శాస్త్రాలలోని విషయాలను గురుసమ్ముఖంలో కూర్చొని శ్రవణం చేసి, గ్రహించిన జ్ఞానాన్ని ఏకాగ్రమైన మనస్సుతో అనుభవానికి తెచ్చుకొని, స్వీయ స్వరూపాన్ని తెలుసుకోవటమే ‘జ్ఞానం’. ఆ జ్ఞానాన్ని ఏకాగ్రతతో అనుభవానికి తెచ్చుకొనుటకు ఆచరించే ఉపాయమే ‘యోగం’ (యోగ సాధన) మనస్సు పూర్తిగా నిర్మలంగా, నిష్కల్మషంగా, స్వచ్ఛంగా ఉంటేనే అందులో పరమాత్మ ఉండేది. నిర్మలమైన అద్దంలో ప్రతిబింబం బాగా ప్రకాశిస్తుంది గాని, దుమ్ము కొట్టుకొని ఉన్న అద్దంలో ప్రతిబింబం సరిగ్గా కనిపించదు గదా! కనుక నీలో పరమాత్మ జ్ఞానం ప్రకాశించాలంటే నీ అంతఃకరణం స్వచ్ఛంగా నిర్మలంగా ఉండాలి.
అలాంటి జ్ఞానం కలిగి, నిరంతరం యోగం నందే ఉండాలి, ఏదో కొద్దిసేపు నేను ఆత్మను అనే జ్ఞానంలో ఉండటం కాక శాశ్వతంగా – స్థిరంగా ఆత్మగా ఉండిపోవాలి. ఇలా ఉండాలంటే మనం బ్రహ్మనిష్ఠ, కరుణా సముద్రుడైన గురువును ఆశ్రయించాలి. నిత్యం గురువు ద్వారా సందేహాలను తొలగించుకోవాలి. అలా జ్ఞానంలో నిలబడటం జరుగుతుంది. బుద్ధి ద్వారా పరమాత్మను గురించి శ్రవణం చేయడం, విచారణ చేయడం. ఆయనను చేరుకొనేందుకు కృషి చెయ్యాలి. సత్కార్యాలను సక్రమంగా చేసినట్లైతే స్వర్గ లోకాలకు వెళ్ళి అక్కడ భోగాలు అనుభవించటం కూడా నిజమే. అయితే పుణ్యఫలం ఖర్చైపోగానే తిరిగి ఈ లోకంలోకి రావాలాల్సిందే. మళ్ళీ చరిత్ర ప్రారంభించవలసిందే.
తాను చెప్పే నూతన విషయాలను, సూక్ష్మబుద్ధికి తప్ప అంతుబట్టని వేదాంత విషయాలను అతడు చక్కగా అర్థం చేసుకొని వదలవలసిన వాటిని వదిలి, పట్టుకోవలసిన వాటిని పట్టుకోవాలి. తీవ్రమైన మోక్షాపేక్షతో తన దగ్గరకు వచ్చిన శిష్యుడు దృఢ నిశ్చయంతో మోక్షమార్గంలో ప్రయాణించాలంటే తాను కొన్ని కఠోరమైన సత్యాలను చెప్పక తప్పదు. అందుకే గురువులు ఇలా గట్టిగా చెబుతుంటారు. వాడు పిల్లికి బిచ్చం పెట్టడు, ఫలానా వాడు ఎంగిలి చేత్తో కాకిని తోలడు, వాడికి పూజా లేదు పునస్కారం లేదు.
ఇంక వాడేం మోక్షాన్ని పొందుతాడు? మోక్షాన్ని గనక పొందాలంటే భక్తితో భగవంతుని కొలవాలని, జపతపాలు చేయాలని, పరోపకారాలు (దానధర్మాలు) చేయాలని.. ఇలా చేస్తేనే ముక్తి అని అంటూ ఉంటారు. ముక్తి పొందాలనుకున్నవారు, మోక్షప్రాప్తిని కోరేవారు ఇవన్నీ చెయ్యాల్సిన పనిలేదా? చేయకూడదా ? అంటే చేయాల్సిందే. అయితే ఎలా చేయాలి ? ఎందుకు చేయాలి? మన మనోబుద్ధుల అలజడులు తగ్గించి శాంత పరచుకోవటానికి – నిష్కామంగా, ఎట్టి కోరికలు లేకుండా కర్మలను చేయాలి.
అంతవరకే వీటి ప్రయోజనం. సరే మరి ఇంత కర్కశంగా చెప్పటం ఎందుకు? వేదాంతాన్ని అభ్యసించటానికి ఒక సద్గురువు ను సమీపించేటప్పటికే శిష్యుడు కొన్ని అర్హతలను కలిగి ఉండాలి. ఈ సంసార సాగరాన్ని తరించే ఉపాయాన్ని బోధించమని గురువును ప్రార్థించినప్పుడు గురువు చెప్పే సునిశిత విషయాలను గ్రహించే మానసిక స్థిరత్వం, ఏకాగ్రత, బుద్ధిసూక్ష్మత శిష్యుడికి ఉండాలి. అలా ఉండాలంటే అప్పటికే వారు ధార్మిక జీవనానికి అలవాటు పడి, నిష్కామ కర్మలు, జపతపాలు ఇష్టదేవతారాధన మొదలైన వాటిని సక్రమంగా ఆచరించేవారై ఉండాలి.
► మీరు ఇతరులను ఆదుకుంటే ఇతరులు మిమ్మల్ని ఆదుకుంటారు.
► మీరు ఇతరుల అభివృద్ధికి కృషి చేస్తే , మీ అభివృద్ధికి ఇతరులు కృషి చేస్తారు.
► మీరు ఇతరుల కోసం సమయాన్ని వెచ్చిస్తేనే, మీ కోసం ఇతరులు సమయాన్ని వెచ్చిస్తారు.
► మీరు ఇతరులకు ఆత్మ విజ్ఞానాన్ని పంచితే , మీకు సృష్టి ఆత్మ విజ్ఞానం పంచుతుంది.
► మీరు ఇతరుల దైవత్వానికి కృషి చేస్తేనే , మీరు దైవత్వం పొందగలుగుతారు.
► ‘పరోపకారం‘ (దానాలు) చేయాలని నిజంగా మీరు నిర్ణయించుకుంటే ఎన్నో రకాలుగా చేయవచ్చు. మనసు ఉంటే మార్గం ఎప్పుడూ ఉంటుంది.
► ‘పరోపకారం’ ద్వారా అన్ని సమస్యలలో నుంచి సులభంగా, వేగంగా, శాశ్వతంగా బయటపడవచ్చు.
► సామాన్యంగా లోకంలో ముక్తి అంటే ఏవో పైనున్న లోకాలకు వెళ్ళి కైలాసం, వైకుంఠం, లేదా స్వర్గానికి వెళ్ళి సుఖాలు అనుభవించటమే అని అనుకుంటారు. కాని కలియుగంలో అన్నిటికన్నా ప్రధానం
► ‘పరోపకారం’. (దానాలు) చేసుకోకపోతే ముక్తి ఎలా వస్తుంది..?
జీవితంలోని ఏ సమస్యలైనా ‘పరోపకారం’ ద్వారా తొలగిపోతాయి. సర్వ అనారోగ్యాలను, సమస్త సమస్యలను ‘పరోపకారం’ ద్వారా శాశ్వతంగా తొలగించుకోవచ్చు. ఎవరికైనా సహాయం చేయండి. మంచి పనులు చేయండి. అడగక ముందే వారి అవసరాన్ని కనిపెట్టి, ఏమీ ప్రతిఫలం ఆశించకుండా సహాయం చేయండి. ఏ సహాయం చేయగలుగుతారో అదే చేయండి. మీకు సహాయం చేసే వీలు లేకపోతే కనీసం సహాయం ఎక్కడ దొరుకుతుందో తెలియజెప్పండి. మీరు ఏదైనా సహాయం చేస్తేనే మీకు సహాయాలు లభిస్తాయి. మీరు ప్రేమను పంచితేనే, మీరు ప్రేమను పొందగలుగుతారు.
బయటి ప్రవర్తన – లోపల మనస్సు రెండూ ఒక్కటిగా ఉంటేనే ధ్యానంలో మనస్సు నిలుస్తుంది. జ్ఞానాన్ని చక్కగా గ్రహించగలుగుతారు. అప్పుడే మనస్సు పరమాత్మకు దగ్గరగా ఉంటుంది. ఇలా మనస్సు నిర్మలంగా స్వచ్ఛంగా ఉండాలంటే – నిరంతరం భగవంతుని పూజలు, యజ్ఞలు, పరోపకారం (దానాలు), తపస్సులు, ఆధ్యాత్మిక సాధనలు భక్తితో ఆచరించాలి. అలాగాక ఆచరణ గొప్పగా ఉండి మనస్సు మాత్రం ప్రాపంచిక విషయాలతో, స్వార్థపూరిత భావాలతో వ్యవహరిస్తే అది పరమాత్మకు దూరం చేస్తుంది.
– భువనగిరి, కిషన్ యోగి
Comments
Please login to add a commentAdd a comment