ఒంగోలు ఒన్‌టౌన్, న్యూస్‌లైన్: జిల్లాలో మధ్యాహ్న భోజనానికి సంబంధించిన బడ్జెట్ కంటిజెన్సీ నిధులు వివరాలన్నీ మండల విద్యాధికారులకు ఆన్‌లైన్ ద్వారా తెలియజేస్తామని డీఈఓ ఏ రాజేశ్వరరావు తెలిపారు. మంగళవారం సాయంత్రం స్థానిక రాజీవ్ విద్యామిషన్ ప్రాజెక్టు అధికారి కార్యాలయంలో నిర్వహించిన ఎంఈఓల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఖజానా కార్యాలయాలకు పంపించిన బడ్జెట్ కేటాయింపు కాపీలను ఎంఈఓలకు మెయిల్‌లో చేస్తామన్నారు. వీటిని పరిశీలించుకొని తమకు కేటాయించిన బడ్జెట్ మేరకు బిల్లులు పెట్టుకోవాలని ఎంఈఓలకు సూచించారు. మధ్యాహ్న భోజన పథకం వివరాలన్నీ ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. ఎంఈఓలు తప్పనిసరిగా మధ్యాహ్న భోజన పథకం అమలును పరిశీలించాలని ఆదేశించారు. పాఠశాలల సందర్శన నివేదికలను ప్రతి బుధవారం ఆన్‌లైన్‌లో నమోదు చేసి సమర్పించాలని సూచించారు. బడిబయటి పిల్లలందరినీ (ఓఎన్‌సిసీ) పాఠశాలల్లో చేర్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. 14 ఏళ్లు దాటిన వారిని ఓపెన్ స్కూలు సొసైటీలో చేర్పించాలని ఆదేశించారు.
విద్యార్థులకు ప్రీమెట్రిక్ ఉపకార వేతనాలు
ప్రభుత్వరంగ పాఠశాలల్లో ఐదు నుంచి పదో తరగతి వరకు చదువుతున్న ఎస్సీ బాల, బాలికలందరికీ ప్రీ మెట్రిక్ ఉపకార వేతనాలిస్తున్నట్లు సాంఘిక సంక్షేమ శాఖ ఉపసంచాలకులు సరస్వతి తెలిపారు. గతంలో 9, 10 తరగతుల విద్యార్థులకు మాత్రమే ఉపకార వేతనాలు మంజూరు చేసేవారన్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరం ఐదు నుంచి ఎనిమిదో తరగతి వరకు చదువుతున్న ఎస్సీ బాల, బాలికలకూ వర్తింపజేస్తున్నట్లు తెలిపారు. బాలురకు నెలకు రూ.100, బాలికలకు నెలకు రూ.150 ఉపకార వేతనంగా చెల్లిస్తామన్నారు. ఉపకార వేతనాల కోసం విద్యార్థులు కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, బ్యాంకు ఖాతా నంబర్‌ను మీ సేవా కేంద్రంలో నమోదు చేయించుకోవాలని సూచించారు. 9, 10 తరగతుల విద్యార్థులు ఆధార్ నంబర్‌నూ నమోదు చేయించుకోవాలన్నారు. వీరికి రెగ్యులర్ స్కాలర్‌షిప్‌ల మొత్తాన్ని విడుదల చేసినట్లు తెలిపారు. విద్యార్థులు జీరో బ్యాలెన్సుతో బ్యాంకులో ఖాతాలు ప్రారంభించుకోవచ్చని తెలిపారు.
సీజనల్ హాస్టళ్లకు ప్రతిపాదనలు
తల్లిదండ్రులెవరైనా పనుల కోసం వలస వెళితే వారి పిల్లల కోసం సీజనల్ హాస్టళ్లను ప్రారంభించనున్నట్లు రాజీవ్ విద్యామిషన్ ప్రాజెక్టు అధికారి కే రామశేషు తెలిపారు. 25 నుంచి 50 మంది వరకు పిల్లలుంటే అక్కడ సీజనల్ హాస్టల్ ప్రారంభించేందుకు ప్రతిపాదనలు పంపాలని ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులను కోరారు. దొనకొండ, పెదచెర్లోపల్లి మండలాల్లోని పాఠశాలల విద్యార్థులకు వెంటనే యూనిఫాం పంపిణీ చేయాలని ఆదేశించారు. విద్యార్థుల్లేని పాఠశాలలకు గతేడాది విడుదలైన నిధులను వెంటనే ఆర్‌వీఎం ఖాతాకు జమ చేయాలని ఆర్‌వీఎం ఎఫ్‌ఎఓ యెహోషువా సూచించారు. అన్ని పాఠశాలల్లో స్కౌట్స్ అండ్ గైడ్స్ ప్రారంభించాలని ఆ విభాగం ఇన్‌చార్జి సీహెచ్ వాసంతి కోరారు.
ఆరు లక్షల మంది నిరక్షరాస్యులు
జిల్లాలో ఇప్పటికీ ఆరు లక్షల మంది నిరక్షరాస్యులున్నట్లు వయోజన విద్యాశాఖ ఉపసంచాలకులు సీ వీరభద్రరావు తెలిపారు. వీరిలో అధికంగా మహిళలే ఉన్నారన్నారు. వీరందరినీ అక్షరాస్యులుగా తీర్చిదిద్దే కార్యక్రమాన్ని డీఆర్‌డీఏ, డ్వామాలు స్వీకరించాని కోరారు. జిల్లాలో వంద శాతం అక్షరాస్యత సాధించేందుకు అందరూ కృషి చేయాలన్నారు.
నిధులెప్పుడిస్తారు ?
రాజీవ్ విద్యామిషన్ ప్రాజెక్టు అధికారి కార్యాలయం నుంచి మండల విద్యాధికారులకు సకాలంలో నిధులు విడుదల చేయకపోవడంపై ఎంఈఓలు అసంతృప్తి వ్యక్తం చేశారు. పాఠశాలల్లో పారిశుధ్య కార్యక్రమాలకు రూ.1400 విడుదల చేయనున్నట్లు గతేడాది ప్రకటించారు. ఇంత వరకు ఆ నిధులు విడుదల చేయలేదు. విద్యా పక్షోత్సవాలకు వినియోగించిన వాహనాలకు చెల్లించాల్సిన రూ.25 వేలు ఇప్పటికీ రాలేదు. మండలాల్లో నిర్వహించిన శిక్షణా కార్యక్రమాలకు నిధులు పూర్తిగా చెల్లించ లేదని పలువురు ఎంఈఓలు తెలిపారు. సమావేశంలో ఉపవిద్యాధికారులు బీ విజయభాస్కర్, వీ రామ్మోహనరావు, కే వెంకట్రావు, షేక్ చాంద్‌బేగం, అసిస్టెంట్ డెరైక్టర్లు డీవీ రామరాజు, రాజీవ్ విద్యామిషన్ సెక్టోరల్ అధికారులు ఎన్ అంజిరెడ్డి, జాన్‌వెస్లీ, ఎంఈఓలు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు పాల్గొన్నారు.
మధ్యాహ్న భోజన చెల్లింపులన్నీ ఆన్‌లైన్
Published Wed, Oct 23 2013 6:15 AM | Last Updated on Fri, Sep 1 2017 11:54 PM
Advertisement
Advertisement