
చీకటి తొలగాలంటే వెలుగు కావాలి. అరిషడ్వర్గాలు తొలగాలంటే జ్ఞానం కావాలి. జ్ఞానార్జన అంత సులభమైన విషయం కాదు. జ్ఞానమంటే హేతువును అర్థం చేసుకోవడం. జ్ఞానమంటే స్థితిని అవగతం చేసుకోవడం. కార్యకారణ తత్వాన్ని ఆకళింపు చేసుకోవడం. ఆత్మానాత్మ వివేకం పొందడమే జ్ఞానం. ఏతావాతా ‘నేను’ లోపల, బయట ఏముందో అవగతం చేసుకోవడమే జ్ఞానం. జ్ఞాని స్థితప్రజ్ఞుడు. అతనికి సుఖదుఃఖాలతో, జయాపజయాలతో, కష్టనష్టాలతో, ఆరోగ్యానారోగ్యాలతో, కలిమిలేములతో పనిలేదు. ఏదైనా సమానమే. కంటికి కనిపించే భౌతిక రూపాలన్నీ ఆ అనంతమైనశక్తి నుండి ఉద్భవించినవే. పంచభూతాల మేలిమి కలయిక వల్ల శరీరాలు ఏర్పడ్డాయని తెలుసుకోవడం, తిరిగి పాంచభౌతికమైనవన్నీ అదేశక్తిలో విలీనమవుతుందని అర్థం చేసుకోవడం జ్ఞానం. అదే అద్వైతవాదం. జ్ఞానం అనేది ఓ మానసిక తపస్సు. నిరంతర శోధన దృశ్యమాన ప్రపంచం లో ఉన్న మానవుడు దృశ్యమాన ప్రపంచం ద్వారా అదశ్యమైన శక్తిని సాధ్యం చేసుకోవడమే జ్ఞానం. అదే సత్యాన్వేషణ. మరి ఈ సత్యం అంటే ఏమిటి?
‘సతత యతీతి సత్యం’. అంటే నిరంతరంగా ఉండేదే సత్యం. నేను ఉంటానా? ఉండను. మీరు ఉంటారా? ఉండరు.
చుట్టూతా ఉండే చెట్టు, పుట్ట, గట్టు, ఏరులు, నదులు, కొండలు, కోనలు ఏవీ నిరంతరంగా ఉండేవి కావు. అంతేనా సూర్యుని నుండి జన్మించిన భూమి నశించేదే. మనందరికీ ఆధారమైన సూర్యుడూ నశిస్తాడు. నక్షత్రాలు, నక్షత్ర మండలాలు నశించి తిరిగి అనంతశక్తిలో భాగమవుతాయి. అంటే భౌతిక రూపంలో ఉన్న ఖగోళ పదార్థాలన్నీ తిరిగి ఆ అనంత ఖగోళ శక్తిగా మారిపోవడం అనేది, అదే శక్తి నుండి ఖగోళ పదార్థాలు రూపొందడం అనేది నిరంతర ప్రక్రియ. అదే విషయాన్ని అంటే దృశ్యమాన భౌతిక ప్రపంచం ఆ అనంతశక్తి నుండి ఏ విధంగా ఉద్భవిస్తుంది అనే విషయం బృహదారణ్యకోపనిషత్తు స్పష్టంగా వివరించింది. ఏ విధంగానైతే సాలీడు నుండి దారం వెలువడుతుందో, ఏ విధంగానైతే నిప్పు నుంచి నిప్పురవ్వ లు వెలువడతాయో, అదే విధంగా ఈ ఆత్మ(అనంతశక్తి) నుండి అన్ని రకాల శక్తులు, అన్ని రకాల లోకాలు, అన్ని రకాల దేవతలు(అభౌతిక జీవులు), సంపూర్ణ స్థూల జగత్తు ఉత్పన్నమౌతుంది. దానిని తెలుసుకో! దాని దగ్గరకు వెళ్ళు! అది సత్యానికే సత్యం! ఆ మూలాధార ప్రాణమే సత్యం! అలా చెప్పేదీ సత్యమే!
– రావుల గిరిధర్
Comments
Please login to add a commentAdd a comment