మనుషులే కాదు ఎన్నో జంతువులను కూడా అంతరిక్షంలోకి పంపారు. ఈగలు, కుక్కలు, ఎలుకలు, చేపలు, కోతులు, చింపాంజీలను వివిధ ప్రయోజనాల కోసం అంతరిక్షంలోకి పంపారు. జంతువులను అంతరిక్షంలోకి పంపే ప్రక్రియ 21వ శతాబ్దంలోనూ కొనసాగింది. దీని సాయంతో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో అనేక ప్రయోగాలు నిర్వహించారు.
అంతరిక్ష రంగంలో నూతన విజయాలు సాధించినప్పుడల్లా మనం శాస్త్రవేత్తల కృషిని మెచ్చుకుంటాం. అయితే పలు జంతువులు కూడా ఈ విజయంలో భాగస్వామయ్యమయ్యాయనే సంగతిని మరచిపోతుంటాం. మనుషులు అంతరిక్షంలోకి వెళ్లకముందు పలు జంతువులను అక్కడికి పంపించారు. ఆ తర్వాతే మనుషులను అక్కడికి సురక్షితంగా పంపించవచ్చని శాస్త్రవేత్తలు గ్రహించారు. ఏఏ జంతువులు అంతరిక్షంలోకి పంపారో ఇప్పుడు తెలుసుకుందాం.
అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి జీవులు ఈగలు, వీటిని 1947లో అమెరికా శాస్త్రవేత్తలు పంపారు. నాడు శాస్త్రవేత్తలు.. వ్యోమగాములపై ఖగోళ రేడియేషన్ ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకోవాలనుకున్నారు. V-2 బాలిస్టిక్ క్షిపణిని ఉపయోగించి, 109 కిలోమీటర్ల ఎత్తుకు ఈగలను అంతరిక్షంలోకి పంపారు. పారాచూట్ ద్వారా వాటిని న్యూ మెక్సికోలో దింపారు. క్యాప్సూల్స్ తెరిచినప్పుడు ఈగలు సజీవంగా కనిపించాయి.
అంతరిక్షంలోకి పంపబడిన జంతువులలో కోతుల జాతులు ఉన్నాయి. వీటిలో రీసస్ మకాక్స్, పిగ్-టెయిల్డ్ కోతులు, స్క్విరెల్-టెయిల్డ్ కోతులు, చింపాంజీలు కూడా ఉన్నాయి. ఆల్బర్ట్- II అనే పేరుగల రీసస్ మకాక్ 1949లో 134 కిలోమీటర్ల వరకూ చేరుకుంది. అయితే అది తిరిగి వస్తుండగా మృతి చెందింది. దీని తరువాత 1961 లో కోతి జాతికి చెందిన హామ్ అనే చింపాంజీని నాసా అంతరిక్షంలోకి పంపింది, అది సురక్షితంగా తిరిగి వచ్చింది.
మానవ ఆరోగ్యం, ఔషధాల తయారీ మొదలైన పరిశోధనలలో ఎలుకలను ఎక్కువగా ఉపయోగిస్తారు. మానవులపై అంతరిక్ష వాతావరణం ప్రభావాన్ని తెలుసుకునేందుకు ఎలుకలను అంతరిక్షంలోకి పంపారు. ఎలుకల అంతరిక్ష అనుభవాల గురించి నాసా ఒక వివరణాత్మక అధ్యయనాన్ని కూడా నిర్వహించింది. 1950లో 137 కిలోమీటర్ల వరకు అంతరిక్షంలోకి తొలి ఎలుకను పంపారు. అయితే అది పారాచూట్ ఫెయిల్యూర్‌తో మృతి చెందింది.
సోవియట్ యూనియన్ గరిష్ట సంఖ్యలో కుక్కలను అంతరిక్షంలోకి పంపింది. వాటిలో అత్యంత ప్రసిద్ధమైనది 1957లో లైకా అనే శునకం. అయితే అది భూమికి తిరిగి రాలేకపోయింది. ఇది అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి జంతువుగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. అయితే దీనికి ముందు కూడా కొన్ని కుక్కలను అంతరిక్షంలోకి పంపారు.
ఆశ్చర్యంగా అనిపించినా అంతరిక్షంలోకి తాబేలును కూడా పంపిన మాట మాత్రం నిజం. 1968లో అమెరికా, సోవియట్ యూనియన్‌ల మధ్య చంద్రుడిపైకి వెళ్లేందుకు పోటీ నెలకొన్న నేపధ్యంలో రష్యా రెండు తాబేళ్లను జోండ్ 5 అనే అంతరిక్ష నౌకలో అంతరిక్షంలోకి పంపింది. అవి చంద్రుని చుట్టూ ఆరు రోజులు తిరిగిన తర్వాత భూమికి తిరిగి వచ్చాయి. అయితే అవి ప్రణాళిక ప్రకారం కజకిస్తాన్‌లో ల్యాండ్ కాకుండా హిందూ మహాసముద్రంలో పడిపోయాయి. అయితే వాటిని రక్షించారు.
నాసా ఈ జంతువులనే కాకుండా, కప్పలు, సాలెపురుగులు (1973), చేపలు (1973), టార్డిగ్రేడ్ (2007), పిల్లి (1963) ని అంతరిక్షంలోకి పంపింది. 2012లో జపాన్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేపలను పంపింది. ఇంతేకాకుండా అనేక మొక్కలపై, ముఖ్యంగా ఆహారం తయారీపై అంతరిక్షంలో పలు ప్రయోగాలు జరిగాయి. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో సూక్ష్మజీవుల పెరుగుదలపై కూడా అనేక ప్రయోగాలు జరిగాయి.
ఇది కూడా చదవండి: పుతిన్ రష్యా అధ్యక్షుడెలా అయ్యారు?
Comments
Please login to add a commentAdd a comment