తిరుపతి కల్చరల్, న్యూస్‌లైన్: విజ్ఞానాన్ని పెంపొందించే మంచి నేస్తాలు పుస్తకాలు అని జిల్లా కలెక్టర్ కే.రామ్‌గోపాల్ తెలిపారు. భారతీయ విద్యాభవన్ ఆధ్వర్యంలో ఎస్వీ హైస్కూల్ క్రీడా మైదానంలో శనివారం ఏర్పాటు చేసిన 8వ పుస్తక ప్రదర్శన ను ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోని అనేక సంగతులను అవలోకనం చేసుకునేందుకు పుస్తక ప్రదర్శన దోహదపడుతుందన్నారు.
అధునాతన టెక్నాలజీ కారణంగా పుస్తకం మనుషులకు దూరమయ్యే పరిస్థితి నెలకొందన్నారు. బయట దేశాల్లో అం దరి చేతుల్లో పుస్తకం దర్శనమిస్తుందని, కానీ మన దేశంలో సెల్‌ఫోన్లు కనిపిస్తాయన్నారు. ఫలితంగా సమాజంలో సంస్కృతి, సాంప్రదాయాలు కరువవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పుస్తక పఠనం జీవితాన్ని నేర్పడమే కాక లోకజ్ఞానాన్ని, మానవీయ విలువలను పెంచుతుందన్నారు.
మానసిక ప్రశాంతతకు దోహదం చేస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ పుస్తక పఠనం అలవర్చుకుని విజ్ఞానవంతులై భావితరాలకు మార్గదర్శకులు కావాలని ఆయన పిలుపునిచ్చా రు. భారతీయ విద్యాభవన్ ఆధ్వర్యంలో పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. అనంతరం భారతీయ విద్యాభవన్ చైర్మన్, టీటీడీ ఈవో ఎంజీ.గోపాల్ మాట్లాడు తూ మనిషి మస్తకాన్ని చైతన్యపరచే సాధనం పుస్తకమన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు పుస్తక పఠనం పట్ల ఆసక్తి పెంచి వారిలో భాష పట్ల మమకారం, సమాజం పట్ల అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.
భారతీ య విద్యాభవన్ డెరైక్టర్ సత్యనారాయణరాజు మాట్లాడుతూ అందరికీ పుస్తక పఠనం పెంపొం దించాలనే లక్ష్యంతో ప్రతి ఏటా తమ సంస్థ ఆధ్వర్యంలో పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం ఏర్పాటు చేసిన 8వ పుస్తక ప్రదర్శనలో రాష్ట్రం నుంచే కాక ఇతర రాష్ట్రాలకు చెందిన సాహిత్యం, సామాజిక శాస్త్రా లు, విద్య, విజ్ఞానం, పోటీ పరీక్షలకు సంబంధించిన అనేక రకాల పుస్తకాలతో సుమారు 68 స్టాల్స్ ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. అనంతరం పద్మావతి మహిళా వర్శిటీ రిజిస్ట్రార్ పీ.విజయలక్ష్మీ మాట్లాడుతూ పుస్తకాలు మానవీయ సంబంధాలకు అద్దం పడతాయన్నారు. దీనికి ముందు పుస్తకాలను పల్లకిలో ఉంచి మహతి కళాక్షేత్రం నుంచి పుస్తక ప్రదర్శన కేంద్రం వరకు ఊరేగింపు నిర్వహించి పుస్తకం గొప్పతనాన్ని చాటారు.
లోక సంచారి అనుభవాలు
‘జ్ఞాని లోక సంచారి’ అన్న సామెతను ఒంటబట్టించుకున్న రచయిత పరవస్తు లోకేశ్వర్ ఒంటరిగా ఆసియాలోని అన్ని దేశాలకు లింక్ కలిగిన రూటులో సాహసయాత్ర చేశారు. రెండువేల సంవత్సరాల క్రితం చైనా నుంచి రోమ్‌కు సిల్క్ ఎగుమ తి చేసే వారు. ఆ మార్గంలో ఖజికిస్థాన్ రాజధాని థాష్కెంట్ నుంచి చైనా రాజధా ని బీజింగ్ వరకు 16 వేల కిలోమీటర్లు 55 రోజులు ఒంటరిగా యాత్ర సాగించారు. ఈ యాత్ర ద్వారా తాను గ్రహించిన విషయాలను, పొందిన అనుభూతుల ను అక్షరరూపంలో కూర్చి ‘సిల్క్ రూట్‌లో సాహసయాత్ర’ అనే పుస్తకా న్ని రూపొందించారు. రచయిత ఈ పుస్తకంతో పాటు తన ఇతర రచనలతో తిరుపతిలో భారతీయ విద్యాభవన్ వా రు ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శనలో 51వ స్టాల్‌లో ఉన్నారు. ఆయన వద్దకు వెళ్లి పుస్తకాలు కొనుగోలు చేశామంటే, పుస్తకంతో పాటు ఆయన యాత్రా విశేషాలను తెలుసుకోవడం చక్కటి అను భూతినిస్తుంది.