gramajyothi
-
గ్రామజ్యోతి వెలుగులేవీ?
మసకబారుతున్న పథకం పెరుగుతున్న రాజకీయ జోక్యం పంచాయతీ పాలకవర్గాల పెత్తనం తీర్మానాలను పట్టించుకోని యంత్రాంగం కమిటీల్లో కానరాని ఉత్సాహం గ్రామ స్వరాజ్యానికి బాటలు పడని దుస్థితి జోగిపేట: ప్రజలే పాలనలో భాగస్వాములు కావాలి.. కమిటీలుగా ఏర్పడి సమావేశాలు నిర్వహించాలి.. తమ సమస్యలపై గ్రామస్థులంతా చర్చించుకుని పరిష్కారమార్గం కనుగొనాలి.. అనే ఉన్నతాశయంతో చేపట్టిన గ్రామజ్యోతి పథకం మసకబారుతోంది. పెరుగుతున్న రాజకీయ జోక్యం.. పంచాయతీల పాలకవర్గం పెత్తనం.. వెరసి కమిటీల్లో ఉత్సాహం కొరవడుతోంది. కమిటీలు రూపొందించిన తీర్మానాలను సైతం యంత్రాంగం బుట్టదాఖలు చేస్తుండటంతో పథకంపై చీకట్లు కమ్ముకుంటున్నాయి. ‘గ్రామజ్యోతి’ ప్రారంభించి సరిగ్గా ఏడాది అయిన సందర్భంగా జిల్లాలో పథకం దుస్థితిపై కథనం.. గ్రామ పంచాయతీలు బలోపేతం చేసేందుకు, గ్రామ స్వరాజ్యానికి బాటలు వేసేందుకు గ్రామ జ్యోతి పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా ఏడాది క్రితం ప్రారంభించింది. 2015 ఆగస్టు 17న వరగంల్ జిల్లా గీసుకొండ మండలం ఆదర్శగ్రామమైన గంగదేవిపల్లిలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అయితే రాజకీయ జోక్యం.. పంచాయతీ పాలకవర్గాల పెత్తనం.. ఎమ్మెల్యేలు చెప్పిందే తుది నిర్ణయం కావడం.. అధికారపక్ష కార్యకర్తలకే ప్రాధాన్యం ఇవ్వడం వంటి కారణాలతో గ్రామ జ్యోతి వెలుగులు పంచకముందే మసకబారిపోతోంది. కార్యక్రమాన్ని గాడిలో పెట్టాలనే సంకల్పం అధికార యంత్రాంగంలో లేకపోవడం, కమిటీలు బలోపేతం అయితే తమ ఆధిపత్యానికి గండి పడుతుందని నేతలు భావించడంతో గ్రామజ్యోతిపై నిర్లక్ష్యం నీడలు అలుముకున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఈ కార్యక్రమాన్ని జిల్లా యంత్రాంగం మొదట్లో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. జిల్లాలో మొత్తం 1,077 గ్రామపంచాయతీలు ఉన్నాయి. గ్రామజ్యోతిలో ఒక్కో గ్రామానికి ఏడు కమిటీలను నియమించింది. గ్రామాల్లోని అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలే ఆ కమిటీలో సభ్యులుగా ఉండాలని నిర్ణయించింది. తాగునీరు, పారిశుద్ధ్యం, వ్యవసాయం, వైద్యం, విద్య, సహజ వనరులు, మౌలిక వసతులు, మద్యపానం, సాంఘిక సంక్షేమం, పేదరిక నిర్మూలన అంశాలుగా కమిటీలు వేసి ఒక్కో కమిటీకి అధ్యక్షుడు, నలుగురు సభ్యులను నియమించింది. ఇక్కడి వరకు అంతా సవ్యంగానే సాగింది. గ్రామజ్యోతి కమిటీల ద్వారా వచ్చే తీర్మానాలకు ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో కొద్దిరోజుల్లోనే ఈ కమిటీలు అలంకారప్రాయంగా మారాయి. ఎలాగూ తీర్మానాలను పట్టించుకోరనే భావనతో కమిటీలోని సభ్యులు కూడా సమావేశాలకు రావడానికి ఆసక్తి చూపడంలేదు. ప్రతి ప్రభుత్వ సంక్షేమ పథకానికి గ్రామజ్యోతి కమిటీ అంగీకారం కావాల్సి ఉన్నా దీన్ని పట్టించుకోవడం లేదు. అసలు ఈ సమావేశాలు జరుగుతున్నాయా లేదా అనే సమీక్ష కరువైంది. ఏ ప్రాంతంలో కమిటీలు బలహీనంగా ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా ఎన్ని తీర్మానాలు అందాయి? ఎన్ని సమస్యలు పరిష్కారం అయ్యాయన్న సమాచారం అధికారుల దగ్గర లేకపోవడం గమనార్హం. శిక్షణా పూర్తి గ్రామజ్యోతి కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఈ కమిటీల్లోని సభ్యులు గ్రామ పంచాయతీకి వచ్చే నిధులను సద్వినియోగం చేసేలా చూడడమే. కమిటీల సభ్యులకు నాలుగునెలల క్రితం గ్రామజ్యోతి కార్యక్రమంపై అవగాహన కలగడానికి అన్ని ప్రాంతాల్లో శిక్షణ ఏర్పాటుచేశారు. తొలుత ప్రతి మండలానికి కనీసం ఇద్దరు మాస్టర్స్ ట్రైనర్స్‌ను గుర్తించి వీళ్లకు ప్రభుత్వం శిక్షణ ఇప్పించింది. శిక్షణ పొందినవారే ఒక్కో గ్రామంలో మళ్లీ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. అయినా ప్రయోజనం శూన్యం. కొన్ని గ్రామాల్లో పరిస్థితి మరీ అధ్వానంగా ఉంది. కమిటీల్లో ఉన్న సభ్యులకు తాము ఏ కమిటీలో ఉన్నామన్న విషయం కూడా తెలియని పరిస్థితి. గ్రామ పంచాయతీలకు సరిపడా నిధులు విడుదలవుతన్నాయని అధికారులు చెబుతున్నా, గ్రామజ్యోతి కమిటీలు చేసే తీర్మానాలు మాత్రం అమలుకావడం లేదు. కమిటీలను బలోపేతం చేసి తీర్మానాలకు ప్రాధాన్యం ఇస్తే గ్రామాభివృద్ధిలో మంచి ఫలితాలను ఇస్తుంది. ఈ కమిటీ సభ్యులు కనీసం నెలకోసారి సమావేశం కావాలి. కొత్త కార్యక్రమాల నిర్వహణ, గత తీర్మానాలు ఏ మేరకు అమలు చేశామని నిరంతం పరిశీలించాలి. అటు ఉన్నతాధికారులతో, ఇటు ప్రజలతో సత్సంబంధాలు ఏర్పర్చుకుని క్రియాశీలకంగా వ్యవహరించాలి. ఈ కమిటీలు చిత్తశుద్ధితో పనిచేస్తే గ్రామస్వరాజ్యం వెల్లివిరిస్తుంది. కానీ వాస్తవ పరిస్థితి చూస్తే పూర్తి భిన్నంగా ఉంది. సమావేశాలు తప్ప అమలు లేకపోవడంతో కమిటీల్లోని సభ్యుల్లో ఆసక్తి లేకుండా పోతోంది. ఎక్కడా గ్రామజ్యోతి సమావేశాలు జరగడంలేదు. గ్రామజ్యోతి కమిటీ సమావేశాలపై అధికారులెవరూ సమీక్షించడంలేదు. నిధులు లేవు కమిటీల తీర్మానాల మేరకు ప్రాధాన్యాంశాలను ఎప్పటికప్పుడు పంపిస్తున్నారు. కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రావడం లేదు. మొదటి సమావేశంలో చేసిన తీర్మానాల పనులే ఇప్పటివరకు పూర్తి కాలేదు. తీర్మానాలు చేయడమే తప్ప పనులు జరగడం లేదు. గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేయడంలేదు. కమిటీలు నామమాత్రంగానే ఉన్నాయి. - సర్పంచ్ బడ్జెట్లోనే పంచాయతీలకు నిధులు కమిటీలు తీర్మానించిన పనులకు ప్రభుత్వం కేటాయించే నిధులే ఖర్చు చేయాల్సి ఉంటుంది. గ్రామజ్యోతి పథకానికి సంబంధించి ప్రత్యేకంగా నిధులు ఏమీ ఉండవు. 14వ ఫైనాన్స్ నిధులు పంచాయతీలకు కేటాయించారు. సర్పంచ్‌లు ప్రతి నెలా గ్రామాల్లో కమిటీ సమావేశాలు నిర్వహించాలి. సమావేశాలు చాలా చోట్ల నిర్వహించడంలేదని తెలుస్తోంది. గ్రామ పంచాయతీలకి నిధుల కొరత లేదు. - సురేష్‌బాబు, జిల్లా పంచాయతీ అధికారి -
గ్రామాలు.. మురికి కూపాలు
చిన్న ముల్కనూరు గ్రామజ్యోతిలో సీఎం కేసీఆర్ * ఈ పరిస్థితికి ప్రజాప్రతినిధులు, పంచాయతీ అధికారులు సమాన బాధ్యులు * ఇకనైనా వైరుధ్యాలు, తగాదాలను వదిలి ముందుకు సాగాలి * మంత్రులు, అధికారులు ‘గ్రామజ్యోతి’ ఆరకుండా చూడాలి * గ్రామల్లో మార్పునకే ఎర్రవెల్లి, చిన్న ముల్కనూరును దత్తత తీసుకున్నా * రెండేళ్లలో ముల్కనూరును ఆదర్శ గ్రామంగా చేస్తా * రోజంతా గ్రామంలోనే గడిపి ఊరువాడా కలియ తిరిగిన ముఖ్యమంత్రి సాక్షి ప్రతినిధి, కరీంనగర్: రాష్ట్రంలో గ్రామాలన్నీ మురికి కూపాలుగా మారాయని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. ఈ పరిస్థితికి ప్రజాప్రతినిధులు, పంచాయతీరాజ్ శాఖ అధికారులంతా సమాన బాధ్యులేనన్నారు. ఇకపై వైరుధ్యాలు, తగాదాలు, పిచ్చి ఆలోచనలను వదిలేసి గ్రామాల అభివృద్ధికి పాటుపడాలని కోరారు. సోమవారం కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలో తాను దత్తత తీసుకున్న చిన్న ముల్కనూరు గ్రామానికి సీఎం వచ్చారు. ఉదయం 11 గంటలకు వచ్చిన సీఎం రాత్రి 8 గంటల వరకు అక్కడే గడిపారు. ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్, కరీంనగర్ ఎంపీ వినోద్‌కుమార్, హుస్నాబాద్ ఎమ్మెల్యే వి.సతీష్‌కుమార్, కలెక్టర్ నీతూ ప్రసాద్ సహా నాయకులు, అధికార యంత్రాంగంతో కలిసి వాడవాడలా తిరిగారు. గ్రామస్తులతో మాట్లాడారు. గ్రామానికి చెందిన ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. గ్రామాభివృద్ధి కోసం చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. మధ్యాహ్నం గ్రామస్తులందరితో కలిసి సహపంక్తి భోజనం చేశారు. సాయంత్రం గ్రామజ్యోతి కార్యక్రమం నిర్వహించి ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ‘‘గత 70 ఏళ్లుగా గ్రామాలన్నీ మురికి కూపాలుగా మారాయి. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, జడ్పీ చైర్మన్, కలెక్టర్, ఎమ్మెల్యే, మంత్రి సహా ప్రజాప్రతినిధులు, పంచాయతీరాజ్ అధికారులంతా ఇందుకు సమాన బాధ్యులే. ఈ పరిస్థితిని అధిగమించేందుకు సమగ్రాభివృద్ధికి గ్రామసభల్లో ప్రణాళికలు రూపొందించడమే కాకుండా కార్యాచరణ చేపట్టాలి. ఈ విషయంలో వైరుధ్యాలు, తగాదాలు, పిచ్చి ఆలోచనలను వదిలేసి కలిసికట్టుగా ముందుకు సాగాలి’’ అని సూచిం చారు. గ్రామాల్లో మార్పు చూపించాలనే ఉద్దేశంతోనే తాను చిన్న ముల్కనూర్, ఎర్రవెల్లి గ్రామాలను దత్తత తీసుకున్నానని చెప్పారు. రాష్ర్టంలోని గ్రామాలన్నీ మనవేనని, ఆయా గ్రామాల్లో ‘గ్రామజ్యోతి’ ఆరిపోకుండా కొనసాగించాల్సిన బాధ్యత మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, అధికారులదేనని స్పష్టం చేశారు. ముఠా తగాదాలు, పెత్తనం పంచాయతీలను బంద్ చేసి గ్రామజ్యోతిని నిరంతరం వెలిగేలా చూడాలని చెప్పారు. రెండేళ్లలో ఆదర్శ గ్రామం చేస్తా రెండేళ్లలో చిన్న ముల్కనూరును ఆదర్శంగా తీర్చిదిద్దుతానని, ప్రపం చ దేశాలన్నీ చిన్న ముల్కనూరును సందర్శిం చేలా చేస్తానని సీఎం చెప్పారు. ‘‘వరంగల్ జిల్లాలో గంగదేవిపల్లె ఆదర్శ గ్రామం కావడానికి అక్కడి ప్రజలు 22 ఏళ్లు కష్టపడ్డారు. 77 దేశాల ప్రతినిధులు గంగదేవిపల్లెను సందర్శించారు. ఆనాడు గంగదేవిపల్లెకు ప్రభుత్వం నుంచి పెద్దగా సాయం లేదు. కానీ చిన్న ముల్కనూరుకు నాతో సహా మంత్రులు, కలెక్టర్, అధికార యంత్రాంగం అంతా ఉంది. ఎంత డబ్బు అయినా ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అన్ని పనులూ రెండేళ్లలోనే పూర్తి కావాలి. రాబోయే రెండేళ్లలోనే ముల్కనూరు మారాలి. గంగదేవిపల్లె మాదిరిగా ప్రపంచ దేశాలన్నీ చిన్న మూల్కనూరు సందర్శించాలె’’ అని అన్నారు. తిడితే రూ.50 జరిమానా వేయండి చిన్న ముల్కనూర్ ప్రజలు తిట్లు బంద్ చేసి ప్రేమాభిమానాలతో కలిసి మెలసి ఉం డాలని సీఎం కోరా రు. ఇకపై ఎవరైనా తిడితే రూ.50 జరిమానా వేయాలన్నారు. గ్రామంలో ఏ ఆధారం లేని వారిని అందరూ ఆదుకోవాలని సూచిం చారు. ఇందుకు తన వద్ద బృహత్తర ప్రణాళిక ఉందన్నారు. ఊరి ప్రజలను త్వరలోనే అంకాపూర్‌కు తీసుకె ళ్లాలని కలెక్టర్ నీతూప్రసాద్‌ను ఆదేశించారు. ఇళ్లు లేని వారందరికీ డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టిస్తానని, జాగా లేని వారికి ప్రభుత్వమే స్థలం కొని ఇళ్లు కట్టిస్తుందని హామీ ఇచ్చారు. ఇందుకు స్థలం అమ్మడానికి ఎవరైనా ముందుకొస్తే ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని చెప్పారు. వారం రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయాలని, మళ్లీ 10, 15 రోజుల్లో చిన్న ముల్కనూర్ వచ్చి డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తానన్నారు. యుద్ధప్రాతిపదికన ఇళ్ల నిర్మాణం చేపట్టి ఐదు నెలల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామాభివృద్ధికి పలువురు ప్రభుత్వ ఉద్యోగులు, మాజీ సైనికోద్యోగులు, పలువురు దాతలు ముందుకొచ్చారు. గ్రామానికి చెందిన 40 మంది ప్రభుత్వ ఉద్యోగులు రూ.2 లక్షల విరాళం సీఎం సమక్షంలో కలెక్టర్‌కు అందజేశారు. మరికొందరు తమ ఇళ్ల స్థలాలను ప్రభుత్వానికి అప్పగించారు. అందరం కలిసి జిద్దుతో పనిచేస్తే ఐదారు నెలల్లో చిన్న ముల్కనూరును స్వర్గసీమను చేయవచ్చని సీఎం పేర్కొన్నారు. 33 ఏళ్లుగా మద్యం అమ్మకాల్లేవ్ గంగదేవిపల్లె మాజీ సర్పంచ్ రాజమౌళిని ముఖ్యమంత్రి కే సీఆర్ సోమవారం చిన్న ముల్కనూర్‌కు తీసుకొచ్చారు. గంగదేవిపల్లెను గ్రామస్తులంతా కలిసి ఎట్లా ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దారనే అంశంపై రాజమౌళితో మాట్లాడించారు. రాజమౌళి మాట్లాడుతూ.. ‘‘1982 నుండి ఇప్పటి వరకు గంగదేవిపల్లెలో మద్యం తయారీ, అమ్మకాల్లేకుండా చేశాం. తొలుత మద్యం వల్ల కలిగే నష్టాలను ప్రజలకు వివరించాం. వారందరినీ ఒప్పించి మద్యం వద్దు అనేలా చేశాం. 1991లో తాగునీటి కొరత ఏర్పడితే బాలవికాస సంస్థ సహకారంతో ట్యాంక్ నిర్మించి ఇంటింటికీ నీళ్లు అందించాం. నాటి నుంచి నేటి వరకు ప్రతిరోజు ఉదయం, సాయంత్రం నీటిని సరఫరా చేస్తున్నాం. 2000 సంవత్సరం నాటికే 100 శాతం మరుగుదొడ్లు నిర్మించాం. 3 నెలల్లోనే 100 శాతం మరుగుదొడ్లు నిర్మించినప్పటికీ వాటిని గ్రామస్తులు వినియోగించేలా చేయడానికి మాత్రం మూడేళ్లు పట్టింది. 2007లో గంగదేవిపల్లెకు రాష్ట్రపతి అవార్డు లభించింది’’ అని వివరించారు. కరీంనగర్‌లోనే రాత్రి బస చిన్న ముల్కనూరులో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉన్న సీఎం రాత్రి 8 గంటలకు కరీంనగర్ చేరుకున్నారు. తీగలగుట్టపల్లిలోని ఉత్తర తెలంగాణ భవన్లో మంత్రి ఈటల రాజేందర్, ఎంపీ వినోద్‌కుమార్ సహా జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులతో ముచ్చటించారు. రాత్రి ఉత్తర తెలంగాణ భవన్‌లోనే బస చేశారు. -
'ఊర్లో తిట్లు బంద్ కావాలె'
కరీంనగర్: కరీంనగర్ జిల్లా చిన్నముల్కనూరు గ్రామంలో సీఎం కేసీఆర్ గ్రామజ్యోతి కార్యక్రమాన్ని నిర్వహించారు. భూములిచ్చేవారు ముందుకొస్తే నాలుగునెలల్లో ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. అతి త్వరలో డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటానన్నారు. 10 రోజుల్లో నేనే వచ్చి ఇళ్ల నిర్మాణానికి కొబ్బరికాయకొడుతా అని చెప్పారు. ఆరు నెలల్లో ప్రతి ఇంటికి నల్లా నీళ్లు వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. గ్రామానికి డాక్టర్లను తీసుకు వచ్చి హెల్త్ చెకప్ చేపిస్తామన్నారు. అంకాపూర్ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొని దోమలు లేని గ్రామంగా చేసుకోవాలని సూచించారు. చిన్న ముల్కనూరు గ్రామంలో ప్రతి ఇంట్లో తిట్లు బంద్ కావాలె అని అన్నారు. ప్రతి ఇంటికి ఉపయోగ పడే చెట్లు పెంచాలన్నారు. గ్రామమంటే అందరూ సంతోషంగా బతకాలి. ఊరి వాతావరణం శుభ్రంగా ఉంచుకోవాలి..భూములు లేనివారికి గ్రామస్తులందరూ కలిసి పనిని కల్పించాలని సూచించారు. -
ప్రతిభ ఆధారంగానే నియామకాలు: ఈటల
కరీంనగర్: తెలంగాణలో ఉద్యోగాల నియామకం నిరంతర ప్రక్రియ అని.. ప్రతిభ ఆధారంగానే నియామకం ఉంటుందని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఆదివారం ఆయన కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలో జరిగిన గ్రామజ్యోతి కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం మీడియాతో మాట్లాడారు. నిరుద్యోగులు బ్రోకర్లను ఆశ్రయించి మోసపోవద్దని సూచించారు. ఎవరు ఎలా విమర్శించినా ప్రజల ఎజెండాగానే ముందుకెళ్తామని చెప్పారు. పోటీ పరీక్షలపై మీడియా చెప్పిన వాస్తవాలకు స్పందిస్తామని తెలిపారు. రూమర్స్‌తో నిరుద్యోగులు అయోమయానికి గురికావద్దన్నారు. అదే విధంగా.. ప్రతి ఒక్కరు 'గ్రామజ్యోతి' కార్యక్రమంలో పాల్గొని అభివృద్ధి పనుల్లో భాగస్వాములు కావాలని మంత్రి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. హరిత తెలంగాణ నిర్మించుకోవడానికి అందరు మొక్కలు నాటాలని మంత్రి సూచించారు. -
‘దత్తత’లో... పెత్తందారీ!
అధికార పార్టీ నేతలకు పెద్ద చిక్కే వచ్చిపడింది. గ్రామజ్యోతి కార్యక్రమం పుణ్యమాని వారంతా వారం రోజులుగా ఊళ్లు పట్టుకుని తిరుగుతున్నారు. ప్రతీ ఎమ్మెల్యే నియోజకవర్గంలో మండలానికో గ్రామాన్ని, ఎమ్మెల్సీ అయితే నియోజకవర్గానికి ఓ గ్రామాన్ని దత్తత తీసుకోవాలని గులాబీ దళపతి హుకుం జారీ చేశారు. ఒకే నియోజకవర్గంలో ఎమ్మెల్యేతో పాటు, ఎమ్మెల్సీ కూడా ఉన్న చోటే చిక్కంతా వచ్చి పడింది. దక్షిణ తెలంగాణలోని ఓ జిల్లాలో ఇప్పుడిది హాట్ టాపిక్. కన్నతల్లిని, సొంతూరిని మరవకూడదన్న వాక్కును తు.చ. పాటించాలని ఓ ఎమ్మెల్సీ భావించారు. తన సొంతూరిని దత్తత తీసుకుందామని నిర్ణయించుకున్నారు. కానీ, ఇదే నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే దీనికి మోకాలడ్డారు. తానే ఆ గ్రామాన్ని దత్తత తీసుకుంటానని పేచీ పెట్టారు. చివరకు సొంతూళ్లో కూడా ఆ ఎమ్మెల్సీకి పేరు రావద్దన్నది ఆ ఎమ్మెల్యే వ్యూహం అని గులాబీ శ్రేణులు చెవులు కొరుక్కుంటున్నాయి. ఆదివారంతో గ్రామజ్యోతి వారోత్సవాలు ముగుస్తున్నాయి. ఇప్పటికీ ఆ గ్రామ దత్తత విషయం తేలలేదు. చివరకు తన ఊళ్లో ఏ పనీ జరగొద్దనే ఎమ్మెల్యే కిరికిరి పెడుతున్నాడని సదరు ఎమ్మెల్సీ సన్నిహితుల వద్ద వాపోతున్నారు. ఇది ఫక్తు రాజకీయ వ్యవహారమే.. ఆధిపత్య పోరులో భాగమే అంటున్నారు మరికొందరు ...!! -
‘గ్రామజ్యోతి’లో ఎంపీటీసీలకు స్థానం కల్పించాలి
తెలంగాణ రాష్ట్ర ఎంపీటీసీల ఫోరం హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం చేపట్టిన గ్రామజ్యోతిలో ఎంపీటీసీలకు భాగస్వామ్యం కల్పించడంతో పాటు విధులు, నిధులు కేటాయించాలని తెలంగాణ రాష్ట్ర ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. గ్రామజ్యోతిలో ఎంపీటీసీలకు భాగస్వామ్యం కల్పించనందుకు నిరసనగా ఫోరం ఆధ్వర్యంలో శనివారం ఇందిరాపార్కు వద్ద ఎంపీటీసీలు నిరశన దీక్ష నిర్వహించారు. దీక్షల్లో ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు బోళ్ల కరుణాకర్, ప్రధానకార్యదర్శి అన్నారపు యాకయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం మల్లేశం, పి. గోవర్ధన్‌రావు, జి. పార్వతమ్మ, కోశాధికారి మహబూబ్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి తదితరులు కూర్చున్నారు. ఈ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి మాట్లాడుతూ నామినేట్ అయిన వారికి కేబినెట్లో అవకాశం కల్పించిన సీఎం.. ప్రజల ఓట్లతో గెల్చిన ఎంపీటీసీలకు గ్రామజ్యోతిలో భాగస్వామ్యం కల్పించకపోవడం శోచనీయమన్నారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ గ్రామాల అబివృద్ధి కోసం పనిచేసే ఎంపీటీసీలకు గ్రామజ్యోతిలో భాగస్వామ్యం కల్పించకపోవడం శోచనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, టీడీపీ శాసనసభాపక్షనేత ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జాజుల శ్రీనివాస్‌గౌడ్, నాయకుడు గుజ్జకృష్ణ, టీడీపీ ఎమ్మెల్యే వివేకానంద, మాజీమంత్రి రాములు, తెలంగాణ రాష్ట్ర ఎంపీటీసీల ఫోరం నాయకులు యాదగిరి, రియాజ్, పురుషోత్తంరెడ్డి, సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఇందిరాపార్క్ వద్ద ఎంపీటీసీల దీక్ష
హైదరాబాద్: ఎంపీటీసీల భాగస్వామ్యంతో బంగారు తెలంగాణకు బాటలు వేయాలని ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ప్రభుత్వానికి సూచించారు. గ్రామజ్యోతి కార్యక్రమానికి తమను దూరం చేయటాన్ని నిరసిస్తూ శనివారం ఇందిరాపార్క్ వద్ద ఎంపీటీసీలు నిర్వహించారు. ఈ దీక్షా శిబిరంలో ఎమ్మెల్యే పాల్గొని వారికి మద్దతు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ గ్రామజ్యోతి కార్యక్రమానికి ఎంపీటీసీలను ఆహ్వానించకపోవటం తగదన్నారు దీక్షల్లో వివిధ జిల్లాల నుంచి దాదాపు 500 మంది ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు. -
రండి.. దరిద్రంపై యుద్ధం చేద్దాం!
ఎర్రవల్లి గ్రామసభలో సీఎం కేసీఆర్ గజ్వేల్: ‘‘నిన్న ఒక ఆలోచన వచ్చింది. ఒక దారిలో వెళ్దామనుకున్నాం. గ్రామాన్ని మొత్తం పరిశుభ్రం చేసే పని మొదలుపెట్టాం. మంచి పనికి భగవంతుని ఆశీస్సులు ఉంటాయి. ఇది ఇంతటితో ఆగిపోదు. ఇంకా ముందుకెళ్దాం. నా వెంట రండి. ఇక దరిద్రం మీద యుద్ధం చేద్దాం. మీ వెంట నేనుంటా. ఎందుకు పైకిరారో చూస్తా..’’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. శుక్రవారం మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మండలం ఎర్రవల్లిలో రెండోరోజు నిర్వహించిన ‘గ్రామజ్యోతి’ సభలో ఆయన గ్రామస్తులను ఉద్దేశించి మాట్లాడారు. సీఎం పిలుపునందుకొన్న గ్రామస్తులు ప్రతి ఇంటి నుంచి తట్టా, పార చేతపట్టుకొని ఉదయం నుంచే పెద్ద ఎత్తున తరలివచ్చారు. గ్రామాన్ని నాలుగు భాగాలుగా విభజించుకొని శ్రమదానం పనుల్లో నిమగ్నమయ్యారు. అధికారులు సైతం ఈ పనుల్లో భాగస్వాములయ్యారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు సీఎం స్వయంగా పనులను పర్యవేక్షించారు. అనంతరం గ్రామసభలో మాట్లాడుతూ... ‘‘నిన్న ఇక్కడ జరిగిన సభ, నా మాటలు టీవీలు, పత్రికల ద్వారా తెలుసుకున్న ఈ ఊరికి చెందిన దాతలు హైదరాబాద్, ఇతర ప్రాంతాల నుంచి వచ్చారు. గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి అంగీకరించారు. ఎర్రవల్లిలో ఇల్లు లేని కుటుంబం ఉండొద్దు. ఇప్పటి దాకా ముక్కిపోయి, మురిగిపోయిన ఇళ్లలో కాలం గడిపాం. ఇకపై అలా ఉండొద్దు.. అయిదారు నెలల్లో అందరికీ డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టిస్తా’’ అని సీఎం హామీ ఇచ్చారు. చౌరస్తాలను సిటీలో మాదిరి అందంగా తీర్చిదిద్దుకుందామని పేర్కొన్నారు. ‘ఒక్క దెబ్బకు ఊరంతా సైరకు రావాలె... దయ్యం వదలాలె’ అంటూ గ్రామస్తులను ఉత్సాహపరిచారు. ఇక్కడితో మన ప్రయత్నాలు, పనులు ఆగిపోవన్నారు. ఒకరోజు కంటివైద్య శిబిరం నిర్వహించి అందరికీ పరీక్షలు చేయిద్దామని, మరో రోజు సాధారణ వైద్య శిబిరాన్ని నిర్వహించి వైద్య పరీక్షలు చేయిద్దామని చెప్పారు. ఎర్రవల్లిని చూసి అంతా ఆశ్చర్యపోవాలి ‘‘ఇప్పుడు మనం పని మొదలుపెట్టాం. ఎర్రవల్లి ఎంత అందంగా మారిపోయిందని అంద రూ ఆశ్చర్యపోవాలి. అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలి. జిల్లాకో ఊరును ఇలా తయారు చేస్తే వెలుగొస్తుంది. ఊరిలో ఇవ్వాల్టి నుంచి మోటు మాటలు బంద్ చేయండి. మాట్లాడితే రూ.50 జరిమానా ప్రకటించండి. అప్పుడు అందరూ సక్కగ మాట్లాడుతరు. గ్రామ కమిటీలో ఈ నిర్ణయం తీసుకోండి’’ అని సీఎం సూచించా రు. ఈ సందర్భంగా అక్కడే ఉన్న ఎంపీ ప్రభాకర్‌రెడ్డిని ఉద్దేశించి ‘‘ఏమయ్యా.. ఎంపీ గారు మా ఊరికి ఎన్ని డబ్బులిస్తరు?’’ అని ప్రశ్నించారు. ఎంపీ లేచి ‘రూ. 50 లక్షలు ఇస్తాను సార్’ అని ప్రకటించారు. ఆపై కలెక్టర్ రోనాల్డ్ రాస్‌ను ఉద్దేశించి ‘కలెక్టర్ గారూ.. మీరెంత ఇస్తరు?’ అని సీఎం అడిగారు. ఆయన రూ.25 లక్షలు కేటాయిస్తాం సార్ అని బదులిచ్చారు. దీంతో సీఎం గ్రామస్తుల వైపు చూస్తూ.. ‘‘ఇగ జూసిన్రా.. మీరు నా ఎంబడి ఉంటే ఇంకా షాన డబ్బులు తెస్త..’ అని వ్యాఖ్యానించారు. ఆదర్శ గ్రామాల్లో ఒక్కో దగ్గర ఒక్కో నియమం ఉంటుందని, కొన్ని గ్రామాల్లో మందు తాగుడు బంద్ చేశారని, ఇంకొన్ని గ్రామాల్లో మందు తాగితే జరిమానా విధిస్తున్నారని, అలాగే మీరు కూడా ఏం చేస్తే బాగుంటుందో ఆలోచించాలని గ్రామస్థులకు సూచించారు. తాను మళ్లీ వస్తానని, అప్పుడు గ్రామ ఎజెండా తయారు చేద్దామంటూ ప్రసంగాన్ని ముగించారు. అనంతరం గ్రామస్థులతో కలసి సహపంక్తి భోజనం చేశారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ వెంకట్రాంరెడ్డి, ‘గడా’ ఓఎస్డీ హన్మంతరావు, సిద్దిపేట ఆర్డీఓ ముత్యంరెడ్డి, గ్రామ సర్పంచ్ భాగ్యబాల్‌రాజు, ఎంపీటీసీ భాగ్యమ్మ తదితరులు పాల్గొన్నారు. -
'60 ఏళ్ల దరిద్రం ఒక్కసారి పొమ్మంటే పోదు'
నిజామాబాద్ : 60 ఏళ్ల దరిద్రం ఒక్కసారి పొమ్మంటే పోయేది కాదని రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖల మంత్రి కె.తారక రామారావు అన్నారు. నిజామాబాద్ జిల్లాలో గురువారం నాడు ఆయన పర్యటిస్తున్నారు. జిల్లాలోని పిట్లం మండలం కుర్తి గ్రామంలో గ్రామజ్యోతి సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వాల పాలకులపై విమర్శలు గుప్పించారు. గత పాలకులు చేసిన పాపాలు మేం కడుగుతున్నామంటూ ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఫౌండేషన్ ద్వారా కుర్తి గ్రామానికి వాటర్ ప్లాంట్ మంజూరు చేశారు. -
అధికారులపై కేసీఆర్ ఆగ్రహం..
మెదక్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం మెదక్ జిల్లా ఎరవెల్లిలో జరిగిన 'గ్రామ జ్యోతి' కార్యక్రమానికి సీఎం కేసీఆర్ హాజరయ్యారు. ఆ కార్యక్రమంలో పార్టీ జెండాలు కనిపించాయి. దీంతో అధికారిక కార్యక్రమాల్లో పార్టీ జెండాలు ఎందుకు పెడుతున్నారంటూ కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక నుంచి ఏ అధికారిక కార్యక్రమాల్లో కూడా పార్టీ జెండాలు పెట్టవద్దని అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు పంపారు. -
తెలంగాణలో గ్రామాన్ని దత్తత తీసుకున్న మహేష్ బాబు
హైదరాబాద్: సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ 'శ్రీమంతుడు' గా నిరూపించుకున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఇప్పటికే సొంత ఊరు బుర్రిపాలెం దత్తత తీసుకున్న మహేష్, మరో గ్రామాన్ని కూడా దత్తత తీసుకోవడానికి ముందుకు వచ్చాడు. తెలంగాణ మంత్రి కే తారకరామారావు సలహా మేరకు 'గ్రామజ్యోతి' పథకంలో భాగంగా మహబూబ్ నగర్ జిల్లాలోని మారుమూల వెనకబడిన గ్రామాన్ని మహేష్ దత్తత తీసుకోనున్నట్లు ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా తెలిపారు. గ్రామజ్యోతి కార్యక్రమం కింద... ఓ గ్రామాన్ని దత్తత తీసుకోవాలని మంత్రి కేటీఆర్ తనను కోరారని మహేష్ ట్విట్టర్లో పేర్కొన్నారు. అందుకే కరువు, వలసల బారిన పడిన మహబూబ్‌నగర్ జిల్లాలోని గ్రామాన్ని దత్తత తీసుకుంటాని తెలిపారు. దత్తత తీసుకునే గ్రామం వివరాలను త్వరలో వెల్లడిస్తానన్నారు మహేష్. ఇందుకు కేటీఆర్ స్పందిస్తూ.. 'మీ నిర్ణయం వ్యక్తిగత సామాజిక బాధ్యత విషయంలో చాలా మందికి స్పూర్తిదాయకం' అని కొనియాడారు. @urstrulyMahesh Thanks Mahesh. May your decision inspire many more people towards Individual Social Responsibility.Let's get this going soon — KTR (@KTRTRS) August 19, 2015 -
ఎర్రవెల్లిలో గ్రామజ్యోతి ప్రారంభించిన కేసీఆర్
మెదక్ : మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మండలం ఎర్రవెల్లిలో ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం గ్రామజ్యోతి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అలాగే తిగుల్, మునిగడప గ్రామాల్లో ఆయన పర్యటించనున్నట్లు సమాచారం. ఇవాళ మధ్యాహ్నం ఒంటిగంట మధ్యలో సీఎం ఎప్పుడైనా ఈ రెండు గ్రామాలకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా ఆదివారం వరకూ సీఎం కేసీఆర్ ఫాంహౌస్‌లో ఉంటారని సమాచారం. -
దత్తత గ్రామాల్లో నేతల పర్యటన
డిచ్పల్లి(నిజామాబాద్): గ్రామజ్యోతి కార్యక్రమంలో భాగంగా పలువురు ప్రముఖులు వారు దత్తత తీసుకున్న గ్రామాల్లో పర్యటించారు. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలంలోని పలు గ్రామాలను దత్తతు తీసుకున్న ప్రజా ప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారులు ఈ రోజు ఆయా గ్రామాల్లో పర్యటించి గ్రామజ్యోతి కార్యక్రమ అమలు తీరును పరిశీలించారు. మండలంలోని ఇందాల వాయి గ్రామాన్ని దత్తత తీసుకున్న ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ సందర్శించి పనులు పరిశీలించారు. గ్రామంలో రోడ్లను ఆక్రమించి కట్టిన అక్రమ కట్టడాలను ఆయన జేసీబీ సహాయంతో కూల్చివేశారు. తర్వాత పారిశుధ్య కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అలాగే ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్ దత్తత గ్రామం రాంపూర్‌లో జరిగిన గ్రామ జ్యోతి కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ జిల్లా చంద్రశేఖర్ రెడ్డి, మండలంలోని బరిదాపూర్ గ్రామాన్ని దత్తత తీసుకోవడంతో అక్కడి పనులను పర్యవేక్షించారు. -
త్వరలో ‘గ్రామజ్యోతి’కి ఫేస్బుక్ ఖాతా
ఫేస్బుక్ ‘బూస్ట్ యువర్ బిజినెస్’లో మంత్రి కేటీఆర్ దశలవారీగా అన్ని గ్రామాలకూ ఖాతాలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన గ్రామజ్యోతి కార్యక్రమానికి త్వరలోనే ఫేస్బుక్ అకౌంట్‌ను తెరవ బోతున్నట్లు పంచాయతీరాజ్, ఐటీశాఖ మంత్రి కె.తారకరామారావు చెప్పారు. సామాజిక మాధ్యమానికి పెరిగిన ప్రజాదరణను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని ఓ హోటల్లో ఫేస్బుక్ నిర్వహించిన ‘బూస్ట్ యువర్ బిజినెస్’ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి తోడ్పాటునందించాలనుకునే వారికి ఆయా గ్రామాల పరిస్థితులను తెలిపేందుకు ఫేస్బుక్ సాధనంగా ఉపకరిస్తుందన్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోని ప్రతి గ్రామానికీ ఫేస్బుక్ ఖాతాను తెరవాలనుకుంటున్నట్లు కేటీఆర్ వివరించారు. అక్టోబర్ 2న తొలి విడతగా 700 గ్రామాలకు, ఆ తర్వాత దశలవారీగా మిగిలిన గ్రామాలకూ ఫేస్బుక్ ఖాతా తెరుస్తామన్నారు. చిన్న, మధ్యతరహా, కుటీర పరిశ్రమల యజమానులు వ్యాపారాన్ని వృద్ధి చేసుకునేందుకు తోడ్పాటు అందిస్తూ మీడియా నిర్వచనాన్ని ఫేస్బుక్ మార్చేసిందన్నారు. దేశంలోనే అత్యధికంగా 2.75 లక్షల మంది నెటిజన్లు సీఎం కేసీఆర్ ఫేస్బుక్ ఖాతాను ఫాలో అవుతుండటం రికార్డు అని కేటీఆర్ చెప్పారు. ‘బూస్ట్ యువర్ బిజినెస్’ను ఫేస్బుక్ దేశంలో ప్రప్రథమంగా హైదరాబాద్‌లోనే ఆవిష్కరించడంపట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఫేస్బుక్ ద్వారా తన వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకున్న‘ పెళ్లి పూల జడ’ డెరైక్టర్ కల్పనను మంత్రి కే టీఆర్ అభినందించారు. చిన్నతరహా వ్యాపారులు ఫేస్బుక్ ద్వారా తమ బిజెనెస్‌ను మెరుగు పర్చుకునేందుకు తాము కల్పిస్తున్న అవకాశాలను ఫేస్బుక్ ఎకనామిక్స్ గ్రోత్ హెడ్ రితేశ్ మెహతా, సెంట్రల్ ఏషియా పబ్లిక్ పాలసీ విభాగాధిపతి అనిల్చిదాస్ వివరించారు. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ వినియోగిస్తున్న 300 కోట్ల మందిలో సగం మంది ఫేస్బుక్ ఖాతాను కలిగి ఉన్నారన్నారు. -
గంగదేవిపల్లికి రూ. 10 కోట్లు మంజూరు
వరంగల్: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు గ్రామజ్యోతి పథకాన్ని ప్రారంభించారు. సోమవారం మధ్యాహ్నం వరంగల్ జిల్లా గంగదేవిపల్లిలో జరిగిన సభలో కేసీఆర్ పాల్గొన్నారు. గంగదేవిపల్లిలో గ్రామజ్యోతి పథకాన్ని ఆరంభించిన కేసీఆర్.. సభలో మాట్లాడారు. గంగదేవిపల్లి అభివృద్ధికి కేసీఆర్ 10 కోట్ల రూపాయలను మంజూరు చేశారు. ఈ నిధులను వెంటనే విడుదల చేయనున్నట్టు కేసీఆర్ ప్రకటించారు. గ్రామస్తులందరూ కలసి చర్చించుకుని గామాభివృద్ధికి ఏయే పనులు చేపట్టాలి అన్నది నిర్ణయించుకోవాలని సూచించారు. గంగదేవిపల్లి దేశంలోనే గొప్ప ఆదర్శ గ్రామం కావాలని కేసీఆర్ ఆకాంక్షించారు. అంతకుముందు కేసీఆర్ గ్రామంలో కలియదిరిగి గ్రామస్తులతో మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గంగదేవిపల్లి సభలో కేసీఆర్ తనదైన శైలిలో ప్రసంగించారు. పూలు వాడిపోరాదనే ఉద్దేశంతో వాటిపై నీళ్లు చల్లుతారని, ఈ పూలదండలు వేసినపుడు తన చొక్కా తడిసిపోతుందని కేసీఆర్ అన్నారు. అందుకే తాను పూలదండలు వేయించుకోనని చెప్పారు. -
ఇమాంపేటలో గ్రామజ్యోతి బహిష్కరణ
సూర్యాపేట : సర్పంచ్ అందుబాటులో ఉండడం లేదని ఆరోపిస్తూ నల్గొండ జిల్లా సూర్యాపేట మండలం ఇమాంపేట గ్రామస్తులు సోమవారం గ్రామజ్యోతి కార్యక్రమాన్ని బహిష్కరించారు. గ్రామజ్యోతి కార్యక్రమాన్ని అమలు చేసేందుకు సోమవారం ఉదయం అధికారులు గ్రామానికి వెళ్లారు. కాగా వార్డు సభ్యులు, ప్రజలందరూ సంతకాలు చేసి తాము గ్రామజ్యోతి కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్లు అధికారులకు వినతిపత్రం ఇచ్చారు. తమ సర్పంచ్ రవినాయక్ గ్రామంలో ఉండటం లేదని, ఫలితంగా గ్రామం ఎలాంటి అభివృద్ధికి నోచుకోవడంలేదని, గ్రామ సమస్యలు పరిష్కారం కావడంలేదని వారు పేర్కొన్నారు. -
'గ్రామజ్యోతి'ని బహిష్కరించిన ఎంపీటీసీలు
మక్తల్ (మహబూబ్‌నగర్ జిల్లా): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'గ్రామజ్యోతి' పథకంలో తమకు ప్రాధాన్యం లేదని ఆగ్రహించిన ఎంపీటీసీలు ఆ కార్యక్రమాన్ని బహిష్కరించారు. అంతటితో ఆగకుండా అధికారులను కార్యాలయంలో పెట్టి తాళంవేసి నిరసన తెలిపారు. ఈ సంఘటన సోమవారం ఉదయం మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్‌లో జరిగింది. వివరాలు.. తెలంగాణ సర్కార్ సోమవారం నుంచి గ్రామ గ్రామాన గ్రామజ్యోతి కార్యక్రమాన్ని ప్రారంభించింది. అధికారులు పల్లెలకు వెళ్లి గ్రామజ్యోతి కార్యక్రమాన్ని ప్రారంభించాల్సి ఉంది. అయితే ఆ కార్యక్రమంలో తమకు స్థానం లేకుండా చేశారని, కనీస గౌరవం కూడా ఇవ్వలేదని ఆగ్రహించిన 21మంది ఎంపీటీసీలు.. మక్తల్ ఎంపీడీవో కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. వీరికి ఎంపీటీసీలు శ్రీహరి, పద్మమ్మ, వెంకటరాములు, శ్రీరాములు, లింగప్ప నాయకత్వం వహించారు. గ్రామాలకు బయలుదేరుతున్న అధికారులను కార్యాలయంలో ఉంచి తాళం వేశారు. బందీ అయిన వారిలో ఎంపీడీవో జయశంకర్ ప్రసాద్, ఏఓ సుబ్బారెడ్డి, ఎంఈవో లక్ష్మీనారాయణ, డిప్యూటీ తహశీల్దార్ లక్ష్మీపతి ఆచారి, వీఆర్వోలు, కార్యదర్శులు ఉన్నారు. విషయం తెలుసుకున్న మక్తల్ ఎస్ఐ మురళీగౌడ్ ఎంపీడీవో కార్యాలయం వద్దకు వెళ్లి ధర్నా చేస్తున్న ఎంపీటీసీలతో చర్చించారు. వారికి నచ్చజెప్పి ధర్నాను విరమింపజేశారు. అనంతరం కార్యాలయ తాళం తెరిచారు. తమను గదిలో వేసి నిర్బంధించడం అవమానంగా భావించిన అధికారులు బయటికి రాకుండా సమావేశమై చర్చించుకుంటున్నారు. -
గ్రామజ్యోతి మార్గదర్శకాలు విడుదల
-
'గ్రామజ్యోతి పథకాన్ని స్వాగతిస్తున్నాం'
కరీంనగర్: తోటపల్లి రిజర్వాయర్‌పై ప్రభుత్వం వెంటనే అఖిలపక్షం ఏర్పాటు చేయాలని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వానికి సూచించారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'గ్రామజ్యోతి' పథకాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. తోటపల్లి రిజర్వాయర్ నిర్మించాలన్నదే బీజేపీ డిమాండ్ అని అన్నారు. మహిళా సంఘాలతో చర్చించిన తర్వతనే ప్రభుత్వం రాష్ట్రంలో మద్యం పాలసీపై నిర్ణయం తీసుకోవాలని కిషన్ రెడ్డి ఈ సందర్భంగా ప్రభుత్వానికి సూచించారు. -
'పల్లె పల్లెనా గ్రామజ్యోతి'
హైదరాబాద్: పంచాయతీరాజ్ ఉద్యమ స్ఫూర్తిని మళ్లీ గ్రామ స్థాయిలో తీసుకు రావాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. ప్రజలను పెద్ద ఎత్తున భాగస్వాములను చేసి గ్రామాల అభివృద్ధి సాధించాలన్నారు. ప్రజల భాగస్వామ్యంతో నిర్వహించిన మిషన్ కాకతీయ చాలా గొప్పగా జరిగింది. అదే స్ఫూర్తితో ‘గ్రామజ్యోతి’ కార్యక్రమం నిర్వహించాలి.’ అని ముఖ్యమంత్రి తన ఆకాంక్షను వ్యక్తపరిచారు. గురువారం ఎంసీహెచ్ఆర్డీలో ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన జిల్లా కలెక్టర్లు, ఎస్పీల సదస్సులో సీఎం మాట్లాడారు. గ్రామజ్యోతి ప్రజలదే ‘గ్రామ జ్యోతి అంటే గ్రామాలకు నిధులు కేటాయించడమే కాదు. ప్రతి పౌరుణ్ని చైతన్యపరిచి అభివృద్ధిలో భాగస్వాములను చేయాలి. ఎవరి ఇంటికోసం వాళ్లు ప్రణాళిక చేసుకున్నట్లుగా.. ఎవరి ఊరికి వారు ప్లాన్ చేసుకోవాలి. మొదటి దశలో ప్రజలంతా కలిసి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు కృషి చేయాలి. తమ గ్రామానికి ఏ సదుపాయం అత్యవసరమో ప్రజలే నిర్ణయించాలి.గ్రామ సభలు నిర్వహించి కార్యక్రమాలు రూపొందించాలి. చెత్త లేకుండా చేయడం.. ముళ్ల పొదలు తొలగించడం, రహదారులపై గుంతలు పూడ్చివేయటం, మంచినీటి ట్యాంకులు శుభ్రం చేయడం, పాత బావులు పూడ్చటం, చిన్నపాటి శ్రమదానంతో చేయాల్సిన పనులు ముందుగా చేపట్టాలి. అధికారులకు గ్రామాల దత్తత ‘ప్రతి ముఖ్యమైన అధికారి ఒక గ్రామాన్ని దత్తత తీసుకోవాలి. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఒక్కో గ్రామం తీసుకోవాలి. మండలానికో అధికారి ఇన్ఛార్జిగా ఈ కార్యక్రమాలు సమన్వయం చేయాలి. ఇన్‌ఛార్జి అధ్వర్యంలోనే గ్రామసభ నిర్వహించాలి. ఎంపీల్యాడ్స్, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల నిధులు, జిల్లా పరిషత్, మండల పరిషత్, గ్రామ పంచాయతీల నిధులు.. ఇవన్నీ వచ్చినా గ్రామాల్లో చిన్న పనులు కూడా జరగడం లేదు. పన్నులే కాదు.. ఆదాయం సంపాదించాలి ‘గ్రామ పంచాయతీలు పన్నులు వసూలు చేయడమే కాకుండా ఇతర ఆదాయం వనరులపై కూడా దృష్టి కేంద్రీకరించాలి. విలువైన భూములు వినియోగించడం ద్వారా, షాపింగ్ కాంప్లెక్స్‌లు నిర్మించడం ద్వారా, ప్రభుత్వ స్థలాల్లో అడ్వర్టైజ్మెంట్ల ద్వారా.. ఇతర మార్గాలు అన్వేషించుకోవాలి..’ అని మంత్రి కేటీఆర్ సదస్సులో తన ప్రసంగంలో సూచించారు. ఆగస్టు 15న గ్రామజ్యోతి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఆగస్టు 15న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు గ్రామజ్యోతి కార్యక్రమాన్ని ప్రకటిస్తారు. ఆగస్టు 17న ముఖ్యమంత్రి వరంగల్ జిల్లా గంగదేవిపల్లిలో గ్రామజ్యోతి ప్రారంభిస్తారు. అదే రోజున మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు ఎక్కడికక్కడ ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. ఆగస్టు 17 నుంచి 24 వరకు గ్రామజ్యోతి వారోత్సవం జరుగుతుంది. ప్రజలను చైతన్యపరిచేందుకు సాంస్కృతిక సారథి కళాబృందాలు గ్రామాలకు తరలివెళ్తాయి.