ఆ బాంబర్లు.. ఎయిర్‌పోర్టులో క్లీనర్లు!! | Did bomber brothers work as cleaners at Brussels Airport? | Sakshi
Sakshi News home page

ఆ బాంబర్లు.. ఎయిర్‌పోర్టులో క్లీనర్లు!!

Published Fri, Mar 25 2016 11:24 AM | Last Updated on Sun, Sep 3 2017 8:34 PM

ఆ బాంబర్లు.. ఎయిర్‌పోర్టులో క్లీనర్లు!!

ఆ బాంబర్లు.. ఎయిర్‌పోర్టులో క్లీనర్లు!!

బ్రసెల్స్ బాంబర్ సోదరులు విమానాశ్రయంలో క్లీనర్లుగా పనిచేశారా? ఇబ్రహిం, ఖలీద్ ఎల్ బాక్రాయిలకు టెర్మినల్ నిర్మాణంపై పూర్తి అవగాహన ఉందా? వీరిద్దరూ అమెరికా టెర్రర్ వాచ్ లిస్టులో ఉన్నారా? ఇలా ఉత్పన్నమౌతున్న ఎన్నో అనుమానాలు ఒక్కొక్కటే నిజమౌతున్నాయి.  విమానాశ్రయాన్ని నాశనం చేయడమే లక్ష్యంగా ఆ జిహాదీ సోదరులు టెర్మినల్‌లో క్లీనర్లుగా పనికి చేరినట్లు స్వయంగా వారి మేనమామ తెలపడం ఆ అనుమానాలను నిజం నిజం చేస్తోంది.

ఇబ్రహీం, ఖలీద్ ఎల్ బక్రాయి బ్రసెల్స్ ఉగ్రదాడులకు ముందే వ్యూహం పన్నినట్లు తాజాగా తెలుస్తోంది. విమానాశ్రయాన్ని నాశనం చేయాలన్న లక్ష్యంతోనే వారిద్దరూ అక్కడ క్లీనర్స్ గా చేరి, సెక్యూరిటీ చెక్ ల నుంచి కూడా ఎలా తప్పించుకోవాలో క్షుణ్ణంగా పరిశీలించారని తెలుస్తోంది. ఆ సోదరులిద్దరూ కనీసం పాఠశాల చదువు కూడా పూర్తి చేయలేదని, ఎయిర్ పోర్ట్, రెస్టారెంట్లో వాళ్ళిద్దరూ క్లీనర్స్ గా  చేరారని, వేసవికాలంలో ఎయిర్ పోర్టు శుభ్రం చేసే పనిలో ఉన్నారని వారి మేనమామ తెలిపారు.

ఈ సోదరులిద్దరూ అమెరికా టెర్రర్ వాచ్ లిస్టులో ఉన్నట్లు తెలుస్తోందని విమానాశ్రయాన్ని పరిశీలించిన  బెల్జియన్ ప్రాసిక్యూటర్ ఒకరు తెలిపారు. ఇబ్రహీం గతంలో రెండుసార్లు బహిష్కరణకు గురైనట్లు వెల్లడించినా, అతడు ఐసిస్ మోజులో ఉన్నాడని తెలిపినా తమ హెచ్చరికలను బెల్జియం విస్మరించిందని టర్కిష్ అధికారులు కూడా అంటున్నారు. గత జూలైలో ఓ టర్కిష్ పోలీసును ఇబ్రహీం కాల్చి చంపేశాడని వారు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో బెల్జియం హోం, న్యాయశాఖ మంత్రులు రాజీనామా చేశారు. అయితే ప్రధానమంత్రి వారిని వారించారు. విపత్కర పరిస్థితుల్లో రాజీనామా సరైన నిర్ణయం కాదంటూ వారిని అంగీకరించలేదు.

29 ఏళ్ళ ఇబ్రహీం, బాంబ్ మేకర్ నజీమ్ లాచ్రౌ  ఇద్దరూ జావెంటెమ్ ఎయిర్ పోర్టులో సూట్ కేస్ బాంబు పేల్చి బీభత్సం సృష్టించారు. బాంబు పేలే సమయానికి వారు చేతులకు గ్లౌజెస్ పెట్టుకుని తమ ట్రాలీలను తీసుకెళ్తున్నట్లు సీసీటీవీ ఫుటేజ్ ను బట్టి తెలుస్తోందని, వారి పక్కనే టోపీ పెట్టుకుని ఓ తెల్లజాతి వ్యక్తి సీసీటీవీలో కనిపించాడని, అతడికి చెందిన బాంబు పేలకపోవడంతో అక్కడినుంచి పారిపోయాడని పోలీసులు తెలిపారు. అమెరికా అధికారులు కూడా అతడు అమెరికా వాచ్ లిస్టులో ఉన్నట్లు వెల్లడించారు. విమానాశ్రయంలో ఉగ్రదాడి జరిగిన కొద్ది సేపటికే మీల్ బీక్ స్టేషన్లో బాంబు దాడికి పాల్పడిన ఖలీద్ అక్కడినుంచి కూడా తప్పించుకొని ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

అయితే ఈ జిహాదీ సోదరులిద్దరూ పాఠశాల స్థాయి వరకూ బాగానే చదివినా.. ఆ తర్వాత వారిద్దరికీ నేర చరిత్ర తీవ్రంగానే ఉంది. ఇద్దరూ పలు కేసుల్లో జైలు శిక్ష అనుభవించారు. అదే నేపథ్యంలో వారు ఎయిర్ పోర్ట్ ను లక్ష్యంగా చేసుకుని ముందుస్తు అంచనాతోనే అక్కడ క్లీనర్స్ గా పనికి చేరి ఉండొచ్చని వారి మేనమామ చెబుతున్నారు. జైలుశిక్ష అనుభవించిన అనంతరం వారిలో తీవ్ర మార్పు కనిపించిందని, హుందాగా కనిపించడం, వస్త్రధారణలో వచ్చిన మార్పులతో పాటు ఇబ్రహీం ఎప్పుడూ ఎవరికో ఒకరికి సహాయం చేస్తుండేవాడని ఇదంతా చూస్తే వారు తిరిగి ఇలాంటి చర్యకు పాల్పడతారని  ఊహించలేదని వారి మేనమామ విచారణలో వెల్లడించాడు. కాగా ఎయిర్ పోర్ట్ అధికారులు మాత్రం ఆ సోదరులిద్దరూ విమానాశ్రయంలో క్లీనర్స్ గా పనిచేశారా లేదా అన్నది ఇంకా నిర్థారించలేదు. మరోవైపు బాంబ్ మేకర్ నజీమ్ లాచ్రౌ సోదరుడు మౌరాద్ లాచ్రౌ మాత్రం తమ అన్న మూడేళ్ళ క్రితం సిరియా పారిపోయినప్పటినుంచీ అతడితో తమ కుటుంబానికి ఎటువంటి సంబంధం లేదని, సూసైడ్ బాంబర్స్ తీరు ఎంతో సిగ్గుగా, బాధగా అనిపించిందని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement