తెలంగాణలో ఉద్యోగాల నియామకం నిరంతర ప్రక్రియ అని.. ప్రతిభ ఆధారంగానే నియామకం ఉంటుందని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అన్నారు.
కరీంనగర్: తెలంగాణలో ఉద్యోగాల నియామకం నిరంతర ప్రక్రియ అని.. ప్రతిభ ఆధారంగానే నియామకం ఉంటుందని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఆదివారం ఆయన కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలో జరిగిన గ్రామజ్యోతి కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం మీడియాతో మాట్లాడారు. నిరుద్యోగులు బ్రోకర్లను ఆశ్రయించి మోసపోవద్దని సూచించారు. ఎవరు ఎలా విమర్శించినా ప్రజల ఎజెండాగానే ముందుకెళ్తామని చెప్పారు.
పోటీ పరీక్షలపై మీడియా చెప్పిన వాస్తవాలకు స్పందిస్తామని తెలిపారు. రూమర్స్తో నిరుద్యోగులు అయోమయానికి గురికావద్దన్నారు. అదే విధంగా.. ప్రతి ఒక్కరు 'గ్రామజ్యోతి' కార్యక్రమంలో పాల్గొని అభివృద్ధి పనుల్లో భాగస్వాములు కావాలని మంత్రి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. హరిత తెలంగాణ నిర్మించుకోవడానికి అందరు మొక్కలు నాటాలని మంత్రి సూచించారు.