అంతర్గత నిర్మాణంతో అసలైనశ్రేయస్సు | internal structure of the original with the well-being | Sakshi
Sakshi News home page

అంతర్గత నిర్మాణంతో అసలైనశ్రేయస్సు

Published Thu, Mar 12 2015 11:09 PM | Last Updated on Sat, Sep 2 2017 10:43 PM

అంతర్గత నిర్మాణంతో  అసలైనశ్రేయస్సు

అంతర్గత నిర్మాణంతో అసలైనశ్రేయస్సు

సద్గురు  జగ్గీ వాసుదేవ్
 
ఈ భూమిపై మనిషి శ్రేయస్సు కోసం శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ముఖ్యంగా గత వంద సంవత్సరాలుగా ఎంతో కృషి జరిగింది. దీనివల్ల మనకు ఖచ్చితంగా ఎంతో సౌఖ్యమూ, సౌలభ్యమూ ఏర్పడ్డాయి. మన ముందు తరాల వారు  ఇటువంటి సుఖమయ జీవితాన్ని కనీసం ‘కల’ కూడా కని ఉండరు. వీటివల్ల మానవాళి మెరుగుపడిందా?

మీరు ప్రపంచాన్ని, ముఖ్యంగా పశ్చిమదేశాలను, ఉదాహరణకు అమెరికాను చూసినట్లయితే, నలభై శాతం మంది ప్రజలు తమ మానసిక సమతుల్యత కోసం మందులపై ఆధారపడి ఉన్నారు. ఇది శ్రేయస్సు కాదు. మానవాళి ఎందుకు బాగాలేదు అంటే మనం బాహ్యం గురించిన జాగ్రత్తలు తీసుకున్నాం కాని అంతర్గత క్షేమాన్ని ఎప్పుడూ పట్టించుకోలేదు.  నిజమయిన మానవ శ్రేయస్సు ఒక వ్యక్తి తనలో తాను ప్రశాంతంగా, ఆనందంగా ఉన్నప్పుడే కలుగుతుంది.

మీలో మీరు ప్రశాంతంగా, ఆనందంగా ఎలా ఉండాలో మీకు తెలియనప్పుడు, మీరు ఉండే ఇల్లు, నడిపే కారు, వేసుకునే బట్టలు, మీ చుట్టూ ఉన్నవాళ్ళు, వీటికోసం మీరు చేసిన కృషి, ఇవన్నీ వ్యర్థం అవుతాయి. మీరు మీ స్వతహాగా ప్రశాంతంగా, సంతోషంగా జీవించగలిగినప్పుడే, మీ జీవితాన్ని భయమూ, ఆందోళనా లేకుండా గడపగలుగుతారు. నాకేమి అవుతుందో అన్న భయం మీలో ఉన్నంతవరకూ, మీరు కేవలం సగం అడుగులు మాత్రమే వేస్తారు. పూర్తి అడుగులు ఎప్పుడూ వేయరు. కాబట్టి, మనిషి తన పూర్తి సామర్థ్యం ఏమిటో తెలుసుకోవాలనుకున్నప్పుడు, మొదట తనలో ప్రశాంతత, ఆనందంతో కూడిన అంతర్గత స్థిరత్వం కలిగి ఉండాలి. అప్పుడే తను జీవితపు అవకాశాలను అన్వేషించి అందుకోగలుగుతాడు. లేకపోతే, అతని ఆనందం యాదృచ్ఛికం కావడం వల్ల, అతను జీవితం గురించి ఒక పెద్ద సందిగ్ధస్థితిలో ఉంటాడు.

మీరు ఎవరయినా, ఎంతటి శక్తిశాలురైనా, బయటి పరిస్థితులు ఎల్లవేళలా 100% మీ అదుపులో ఉండవు. ఎందుకంటే అవి ఎన్నో ఆటంకాలను కలిగి ఉంటాయి. వాటిలో చాలావరకు మీకు తెలియను కూడా తెలియవు. మీకు తెలిసిన కొన్నింటినే మీరు నియంత్రించే ప్రయత్నం చేస్తారు, కాని మిగతావి మీకు అర్థం కూడా కావు. అలాంటప్పుడు నియంత్రించే ప్రసక్తే ఉండదు. అవన్నీ మీకు అనువుగా జరుగుతాయని మీరు ఆశిస్తున్నారు అంతే. కాని, మీ అంతర్గత  విషయాలకు వచ్చేసరికి మీరు ఒక్కరే ఉంటారు. కనీసం అవైనా మీరనుకున్న తీరులో జరిగి తీరాలి. లేదంటే మీరు దారి తప్పారని అర్థం.

అంతా ఇందువల్లే, అంటే వారి అంతర్గతం వారి ఆధీనంలో లేకపోవడం వల్లే, ఒత్తిడికి గురై, పూర్తిగా అలసిపోతుంటారు. మీ పనిని బట్టి మీరు ఒత్తిడికి గురికారు. మీ వ్యవస్థను మీరు నియంత్రించుకోలేకపోవడం వల్ల ఒత్తిడి జనిస్తుంది. మీరు నిజంగా మీ జీవితంలో నాణ్యత కావాలనుకుంటే, మీ చుట్టూ ఉన్న జీవితంలో అదే నాణ్యత ఉండాలనుకుంటే, మీలోని అంతర్గత పరిస్థితులను స్థిరపరుచుకుని, మీ మనస్సు, మీ భావాలు, మీ వ్యవస్థ బాహ్యజీవితపు ఒడిదుడుకులను అనుసరించకుండా స్థిరంగా ఉండేలా చేయాలిసి ఉంటుంది. మీలో అంతర్గత ఒడిదుడుకులూ, సమస్యలు లేనప్పుడు మీరు బాహ్య సవాళ్ళను సమర్థవంతంగా ఎదురుకోగలరు.

మరి అలాంటి అంతర్గత పరిస్థితిని ఏర్పరుచుకునే మార్గమేదయినా ఉందా? తప్పక ఉంది. బాహ్యపరిస్థితులను మనం కోరుకున్నవిధంగా సృష్టించుకోవడానికి శాస్త్ర-సాంకేతిక పరిజ్ఞానం వున్న విధంగానే, అంతర్గత పరిస్థితులనూ మనం కోరుకున్నవిధంగా సృష్టించుకోవడానికి శాస్త్ర-సాంకేతిక పరిజ్ఞానం ఉంది.

ప్రపంచాన్ని మనకు అనువుగా నిర్మించుకున్న విధంగానే, మన అంతర్గతాన్ని కూడా మనం మనకు కావలసిన విధంగా నిర్మించుకోగలం. కాబట్టి, మీరు నిజంగా మీ జీవితంలో నాణ్యత మెరుగుపడాలి అనుకుంటే, ఆ దిశగా అడుగులు వేయాలి. మీ అంతర్గత శ్రేయస్సుకోసం మీ సమయాన్ని కొంత వెచ్చించడానికి సిద్ధపడాలి. ఇది జరిగితే, మీరు పనిచేసే విధానంలో అసాధారణ మార్పు గమనిస్తారు. ఇందుకు కావలసిన పరిజ్ఞానం ఉంది. దీన్నే నేను ఇన్నర్ ఇంజనీరింగ్ (అంతర్గత నిర్మాణం) అంటాను. ఇది యోగా ద్వారా సాధ్యం. దీనిద్వారా అత్యున్నతమైన శ్రేయస్సును పొందవచ్చు.

 ప్రేమాశీస్సులతో,  సద్గురు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement