సౌశీల్యం అంటే,,? | Telugu Inspirational Quotes | Sakshi
Sakshi News home page

సౌశీల్యం అంటే,,?

Published Mon, Jul 1 2024 7:18 AM | Last Updated on Mon, Jul 1 2024 7:18 AM

Telugu Inspirational Quotes

రాముడి పదహారు గుణాలలో ప్రత్యేక గుణం అని చెప్పదగినది సౌశీల్యం. శ్రీరామచంద్రుడు అరణ్యవాసానికి బయలుదేరి వెడుతున్నప్పుడు గుహుడి రాజ్యంలో ప్రవేశించాడు. అప్పుడు గుహుణ్ణి ‘‘ఆత్మవత్సఖః’’ అంటాడు. అంటే గుహుడు రాముడికి ఎంత అంటే తనతో సమానమైన వాడు. అరమరికలు లేకుండా ఎవరితో ఉండ గలడో అతడు. రాముడు వస్తున్నాడని తెలిసి గుహుడు వద్ధులైన మంత్రులతో కలిసి రాముడికి ఎదురు వెళ్ళాడు స్వాగతం చెప్పటానికి. రాముడు తానే ముందుగా అతడిని పలుకరించి కౌగిలించుకున్నాడు. రాముడు చక్రవర్తి కుమారుడు. గుహుడు సరిహద్దు  ప్రా​ంతంలో ఉన్న ఒక సామాన్యమైన వనచర రాజ్యానికి అధిపతి మాత్రమే. 

రాముడికి అటువంటి భేదాలు లేవు. రాముడికి పట్టాభిషేకం అని ప్రకటించిన తరువాత సుమంత్రుడు రాముడి అంతఃపురంలో ప్రవేశించటానికి అనుమతి అడుగుతుంటే అటువంటిది అవసరం లేదు అంటాడు. తాను కాబోయే రాజు అయినా చిన్నతనం నుండి ఎత్తుకుని ఆడించిన వాడు కనుక తారతమ్యం చూపించ లేదు. జటాయువుని పక్షి అని చూడకుండా అంత్యక్రియలు నిర్వర్తించాడు. దశరథుడు కూడా అటువంటి సౌశీల్యం కలవాడు కనుకనే జటాయువుతో మైత్రి నెర΄ాడు. దేవతలు దశరథుడితో మైత్రి కలిగి ఉండటానికి ఈ గుణమే కారణమేమో! కృష్ణ సుధాముల మైత్రి కూడా ఇటువంటిదే. 

పైగా కుచేలుడుగా ప్రఖ్యాతి పోందిన సుధాముడు కృష్ణుడి ఐశ్వర్యాన్ని చూసి చనువుగా ఉండటానికి కొంచెం సందేహిస్తుంటే, తానే ఎదురు వెళ్ళి, తీసుకు వచ్చి, కాళ్ళు కడిగి, సకల మర్యాదలు చేసి, అతడిలో ఉన్న ఆ కాస్త బెరుకుని పోగొట్టటానికి  గురుకులంలో గడిపిన కాలాన్ని గుర్తు చేస్తాడు. పైగా అతడికి ఏమీ ఇచ్చి పంపలేదు వెళ్లేటప్పుడు. అతడి లేమిని ఎత్తి చూపి, తన ఆధిక్యం చూపించుకున్నట్టు అవుతుంది అని. ఇంటికి చేరే సరికి గుట్టు చప్పుడు కాకుండా అన్నీ సమకూర్చాడు. ఎంతటి సౌశీల్యం!  దీనికి భిన్నమైన ఉదాహరణలు కూడా ఉన్నాయి. 

ద్రుపదుడు విద్యాభ్యాస సమయంలో ఇచ్చిన మాట తప్పి తనను చూడటానికి వచ్చిన ద్రోణుణ్ణి అవమాన పరుస్తాడు. తగిన ఫలం అనుభవించాడు. లోకంలో తరచుగా ఇటువంటివారే ఎక్కువగా కనపడుతూ ఉంటారు. స్నేహానికి కూడా అంతస్తు చూస్తారు. అవసరానికి స్నేహం నటించటం ఉంటుంది. పని అయిపోయిన తరువాత అంతకు ముందు ఉన్న సుహద్భావం కనపడదు. అవసరం వచ్చి నప్పుడు అడ్డు రాని అంతస్తులు, హోదాలు, పదవులు, ఆర్థిక వ్యత్యాసాలు అప్పుడు కనపడతాయి.

  మరొక ప్రధానమైన గుణం – మిత్రులు తక్కువ స్థాయిలో ఉన్నారు కనుక వారిని తమ స్థాయికి తీసుకు రావటానికి ప్రయత్నం చేయరు. అంటే, వారి స్థాయిని గుర్తించినట్టే కదా! అది వారిని అవమానించినట్టే అవుతుంది. వారు ఉన్న స్థితి వారికి నచ్చినది, తప్తి కలిగించేది. వారికి కావలసినది ప్రేమ, ఆత్మీయత, ఆదరణ. దానిని చూపించటమే సౌశీల్యం. ఈ లక్షణం ఎంత అపురూపమో కదా!          – డా. ఎన్‌. అనంత లక్ష్మి

‘మహతః మందై స్సహ నీరంధ్రేణ సంశ్లేషః సౌశీల్యం’’ జాతి చేత విద్య చేత ఐశ్వర్యం చేత చాలా గొప్పవాడైనా తన కంటే తక్కువ వారితో అరమరికలు లేక కలిసి ఉండటం సౌశీల్యం.


ఒక్కసారి మైత్రి ఏర్పడిన తరువాత అది జిడ్డు లాగా అంటుకు పోతుంది. అందుకే దానిని స్నేహం అన్నారు. స్నేహం అంటే నూనె, పట్టుకుంటే వదలని జిడ్డు అని అర్థం. చిన్నతనంలో ఇటువంటి తేడాలు తెలియవు కనుక అందరితో కలిసి మెలిసి ఉంటారు. ఎదుగుతున్న కొద్ది దూరం జరగుతూ ఉంటారు. కానీ, సజ్జనులు అటువంటి భావాలని దారికి రానీయరు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement