ముంబై: గ్రీన్ ఫైనాన్స్ (వాతావరణ పరిరక్షణకు దోహదపడే పరిశ్రమలకు ప్రోత్సాహకంగా రుణాలు) వ్యవస్థ మరింత పటిష్టం కావాల్సిన అవసరం ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) డిప్యూటీ గవర్నర్ ఎం రాజేశ్వరరావు స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి పర్యవేక్షణ, కార్యాచరణ ప్రణాళికల రూపకల్పన, ప్రమాణాల అభివృద్ధికి ప్రపంచ వ్యాప్తంగా సెంట్రల్ బ్యాంక్‌ల మధ్య సమన్వయం అవసరమని అన్నారు.
ఆయా అంశాలకు సంబంధించి కొన్ని అవరోధాలు ఎదురైనా, వాటిని ఎదుర్కొనడానికి సిద్ధపడాలని పిలుపునిచ్చారు. వాతావరణ పరిరక్షణ అంశాల్లో ఆర్‌బీఐ పాత్ర గురించి ఇక్కడ జరిగిన ఒక చర్చా గోష్ఠిలో ఆయన ప్రసంగించారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్), సెంటర్ ఫర్ సోషల్ అండ్ ఎకనమిక్ ఫోరమ్ ఈ చర్చాగోష్ఠిని నిర్వహించాయి. న్యూఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమం వివరాలను ఆర్‌బీఐ విడుదల చేసింది. రాజేశ్వర రావు ప్రసంగంలో ముఖ్యాంశాలు...
- కొత్త గ్రీన్ వెంచర్‌లకు ఆర్థిక సహాయం చేయడం మాత్రమే సరిపోదు. ఇప్పటికే ఉన్న ఉద్గార సంస్థలు ఉత్పత్తి లేదా వృద్ధి అంశాలపై రాజీ పడకుండా విశ్వసనీయమైన వాతావరణ అనుకూల పరివర్తన ప్రణాళికలను రూపొందించుకొని, అనుసరించాల్సిన అవసరం ఉంది.
- ఇందుకు ప్రపంచ వ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకుల సహాయ సహాయసహకారాలు, కార్యాచరణ ప్రణాళికలు అవసరం. ఇది గ్రీన్ ఫైనాన్స్ మార్కెట్‌లో పారదర్శకత, ప్రామాణీకరణ, సమగ్రతను ప్రోత్సహించడంలో సహాయపడుతుంది.
- సంవత్సరాలుగా గ్రీన్ ఫైనాన్స్ కార్యక్రమాలను ప్రోత్సహించడానికి, వాటికి మద్దతు ఇవ్వడానికి రిజర్వ్ బ్యాంక్ వివిధ విధాన చర్యలు తీసుకుంటోంది.
- ఉదాహరణకు బ్యాంకుల ప్రాధాన్యతా రంగ రుణాల (పీఎస్‌ఎల్) పోర్ట్‌ఫోలియోలో పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులకు ఫైనాన్స్‌ను చేర్చడం జరిగింది.
- ఈ సంవత్సరం ప్రారంభంలో సావరిన్ గ్రీన్ బాండ్లను (ఎస్‌జీఆర్‌బీ) విజయవంతంగా జారీ చేయడంలో భారత ప్రభుత్వానికి రిజర్వ్ బ్యాంక్ మద్దతు ఇచి్చంది. ఈ బాండ్ల ద్వారా వచ్చే ఆదాయాన్ని ఆర్థిక వ్యవస్థలో కార్బన్ తీవ్రతను తగ్గించడంలో సహాయపడే ప్రభుత్వ రంగ ప్రాజెక్టుల అమలుకు వినియోగించే విషయం తెలిసిందే.
- సావరిన్ గ్రీన్ బాండ్ల జారీ... ఇందుకు సంబంధించి ఇతర ఆర్థిక సాధనాల విషయంలో ధరను నిర్దారించేందుకు కూడా సహాయపడుతుంది. అలాగే దేశంలో గ్రీన్ ఫైనాన్సింగ్ పర్యావరణ వ్యవస్థకు ఉద్దేశించిన మార్కెట్ అభివృద్ధికి పురికొల్పుతుంది.
- ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థపై వాతావరణ మార్పు ప్రభావాల గురించి ప్రపంచ దేశాల్లో అవగాహన పెరుగుతోంది. తదనుగుణంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేంద్ర బ్యాంకులు, పర్యవేక్షకుల సానుకూల ప్రతిస్పందనలూ పెరుగుతున్నాయి.
- వాతావరణ సమస్యలు, సంబంధిత ఆర్థిక నష్టాలను అర్థం చేసుకోవడానికి, అంచనా వేయడానికి, ప్రణాళికలు రూపొందించడానికి సెంట్రల్ బ్యాంక్‌లు, ఆర్థిక సంస్థలు, రియల్ ఎకానమీ భాగస్వామ్యులను సన్నద్ధం చేయడానికి పెద్ద ఎత్తున సామర్థ్య నిర్మాణ ప్రయత్నాన్ని చేపట్టాల్సిన అవసరం ఉంది.
- తద్వారానే నూతన ఆవిష్కరణలు, వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోగలుగుతారు. మూలధనాన్ని సమీకరించగలరు. స్థిరత్వ లక్ష్యాలను సాధించడానికి సమర్థవంతమైన పరివర్తన ప్రణాళికలను రూపొందించగలరు. వాతావరణ అనుకూల పారిశ్రామికీకరణ విషయంలో సూక్ష్మ, లఘు, మధ్య, చిన్న (ఎంఎస్‌ఎంఈ) తరహా పరిశ్రమలపై పాత్ర ఎంతో కీలకం.
- వాస్తవానికి అభివృద్ధి చెందిన దేశాలకు సంబంధించి వాతావరణ పరిరక్షణకు చర్యలు, ఆర్థిక కట్టుబాట్లు, అమలు సంతృప్తికరంగా లేదు. ఏమి చేస్తున్నారు– చేయవలసినది ఏమిటి అన్న అంశాల మధ్య అంతరం పెరుగుతోంది. ఈ విషయంలో 100 బిలియన్ డాలర్ల హామీకి భిన్నంగా 2020లో అభివృద్ధి చెందిన దేశాలు మొత్తం 83.3 బిలియన్ డాలర్లు వెచ్చించాయి. 2019తో పోల్చితే ఇది కేవలం 4 శాతం మాత్రమే పెరిగాయి. ఇలాంటి ధోరణి మారాలి.
Comments
Please login to add a commentAdd a comment