సాక్షి, అమరావతి: పాఠశాల విద్యలో విద్యార్థి వికాస చదువులకు రాష్ట్రంలో ప్రాధాన్యం పెరిగింది. పిల్లలు జాతీయ, అంతర్జాతీయంగా రాణించేలా పరీక్షల్లోను, ప్రశ్నల తీరులోను మార్పులు తీసుకొచ్చారు. అకడమిక్ మార్కులు కంటే.. విద్యార్థి మానసిక వికాసం, విశ్లేషణ సామర్థ్యాల పెంపుపై దృష్టి పెట్టారు. అందుకు అనుగుణంగా విషయ పరిజ్ఞానం అంచనా వేసేలా పరీక్షలు నిర్వహిస్తున్నారు. కొన్ని దశాబ్దాలుగా పరీక్షల్లో సంప్రదాయ ప్రశ్నల శైలి.. మార్కుల సాధనకే పరిమితమైంది. పిల్లల్లో వికాసం, విశ్లేషణ సామర్థ్యాలను అంచనా వేసే విధానం కరువైంది.
దీంతో గత ఏడాది నుంచి రాష్ట్రంలో పాఠశాల విద్యాశాఖ పరీక్ష నిర్వహణ, ప్రశ్నల శైలిలో మార్పులు తీసుకొచ్చింది. మరోపక్క కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా విద్యాస్థాయిని అంచనా వేసేందుకు, అభ్యసన లోపాలను గుర్తించేందుకు వివిధ రకాల సర్వేలు చేస్తోంది. వీటిలో ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ నేషనల్ అచీవ్‌మెంట్ సర్వే (ఎఫ్‌ఎల్‌ఎస్), నేషనల్ అచీవ్‌మెంట్ సర్వే ముఖ్యమైనవి. వీటిద్వారా వివిధ రాష్ట్రాల్లో విద్యార్థుల సామర్థ్యాలను, ఉపాధ్యాయుల బోధనా నైపుణ్యాలను అంచనా వేసి రాష్ట్రాలకు ర్యాంకింగ్ ఇస్తోంది. విద్యా సంవత్సరంలో నిర్వహించే ఫార్మెటెవ్, సమ్మెటివ్ అసెస్‌మెంట్లలో 1 నుంచి 8వ తరగతుల విద్యార్థులకు సిలబస్ ప్రకారం విశ్లేషణాత్మక ప్రశ్నలకు ప్రాధాన్యం ఇస్తోంది.
ఎన్‌ఏఎస్ సర్వేకు అనుగుణంగా పరీక్షలు
దేశవ్యాప్తంగా విద్యార్థుల సామర్థ్యాలను అంచనా వేసేందుకు కేంద్ర ప్రభుత్వం నేషనల్ అచీవ్‌మెంట్ టెస్ట్ (ఎన్‌ఏఎస్), ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ నేషనల్ అచీవ్‌మెంట్ సర్వేను ఏటా చేపడుతుంది. 2021లో కేంద్రం ఎన్‌ఏస్, 2022లో ఎఫ్‌ఎల్‌ఎస్ నిర్వహించింది. కరోనా అనంతరం నిర్వహించిన ఈ సర్వేలో దేశవ్యాప్తంగా అభ్యసన లోపాలు ఉన్నట్టు గుర్తించి, వాటిని అధిగమించేందుకు పలు సంస్కరణలను చేపట్టి నూతన విద్యా విధానానికి అనుగుణంగా అమలు చేస్తోంది.
ఇందులో భాగంగా విద్యార్థుల సామర్థ్యాలను అంచనా వేసేందుకు ఏ తరహా పరీక్షలు, ప్రశ్నలు ఉంటాయో అదే విధానాన్ని ప్రభుత్వం పాఠశాల విద్యలో గత ఏడాది నుంచి అనుసరిస్తోంది. కేంద్ర ప్రభుత్వం వచ్చే నెల 3న జాతీయ స్థాయిలో సర్వే నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా గత నెలలో అండమాన్–నికోబార్‌లో వివిధ రాష్ట్రాల అసెస్‌మెంట్ సభ్యులకు శిక్షణ ఇచ్చింది. అందులో రాష్ట్రాలు విద్యా ప్రమాణాలు పెంచేందుకు తీసుకుంటున్న చర్యలు, అసెస్‌మెంట్‌లో అనుసరించాల్సిన విధానాలను విడుదల చేసింది. దీనికి అనుగుణంగా సిద్ధమవ్వాల్సిందిగా రాష్ట్రాలను ఆదేశించింది.
రాష్ట్ర స్థాయిలో అసెస్‌మెంట్ సెల్ ఏర్పాటు
ప్రస్తుతం రాష్ట్రంలో ఈ తరహా పరీక్ష విధానాన్ని 2022–23 విద్యా సంవత్సరంలో ప్రవేశపెట్టారు. కేంద్రం నిర్వహించే నేషనల్ అచీవ్‌మెంట్ సర్వే, ఎఫ్‌ఎల్‌ఎస్ పరీక్షల తరహాలోనే రాష్ట్రంలో పరీక్ష పత్రాలను రూపొందిస్తున్నారు. ఇందుకోసం 15 మంది నిపుణులైన ఉపాధ్యాయులతో రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) ఆధ్వర్యంలో ప్రత్యేక అసెస్‌మెంట్ సెల్ ఏర్పాటు చేశారు. విద్యార్థులు సాధించిన ఫలితాల ఆధారంగా బోధనలో సైతం మార్పులు చేస్తున్నారు. ఇందుకోసం ప్రతినెలా సబ్జెక్టు టీచర్లకు స్కూల్ కాంప్లెక్స్ శిక్షణ సైతం ఇస్తున్నారు.
విద్యార్థి సామర్థ్యం అంచనాకు విశ్లేషణాత్మక ప్రశ్నలు
ఒక విద్యా సంవత్సరంలో పాఠశాల విద్యాశాఖ నాలుగు ఫార్మెటివ్, రెండు సమ్మెటివ్ (ఆరు) అసెస్‌మెంట్లు నిర్వహిస్తోంది. వీటిలో రెండు ఫార్మెటివ్, ఒక సమ్మెటివ్ అసెస్‌మెంట్లకు ‘ఓఎంఆర్’ విధానం అనుసరిస్తున్నారు. ఈ విద్యా సంవత్సరంలో ఎఫ్‌ఏ–1 ఓఎంఆర్ విధానంలో పూర్తిచేయగా, ఎఫ్‌ఏ–2ను పాత విధానంలో మంగళవారం నుంచి నిర్వహించనున్నారు. ఈ విధానాన్ని 1 నుంచి 8వ తరగతి వరకు అనుసరిస్తోంది.
పదో తరగతిలో బోర్డు పరీక్షలకు ఇబ్బంది లేకుండా 9, 10 తరగతులకు పాత విధానంలోనే పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఎఫ్‌ఏలో మొత్తం 20 మార్కులకు 15 ప్రశ్నలు ఉంటాయి, ఇందులో 10 ప్రశ్నలకు ఓఎంఆర్ విధానంలో జవాబులు గుర్తించాలి. మరో ప్రశ్నలకు 5 డిస్క్రిప్టివ్ విధానంలో సమాధానాలు రాయాలి. ఈ ప్రశ్నలన్నీ విద్యార్థి మానసిక సామర్థ్యం, ప్రశ్నలు అర్థం చేçసుకునే విధానాన్ని పరీక్షించేలా ఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment