భారతీయ ఆధ్యాత్మిక జ్ఞానం హేతుబద్ధతను మించిన తర్కాన్ని ఏనాడో చేసింది. వాటి రూపాలే ఉపనిషత్తులు. పూర్ణమదః పూర్ణమిదం అంటూ ‘థియరీ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ’ సూత్రాన్ని సంస్కృత భాష వేల ఏళ్ల క్రితమే ఉద్భోధించింది. తదేజతి తన్నైజతి అంటూ విశ్వశక్తి గురించి అప్పుడే విశ్లేషణ చేసింది. కామం, సంకల్పం, సంశయం, శ్రద్ధ, అశ్రద్ధ, ధైర్యం, అధైర్యం, లజ్జ, బుద్ధి, భయం అన్నీ మనోరూపాలేనని మానసిక శాస్త్రాన్నీ విడమర్చింది. ఇలా అనేక శాస్త్రాలకు బీజమేశాయి ఉపనిషత్తులు. వీటిని ఆకళింపు చేసుకుంటే ఆత్మ, పరమాత్మల ఏకత్వాన్ని అర్థం చేసుకోవడంతోపాటు ఆచరణలో పెట్టడం సాధ్యం అవుతుంది. తద్వారా మనిషి అరిషడ్వర్గాలను అణచివేసి, నిష్కామకర్మను దినచర్యగా చేసుకోగలుగుతాడు. నిష్కామకర్మ వలన ఎలాంటి భవబంధాలు మనిషిని తాకలేవు. తద్వారా మృత్యుంజయ మంత్రంలో చెప్పినట్టుగా మనిషి మృత్యుభావనను జయించి అమృతమయ జీవితాన్ని జీవించగలుగుతాడు. అదే ఆధ్యాత్మికజ్ఞాన లక్ష్యం.ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకోలేక సాధారణ మానవుడు రజ్జుసర్ప భ్రాంతిని పొందుతున్నాడు. అంటే ఈ కనిపించే భౌతిక రూపాలు సత్యమనుకుంటూ బంధనాలు వేసుకుంటున్నాడు. కులం మతం లాంటి బలహీనతలను పొందుతున్నాడు. ప్రకృతిలో మానవుడు ఒక భాగమేనన్న నిజాన్ని మనం అనుక్షణం గుర్తు పెట్టుకోవాలి.
ఈ ప్రాకృతిక రూపాలు ఏ విధంగా తమ తమ కర్మలను ఆచరించి ఇతర ప్రాకృతిక రూపాల మనుగడకు దోహదపడుతున్నాయో, ఆ విధంగా మానవుడు కూడా తన మానవత్వ కర్మలను ఆచరించి, పాంచభౌతిక రూపాన్ని సాధించి, చివరకు పంచభూతాల ద్వారా అనంతశక్తిగా మార్పుచెందడమే ధర్మం. అదే మోక్షం. దాన్ని తెలుసుకోవడమే జ్ఞానం. అజ్ఞానం చేత కర్మఫలాలు శాశ్వతం అనుకుంటున్నాం. అయితే, సృష్టి, స్థితి, లయలు అనేవి నిరంతర క్రియలు అని తెలుసుకుని కర్మఫలాలు ఆశించకుండా కర్మలు ఆచరించడమే నిష్కామకర్మ. ఏతావాతా నిష్కామకర్మకు ఆధారం జ్ఞానం. జ్ఞానమంటే హేతువాదమే!
జ్ఞాన సాహిత్య నిధి అయిన ఉపనిషత్తులు, ఆదిశంకరుని అద్వైతాన్ని అవగాహనలోకి తెచ్చుకోవడం తద్వారా నిష్కామ కర్మలను ఆచరించడం ద్వారా అరిషడ్వర్గాలను చిదిమి వేయగలం. నిష్కామ కర్మ వల్ల ప్రతిఫలించే తాదాత్మ్యత హృదయాంతరాల నుండి మొదలుకొని ముఖవర్చస్సు వరకు ఆవహించి ఉంటుంది. అద్వైతజ్ఞాని ప్రతి జీవిలోనూ, నిర్జీవిలోనూ, పంచభూతాలలోనూ, శూన్యంలోనూ అంతర్లీనంగా ఉండే ఈశావాస్యమిదం సర్వాన్ని దర్శించగలుగుతాడు. ’అహం బ్రహ్మాస్మి’ని అనుభవించగలుగుతాడు.
– గిరిధర్ రావుల
ధర్మాన్ని తెలుసు కోవడమే జ్ఞానం తత్త్వ రేఖలు
Published Sun, Aug 5 2018 12:37 AM | Last Updated on Fri, Nov 9 2018 6:22 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment