జ్ఞాన భాండాగారాలు
జీవన కాలమ్
ఈ దేశం ఎంతటి అజ్ఞానాన్నయినా తట్టుకుని భరించగలదు. కానీ ‘జ్ఞానం’ ఎక్కడో జైళ్లలో భద్రంగా ఎదురు చూస్తుంటుంది. చౌతాలాని మార్గదర్శకంగా గ్రహించండి. మీ చదువులు మీ కోసం జైళ్లలో భద్రంగా ఎదురు చూస్తున్నాయని మరవకండి.
ఈ దేశంలో చాలామంది రాజకీయ నాయకులు జైలుకి వెళ్లాల్సిన అవసరం ఉందని తను వెళ్లి నిరూపించిన సీని యర్ నాయకులు ఓంప్రకాష్ చౌతాలా. ఆయన ఉపాధ్యాయుల నియామకం విషయంలో పెద్ద కుంభకోణాన్ని జరిపి, జైలుకి వెళ్లి బుద్ధిగా చదువుకుని తన 82వ ఏట ఇప్పుడిప్పుడే ఇంటర్మీడియెట్ పరీక్ష పాసయ్యారు. వారు తీహార్ జైల్లో గత నాలుగున్నర ఏళ్లుగా ఉంటున్నారు. ఇది ఈ దేశ చరిత్రలో మార్గదర్శకమైన పరిణామంగా నేను భావిస్తున్నాను.
ఈ వార్తను ముఖ్యంగా లల్లూ ప్రసాద్ యాదవ్ వంటి వారు శ్రద్ధగా గమనించాలి. వారు గడ్డి కుంభకోణంలో ఆ మధ్య జైలుకి వెళ్లి వచ్చారు. ఆ సమయాన్ని ఆయన వృధా చేసుకున్నారని చౌతాలాని చూస్తే అర్థమౌతుంది. ఆ సమయంలో కనీసం రెండో ఫారం చదివినా రేపు ప్రభుత్వం ఫైళ్లు చదువుకోడానికి ఉపయోగపడేది.
అలాగే లల్లూ ఇద్దరు కొడుకులు–తేజ్ ప్రతాప్ యాదవ్, తేజస్వీ యాదవ్ బిహార్‌లో మంత్రులుగా ఉన్నారు. వారిలో ఒకాయన ఉప ముఖ్యమంత్రి. అర్హతలు ఏమిటీ అనేది అర్థం పర్థం లేని ప్రశ్న. క్లాసయినా పాసయే సదవకాశాన్ని కల్పించాలి. ‘మిష’ అంటారా? తమ తండ్రిగారి లాగ ఏదో గడ్డి తిని ఆ సరాసరి ముఖ్యమంత్రి పదవికి వచ్చే అవకాశముంది. కనుక వారిని వెంటనే జైలుకి పంపి రెండో తరగతికయినా తర్ఫీదు ఇప్పిస్తారని మనం ఆశించవచ్చు.
ఈ దేశంలో జైళ్లకు ఎంతో అపకీర్తి ఉంది. అలనాడు తిలక్ మహాశయులు జైల్లో ఉంటూ భగవద్గీతకి వ్యాఖ్యానం రాశారు. రాజాజీ పిల్లలకు అర్థమయ్యే సరళమైన ఇంగ్లీషులో రామాయణ, భారతాలను వ్రాశారు. నెహ్రూగారు ‘డిస్కవరీ ఆఫ్ ఇండియా’ రాశారు. ఇవన్నీ ఆ పెద్దల వికారాలుగా మనం సరిపెట్టుకోవచ్చు. చౌతాలా హర్యానా ముఖ్యమంత్రిగా ఉంటే ఏనాడయినా ఇంటర్ పరీక్ష పాసయ్యేవారా? వారికి చిన్నతనంలో చదువు సరిగ్గా సాగలేదు. తర్వాత సాగించాలనుకుంటే తండ్రి దేవీలాల్‌తో పాటు రాజకీయాలలో ఉండడంవల్ల చదువుకునే అవకాశం రాలేదని ప్రస్తుత హర్యానా ప్రతిపక్ష నేత–అభయ్ సింగ్ చౌతాలా తన తాత గురించి చెప్పారు.
ఈ మధ్య ఒక నానుడి ఏర్పడింది. ‘నువ్వేం చదువుకోలేదా? మరేం పర్వాలేదు. సరాసరి పార్లమెంటుకి వెళ్లే అర్హతలున్నట్టే. లేదూ? చదువుకోవాలని ఉందా? నిక్షేపంగా జైలుకి వెళ్లు’. ఈ దేశంలో ఏ అర్హతా అక్కరలేని వ్యాపకం ఒక్కటే–రాజకీయ రంగం. చదువుకుంటే గుమస్తావి అవుతావు. చదువు లేకపోతే మంత్రివి అవొచ్చు.
రేపట్నుంచి జస్టిస్ కర్ణన్ వంటివారు జైల్లో ఉంటారు. మన జైళ్లలో ఉన్న కొందరు మహనీయులైన నాయకుల పేర్లు– జయలలిత, కనిమొళి, శశికళ, సురేష్ కల్మాడీ, అక్బరుద్దీన్ ఒవైసీ, పప్పు యాదవ్, ఎ. రాజా, యడ్యూరప్ప, అమర్ సింగ్, పండిత సుఖ్‌రాం, మధుకోడా. అయితే వీరంతా జైళ్లను సద్వినియోగం చేసుకోలేదని చెప్పాలి.
తను హత్యకు గురవడానికి చాలాకాలం ముందు చెర్లపల్లి జైలు నుంచి – జూలకంటి శ్రీనివాస్ అనే మొద్దు శీను నా నవల ‘సాయంకాలమైంది’ చదివి నాలుగు పేజీల ఉత్తరం రాశాడు. ఆ నవల చదివి ఉత్తరం రాసిన మరొకాయన ఉన్నారు. ఈ దేశపు మాజీ ప్రధాని పీవీ నరసింహారావుగారు. ఆ రెండు ఉత్తరాలూ నా దగ్గర భద్రంగా ఉన్నాయి. అయితే మొద్దు శీను ఉత్తరం కొట్టొచ్చినట్టు గుర్తుకు వస్తూంటుంది. కారణం– అతడు జైల్లో లేకపోతే కలలో కూడా నవల చదివి ఉండడు.
ఏకాంతం అంతర్ముఖుడిని చేస్తుంది. ఆ నిశ్శబ్దం– తనకు లేనిదీ, తను కోల్పోయినదీ–గుర్తుకు తెస్తుంది. తీరిక, నిస్సహాయమైన ఏకాంతం–దాన్ని భర్తీ చేసుకునే వెసులుబాటుని కల్పిస్తుంది.
అందుకు కనీసం – ఒక నేరమైనా చేయాలి. జైలుకి వెళ్లే అర్హతని సంపాదించుకోవాలి. అప్పుడు – కనీసం ఇంటర్మీడియెట్ చదువయినా అబ్బుతుంది. లేకపోతే ఏమవుతుంది? మీరు రాష్ట్రానికయినా ముఖ్యమంత్రులయిపోతారు. లేదా జైలుకి వెళ్లే తండ్రులుంటే పార్లమెంటు సభ్యులయినా అయిపోతారు. ఈ దేశం ఎంతటి అజ్ఞానాన్నయినా తట్టుకుని భరించగలదు. ఈ సంస్కృతికి ఉన్న మన్నిక అది. కానీ ‘జ్ఞానం’ ఎక్కడో జైళ్లలో భద్రంగా ఎదురు చూస్తుంటుంది. కనుక నాయకులకిదే పిలుపు. చౌతాలాని మార్గదర్శకంగా గ్రహించండి. సత్వరంగా ఏ ఉపాధ్యాయుల కొంపలో ముంచండి. లేదా గడ్డి తినండి. మీ చదువులు మీ కోసం జైళ్లలో భద్రంగా ఎదురు చూస్తున్నాయని మరిచిపోకండి.
గొల్లపూడి మారుతీరావు