గ్రామజ్యోతి వెలుగులేవీ? | gramajyothi not upto the mark | Sakshi
Sakshi News home page

గ్రామజ్యోతి వెలుగులేవీ?

Published Thu, Sep 1 2016 8:56 PM | Last Updated on Mon, Sep 4 2017 11:52 AM

గ్రామజ్యోతి పోస్టర్‌

గ్రామజ్యోతి పోస్టర్‌

  • మసకబారుతున్న పథకం
  • పెరుగుతున్న రాజకీయ జోక్యం
  • పంచాయతీ పాలకవర్గాల పెత్తనం
  • తీర్మానాలను పట్టించుకోని యంత్రాంగం
  • కమిటీల్లో కానరాని ఉత్సాహం
  • గ్రామ స్వరాజ్యానికి బాటలు పడని దుస్థితి
  • జోగిపేట: ప్రజలే పాలనలో భాగస్వాములు కావాలి.. కమిటీలుగా ఏర్పడి సమావేశాలు నిర్వహించాలి.. తమ సమస్యలపై గ్రామస్థులంతా చర్చించుకుని పరిష్కారమార్గం కనుగొనాలి.. అనే ఉన్నతాశయంతో చేపట్టిన గ్రామజ్యోతి పథకం మసకబారుతోంది. పెరుగుతున్న రాజకీయ జోక్యం.. పంచాయతీల పాలకవర్గం పెత్తనం.. వెరసి కమిటీల్లో ఉత్సాహం కొరవడుతోంది. కమిటీలు రూపొందించిన తీర్మానాలను సైతం యంత్రాంగం బుట్టదాఖలు చేస్తుండటంతో పథకంపై చీకట్లు కమ్ముకుంటున్నాయి. ‘గ్రామజ్యోతి’ ప్రారంభించి సరిగ్గా ఏడాది అయిన సందర్భంగా జిల్లాలో పథకం దుస్థితిపై కథనం..

    గ్రామ పంచాయతీలు బలోపేతం చేసేందుకు, గ్రామ స్వరాజ్యానికి బాటలు వేసేందుకు గ్రామ జ్యోతి పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా ఏడాది క్రితం ప్రారంభించింది. 2015 ఆగస్టు 17న వరగంల్‌ జిల్లా గీసుకొండ మండలం ఆదర్శగ్రామమైన గంగదేవిపల్లిలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

    అయితే రాజకీయ జోక్యం.. పంచాయతీ పాలకవర్గాల పెత్తనం.. ఎమ్మెల్యేలు చెప్పిందే తుది నిర్ణయం కావడం.. అధికారపక్ష కార్యకర్తలకే ప్రాధాన్యం ఇవ్వడం వంటి కారణాలతో గ్రామ జ్యోతి వెలుగులు పంచకముందే మసకబారిపోతోంది. కార్యక్రమాన్ని గాడిలో పెట్టాలనే సంకల్పం అధికార యంత్రాంగంలో లేకపోవడం, కమిటీలు బలోపేతం అయితే తమ ఆధిపత్యానికి గండి పడుతుందని నేతలు భావించడంతో గ్రామజ్యోతిపై నిర్లక్ష్యం నీడలు అలుముకున్నాయి.  

    జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి
    ఈ కార్యక్రమాన్ని జిల్లా యంత్రాంగం మొదట్లో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. జిల్లాలో మొత్తం 1,077 గ్రామపంచాయతీలు ఉన్నాయి. గ్రామజ్యోతిలో ఒక్కో గ్రామానికి ఏడు కమిటీలను నియమించింది. గ్రామాల్లోని అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలే ఆ కమిటీలో సభ్యులుగా ఉండాలని నిర్ణయించింది.

    తాగునీరు, పారిశుద్ధ్యం, వ్యవసాయం, వైద్యం, విద్య, సహజ వనరులు, మౌలిక వసతులు, మద్యపానం, సాంఘిక సంక్షేమం, పేదరిక నిర్మూలన అంశాలుగా కమిటీలు వేసి ఒక్కో కమిటీకి అధ్యక్షుడు, నలుగురు సభ్యులను నియమించింది. ఇక్కడి వరకు అంతా సవ్యంగానే సాగింది. గ్రామజ్యోతి కమిటీల ద్వారా వచ్చే తీర్మానాలకు ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో కొద్దిరోజుల్లోనే ఈ కమిటీలు అలంకారప్రాయంగా మారాయి.

    ఎలాగూ తీర్మానాలను పట్టించుకోరనే భావనతో కమిటీలోని సభ్యులు కూడా సమావేశాలకు రావడానికి ఆసక్తి చూపడంలేదు. ప్రతి ప్రభుత్వ సంక్షేమ పథకానికి గ్రామజ్యోతి కమిటీ అంగీకారం కావాల్సి ఉన్నా దీన్ని పట్టించుకోవడం లేదు. అసలు ఈ సమావేశాలు జరుగుతున్నాయా లేదా అనే సమీక్ష కరువైంది. ఏ ప్రాంతంలో కమిటీలు బలహీనంగా ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా ఎన్ని తీర్మానాలు అందాయి? ఎన్ని సమస్యలు పరిష్కారం అయ్యాయన్న సమాచారం అధికారుల దగ్గర లేకపోవడం గమనార్హం.

    శిక్షణా పూర్తి
    గ్రామజ్యోతి కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఈ కమిటీల్లోని సభ్యులు గ్రామ పంచాయతీకి వచ్చే నిధులను సద్వినియోగం చేసేలా చూడడమే. కమిటీల సభ్యులకు నాలుగునెలల క్రితం గ్రామజ్యోతి కార్యక్రమంపై అవగాహన కలగడానికి అన్ని ప్రాంతాల్లో శిక్షణ ఏర్పాటుచేశారు. తొలుత ప్రతి మండలానికి కనీసం ఇద్దరు మాస్టర్స్‌ ట్రైనర్స్‌ను గుర్తించి వీళ్లకు ప్రభుత్వం శిక్షణ ఇప్పించింది. శిక్షణ పొందినవారే ఒక్కో గ్రామంలో మళ్లీ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. అయినా  ప్రయోజనం శూన్యం.

    కొన్ని గ్రామాల్లో పరిస్థితి మరీ అధ్వానంగా ఉంది. కమిటీల్లో ఉన్న సభ్యులకు తాము ఏ కమిటీలో ఉన్నామన్న విషయం కూడా తెలియని పరిస్థితి. గ్రామ పంచాయతీలకు సరిపడా నిధులు విడుదలవుతన్నాయని అధికారులు చెబుతున్నా, గ్రామజ్యోతి కమిటీలు చేసే తీర్మానాలు మాత్రం అమలుకావడం లేదు. కమిటీలను బలోపేతం చేసి తీర్మానాలకు ప్రాధాన్యం ఇస్తే గ్రామాభివృద్ధిలో  మంచి ఫలితాలను ఇస్తుంది.

    ఈ కమిటీ సభ్యులు కనీసం నెలకోసారి సమావేశం కావాలి. కొత్త కార్యక్రమాల నిర్వహణ, గత తీర్మానాలు ఏ మేరకు అమలు చేశామని నిరంతం పరిశీలించాలి. అటు ఉన్నతాధికారులతో, ఇటు ప్రజలతో సత్సంబంధాలు ఏర్పర్చుకుని క్రియాశీలకంగా వ్యవహరించాలి. ఈ కమిటీలు చిత్తశుద్ధితో పనిచేస్తే గ్రామస్వరాజ్యం వెల్లివిరిస్తుంది. కానీ వాస్తవ పరిస్థితి చూస్తే పూర్తి భిన్నంగా ఉంది. సమావేశాలు తప్ప అమలు లేకపోవడంతో కమిటీల్లోని సభ్యుల్లో ఆసక్తి లేకుండా పోతోంది. ఎక్కడా గ్రామజ్యోతి సమావేశాలు జరగడంలేదు. గ్రామజ్యోతి కమిటీ సమావేశాలపై అధికారులెవరూ సమీక్షించడంలేదు.

    నిధులు లేవు
    కమిటీల తీర్మానాల మేరకు ప్రాధాన్యాంశాలను ఎప్పటికప్పుడు పంపిస్తున్నారు. కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రావడం లేదు. మొదటి సమావేశంలో చేసిన తీర్మానాల పనులే ఇప్పటివరకు పూర్తి కాలేదు. తీర్మానాలు చేయడమే తప్ప పనులు జరగడం లేదు. గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేయడంలేదు. కమిటీలు నామమాత్రంగానే ఉన్నాయి. - సర్పంచ్‌

    బడ్జెట్‌లోనే పంచాయతీలకు నిధులు
    కమిటీలు తీర్మానించిన పనులకు ప్రభుత్వం కేటాయించే నిధులే ఖర్చు చేయాల్సి ఉంటుంది. గ్రామజ్యోతి పథకానికి సంబంధించి ప్రత్యేకంగా నిధులు ఏమీ ఉండవు. 14వ ఫైనాన్స్‌ నిధులు  పంచాయతీలకు కేటాయించారు. సర్పంచ్‌లు ప్రతి నెలా గ్రామాల్లో కమిటీ సమావేశాలు నిర్వహించాలి. సమావేశాలు చాలా చోట్ల నిర్వహించడంలేదని తెలుస్తోంది. గ్రామ పంచాయతీలకి నిధుల కొరత లేదు. - సురేష్‌బాబు,  జిల్లా పంచాయతీ అధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement