసుకున్నాక ఆ ధర సరైనదేనని ప్రజలు భావించారు. చూస్తే నోరూరాల్సిందే మున్నా మెనూను చూడగానే కడుపు నిండుతుందని భోజన ప్రియులంటున్నారు. వెజ్ స్టార్టర్స్, ఫ్రూట్స్ స్నాక్స్, చికెన్, మటన్, ఫిష్, రొయ్యలు, పీతలు ఒకే ప్లేట్లో వడ్డించడం మున్నా ప్రత్యేకత. వంకాయ, పెరుగు చట్నీ, కొబ్బరి అన్నం, ఉలవచారు చికెన్, ఉలవచారు ఎగ్, గోంగూర బోటీ, పుష్కా, రాగి ఇడ్లీ, జొన్న ఇడ్లీ, రాగి దోశ, జొన్న దోశ, రాగి సంగటి, జొన్న సంటి, నాటుకోడి, ఇంకా ఫ్రూట్‌జ్యూస్‌లు ఇలా అతడు చేసే ఏ వంటకమైనా అదిరిపోవాల్సిందే. 20 రకాల వంటకాలతో టిఫిన్, 20 రకాల ఐటమ్స్‌తో భోజనం, 10 రకాల పండ్లతో స్టార్టర్స్.. ఇలా రంగురంగుల పండ్లతో కళ్లు జిగేల్ మనిపిస్తుంటాడు. ఓసారి మున్నా మెనూ వింటే ఎంతయినా తినాలనిపిస్తుందని పలువురు చెబుతున్నారు. అశ్వారావుపేటకు అప్పుడప్పుడు హైదరాబాద్ నుంచి వచ్చే కొందరు ప్రముఖులు మున్నా మెనూకు ముగ్ధులవుతుంటారు. హైదరాబాద్ వచ్చేయమని కోరుతుంటారు. కానీ, మున్నా సున్నితంగా తిరస్కరిస్తాడు. మున్నా తల్లి భారతికుమారి ఐసీడీఎస్‌లో సీడీపీఓగా పనిచేసి ఉద్యోగ విరమణ పొందారు. పోషకాలతో కూడిన వంటకాలపై ఆమెకున్న పట్టు మున్నాకు వారసత్వంగా వచ్చింది. తల్లి ఆశీస్సులతో తల్లి సమక్షంలోనే నాణ్యమైన వంటలు అందిస్తానంటున్నాడు మున్నా. చాలా ఖరీదైన మెనూ కాబట్టి అశ్వారావుపేట వంటి గ్రామీణ ప్రాంతంలో కొనసాగడం గొప్ప విషయమే. అయితే, మున్నా మెనూ టేస్ట్ చేయాలంటే అశ్వారావుపేట వచ్చి ముందుగా 99856 61117 నంబర్‌కు ఆర్డర్ ఇవ్వాలి. ఎందుకంటే హోటల్‌లా నిత్యం సమయానికి వండి సిద్ధంగా ఉంచరు కదా. -
సొమ్ము రాజీవ్ విద్యా మిషన్‌ది.. సోకు శైలజానాథ్‌ది!
అనంతపురం ఎడ్యుకేషన్ : అత్తసొమ్ము అల్లుడు దానం చేసినట్లు రాజీవ్ విద్యా మిషన్ సిబ్బంది వ్యవహరిస్తే.. సొమ్మొకరది.. సోకొకరిది అన్నట్లు అధికారమే పరమావధిగా హల్చల్ చేసిన నేపథ్యం ఆ మాజీ మంత్రిది. కార్యాలయ అవసరాల కోసం వచ్చిన పరికరాలను తాను మంత్రిగా ఉన్నప్పుడు సొంత అవసరానికి తీసుకెళ్లిన ఆయన.. ఇప్పటికీ తిరిగి ఇవ్వకపోవడంతో అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. వివరాల్లోకి వెళితే.. ఫైవ్ స్టార్ హోటళ్లకు వెళ్లే కోటీశ్వరులు కొందరు చెంచాలు దొంగిలిస్తుంటారు. వేలాది రూపాయల విలువ చేసే పట్టు చీరలు కొనే ఉన్నత వర్గ మహిళల్లో కొందరు చేతిరుమాళ్లు నొక్కేస్తుంటారు. పెద్ద పెద్ద స్థానాల్లో ఉంటూ ఇలా చిన్న చిన్న వస్తువులు కొట్టేయడం ఓ జబ్బు. దీన్ని వైద్యపరిభాషలో ‘క్లిప్టోమానియా’ అంటారు. రాజీవ్ విద్యామిషన్(ఆర్వీఎం)కు చెందిన ఓ ఫ్యాక్స్ మిషన్, కంప్యూటర్, ఫెడస్టల్ ఫ్యాన్లు లాంటి వాటిని డాక్టర్ సాకే శైలజానాథ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు తన ఇంట్లో ఉంచుకున్నారు. ఆయన మాజీ అయ్యాక కూడా తిరిగి ఇవ్వలేదు. దీంతో ఈయనకు కూడా ‘క్లిప్టోమానియా’ ఉందేమోనని ఆర్వీఎంలో పలువురు చర్చించుకుంటున్నారు. ఆర్వీఎం ప్రాజెక్ట్ అధికారి (పీఓ) కార్యాలయంలో ఉండే కొన్ని వస్తువులను అప్పట్లో కొందరు సిబ్బంది శైలజానాథ్ ఇంటికి తరలించి విధేయతను చాటుకున్నట్లు సమాచారం. మంత్రికి ప్రొటోకాల్ మర్యాదలు పాటించే మిషతో సిబ్బంది గతంలో భారీగానే నిధులు భోంచేశారు. ఈ విషయం సమాచార హక్కు చట్టం ద్వారా వెలుగుచూసింది. కార్యాలయ అవసరాల కోసం ప్రభుత్వం సరఫరా చేసిన ఫ్యాక్స్, ప్రింటర్ లాంటి వస్తువులు సైతం తరలించిన వైనం తాజాగా ‘సాక్షి’ పరిశీలనలో వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వం మారిన తర్వాత కూడా వాటిని సదరు మాజీ మంత్రి వెనక్కు పంపకపోవడం గమనార్హం. ఫ్యాక్స్ మిషన్ (08554-242418) తరలించడంతో పాటు అప్పటి నుంచి బిల్లు కూడా ప్రతినెలా ఆర్వీఎం అధికారులే చెల్లిస్తూ వచ్చినట్లు తెలిసింది. ప్రస్తుతం ఆర్వీఎంలో ఉన్నతాధికారులకు ఏదైనా ఫ్యాక్స్ చేయాలంటే బయట నుంచి పంపాల్సిన దుస్థితి నెలకొంది. కార్యాలయానికి ఎవరైనా ఫ్యాక్స్ పంపుతామంటే మిషన్ పని చేయడం లేదంటూ సిబ్బంది చెప్పడం అలవాటుగా మారిపోయింది. కార్యాలయానికి నాలుగు ఫెడస్టల్ ఫ్యాన్లు తెప్పించగా, వాటిలో మూడింటిని అప్పట్లోనే శైలజానాథ్ నివాసానికి తరలించినట్లు సమాచారం. కార్యాలయంలో కనిపించని కంప్యూటర్ ఆర్వీఎం కార్యాలయ అవసరాల పేరిట మూడేళ్ల క్రితం అధికారులు రూ.38 వేలు పెట్టి అనంతపురంలోని ఓ షాపులో కంప్యూటర్ కొనుగోలు చేశారు. దాన్ని కార్యాలయానికి తీసుకురాకుండా నేరుగా శైలజానాథ్ ఇంటికి తరలించారు. ఇప్పటికీ అది అక్కడే ఉంది. ఇందుకు సంబంధించిన బిల్లు నేటికీ మంజూరు చేయలేదు. సదరు షాపు యజమాని ఆర్వీఎం కార్యాలయం చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. బిల్లు విషయంలో ఇటీవల ఆర్వీఎంలోని ఓ ఉద్యోగితో తీవ్రస్థాయిలో వాగ్వాదానికి దిగాడు. కార్యాలయంలో లేని కంప్యూటర్‌కు బిల్లు మంజూరు చేయాలంటే అధికారులు వెనకడుగు వేస్త్తున్నారు. ఒకవేళ బిల్లు ఇస్తే భవిష్యత్తులో వచ్చే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని గతంలో ఇక్కడ పని చేసిన ఇద్దరు అధికారులు నాన్చుడి ధోరణి అవలంబిస్తూ వచ్చారు. ఇదిలాఉండగా.. ఫ్యాక్స్ మిషన్ విషయమై కార్యాలయ సూపరింటెండెంట్ ప్రవీణ్‌కుమార్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా...‘చాలా రోజులుగా కార్యాలయంలో ఫ్యాక్స్ మిషన్ లేదు. రిపేరీ ఉందనే విషయం సిబ్బంది చెప్పార’ంటూ పేర్కొన్నారు. మాజీ మంత్రి శైలజానాథ్ వివరణ తీసుకునేందుకు ప్రయత్నించగా.. ఆయన ఫోన్లో అందుబాటులోకి రాలేదు. విషయం తెలీదు ఫ్యాక్స్ మిషన్, ఫెడస్టల్ ఫ్యాన్లు, కంప్యూటర్ తదితర వస్తువుల విషయం నాకు తెలీదు. కంప్యూటర్ కొనుగోలు బిల్లు కూడా నా వద్దకు రాలేదు. ఒకసారి మావాళ్లతో మాట్లాడి కార్యాలయానికి సంబంధించిన వస్తువులు ఎక్కడైనా ఉంటే వెంటనే తె ప్పించే లాచ చర్యలు తీసుకుంటా. - మధుసూదన్‌రావు, పీఓ, ఆర్వీఎం