programme not working
-
‘ఫసల్’ తుస్
ఫసల్ బీమా యోజన పథకానికి రుణమాఫీ అడ్డంకి నత్తనడకన రుణాల ప్రక్రియ.. 32 వేల మందికే వర్తింపు జిల్లాలో ఐదు లక్షల మందికిపైగా మొండిచేయి వ్యవసాయశాఖ వైఫల్యమూ కారణమే గజ్వేల్: జిల్లా రైతులను ‘ఫసల్ బీమా’ పథకం ఆదుకోలేకపోతోంది. పంట ఏ దశలో ఉన్నా ప్రీమియం చెల్లిస్తే నష్టపరిహారం వస్తుందంటూ పాత పథకానికి కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధన విధించినా.. ఆశించిన మేర విజయం సాధించలేదు. ఈ క్రమంలో బ్యాంకులు సైతం మూడో విడత రుణమాఫీ అందించడంలో జాప్యం చేసి రైతన్నలు భారీగా పంటనష్టాన్ని మూటగట్టుకునేలా చేశాయి. దీంతో ఇప్పటికే వరి, మొక్కజొన్న ఎండిపోగా మిగతా పంటలూ ఇదే దారి పట్టాయి. ఈసారి 3.72 లక్షల హెక్టార్లలో సాగు జిల్లాలో ఈసారి 3.72 లక్షల హెక్టార్లలో పంటలు సాగులోకి వచ్చాయి. ఇందులో మొక్కజొన్న 1.22 లక్షల హెక్టార్లు, పత్తి 84,175 లక్షల హెక్టార్లు, వరి 34,272 హెక్టార్లు, కంది 40,593 హెక్టార్లు, సోయాబీన్ 29,396 హెక్టార్లు, పెసర్లు 27,351 హెక్టార్లు, మినుములు 16,287 హెక్టార్లు, జొన్న 8,738 హెక్టార్లు, చెరకు 6,814 హెక్టార్లు సాగులోకి వచ్చాయి. ఆగస్టు మొదటి, రెండో వారాల్లో వర్షాలు లేకపోవడంతో ప్రధానంగా మొక్కజొన్న పంటకు భారీనష్టం వాటిల్లింది. వాస్తవానికి జూలై చివరి వారం నుంచి ఆగస్టు రెండో వారం వరకు మొక్కజొన్నకు కీలకదశ. అదునులో వర్షాలు లేక చెల్క భూముల్లో రైతులు తీవ్రంగా నష్టపోయారు. మిగతా పంటలపైనా నష్టం ఎక్కువగానే ఉంది. వరి పైర్లు ఎక్కడికక్కడ ఎండిపోయాయి. ఇలాంటి దశలో పంటల బీమా ఆదుకుంటుందన్న ఆశ రైతుల్లో ఏమాత్రం లేదు. మార్పులతో లాభమేనా?! ఈసారి పంటల బీమా పథకానికి మార్పులు చేసి సమర్థంగా అమలు చేయడానికి కేంద్రం నిర్ణయించింది. కొత్తగా తీసుకొచ్చిన పథకంలో ఖరీఫ్‌లో సాగుచేసే ఆహార, నూనె గింజలు, వాణిజ్య, ఉద్యాన పంటలకు పంటల వారీగా, ప్రాంతాల వారీగా ప్రీమియం నిర్థేశించారు. అగ్నిప్రమాదం, పిడుగుపాటు, గాలివాన, వడగళ్లు, తుఫాను, అనావృష్టి, వరదలు, నీట మునగడం, తెగుళ్ల వల్ల దిగుబడులకు నష్టం వాటిల్లితే పరిహారం చెల్లిస్తారు. అంతేకాకుండా ప్రతికూల వాతావరణం వల్ల విత్తకపోవడం, నార్లు వేయకపోవడం వల్ల కలిగే ఆర్థిక నష్టాలకు బీమా మొత్తంలో దాదాపు 25 శాతం సత్వర పరిహారం అందించే అవకాశం ఉంది. పంట మధ్యకాలంలో నష్టపోతే పరిహారంలో 25 శాతం చెల్లించే వెసులుబాటు కూడా ఉంది. అదేవిధంగా కోతల తర్వాత పొలంలో ఆరబెట్టిన పంటకు 14 రోజుల్లోపు తుఫాను కారణంగా నష్టం జరిగితే షరతులతో కూడిన చెల్లింపులు జరుగుతాయి. ‘యూనిట్’ లెక్కలు మొక్కజొన్న పంటను గ్రామ యూనిట్‌గా మిగిలిన పంటలను మండల యూనిట్‌గా అమలు చేస్తున్నారు. ఈ నిబంధనల ప్రకారం జిల్లాలో ప్రభుత్వం మొక్కజొన్న ఎకరాకు రూ.20 వేల బీమా సౌకర్యాన్ని కల్పించగా ఇందులో రైతు 2 శాతం అంటే రూ.400 ప్రీమియం చెల్లించాలి. వరి ఎకరాకు రూ.28 వేల బీమా వర్తింపునకు 1.5 శాతం అనగా రూ.420, జొన్న ఎకరాకు రూ.10 వేల బీమా అవకాశముండగా 2 శాతం రూ.200, కందికి రూ.13 వేల బీమాకు 2 శాతం రూ.260, పెసర్లు రూ.10 వేల బీమాకు 2 శాతంగా రూ. 200, మినుములు రూ.10 వేల బీమాకు 2 శాతం రూ.200 ప్రీమియం చెల్లించాలి. వర్షాధారంగా సాగుచేసే వేరుశనగ ఎకరాకు రూ.16 వేల బీమాకు 2 శాతం రూ.320 ప్రీమియం చెల్లించాలి. మిర్చికి ఎకరాకు రూ.24 వేలు ఇచ్చే అవకాశం ఉండగా ఇందులో 5 శాతంగా రూ.1200 ప్రీమియం చెల్లించాలి. ఇక సోయాబీన్ ఎకరాకు రూ.13 వేల బీమా అందే అవకాశముండగా 2 శాతంగా రూ.260 ప్రీమియంగా రైతు చెల్లించాలి. నెమ్మదించిన రుణాల ప్రక్రియ జిల్లాలో మూడో విడత రుణమాఫీలో భాగంగా రైతులకు రూ.483 కోట్ల బడ్జెట్ అందాల్సి ఉంది. కానీ, ఇప్పటి వరకు విడుదలైంది రూ.240 కోట్లు మాత్రమేనని జిల్లా వ్యవసాయాధికారులు చెబుతున్నారు. ఫలితంగా రుణాల పంపిణీ ప్రక్రియ నెమ్మదించింది. ఫసల్ బీమా యోజన బ్యాంకులో రుణాలు పొందే ప్రతి రైతు నుంచి నిర్బంధంగా ప్రీమియం డబ్బులు వసూలు చేసి పథకాన్ని వర్తించేలా చూస్తారు. కానీ, జిల్లాలో ఇప్పటి వరకు రుణాలు పొందింది కేవలం 32 వేల మంది రైతులు మాత్రమే. దాదాపు 5 లక్షల మందికిపైగా రైతులు రుణాలు పొందాల్సి ఉంది. బ్యాంకు రుణాలతో ఫసల్‌బీమా వర్తించే గడువు ఆగస్టు 10తో ముగిసింది. ఫలితంగా వీరందరి ఆశలు అడియాశలు అయ్యాయి. ఇదిలా ఉండగా, రుణాల ప్రక్రియతో ప్రమేయం లేకుండా ప్రీమియం చెల్లించుకునేలా రైతులను చైతన్య పర్చడంలో వ్యవసాయశాఖ పూర్తిగా విఫలం కావడం కూడా మరో కారణం. బ్యాంకోల్ల చుట్టూ తిరిగినా లాభం లేదు బ్యాంకుల్లో రుణాలు పొందే రైతులకు ఆగస్టు 10 వరకు మాత్రమే ఫసల్‌బీమా వర్తిస్తుందని తెల్సింది. బ్యాంకోల్ల చుట్టూ తిరిగినా బడ్జెట్ సరిగ్గా రాలేదని రుణం ఇయ్యలే. నాకు 8 ఎకరాల సొంత భూమి ఉంది. మరో 20 ఎకరాలు కౌలుకు తీసుకున్నా. ఇందులో 9 ఎకరాల్లో మొక్కజొన్న, 17 ఎకరాల్లో పత్తి, 4 ఎకరాల్లో వరి వేశా. మొక్కజొన్న పాడైంది. బ్యాంకు లోన్ ముందుగా వచ్చి ఉంటే నష్టం అంతగా ఉండేది కాదు. - రైతు నరేందర్‌రెడ్డి, ధర్మారెడ్డిపల్లి, గజ్వేల్ మండలం రుణాల ప్రక్రియలో జాప్యం జిల్లాలో రుణాల ప్రక్రియ వేగంగా సాగలేదు. ఫలితంగా ఫసల్‌బీమా పథకంలో రైతులు చేరలేకపోయారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాం. రుణమాఫీ ప్రక్రియ వేగవంతమయ్యే అవకాశముంది. బడ్జెట్ విడుదల కాగానే రైతులందరికి రుణాలు అందిస్తాం. - మాధవీ శ్రీలత, జేడీఏ -
గ్రామజ్యోతి వెలుగులేవీ?
మసకబారుతున్న పథకం పెరుగుతున్న రాజకీయ జోక్యం పంచాయతీ పాలకవర్గాల పెత్తనం తీర్మానాలను పట్టించుకోని యంత్రాంగం కమిటీల్లో కానరాని ఉత్సాహం గ్రామ స్వరాజ్యానికి బాటలు పడని దుస్థితి జోగిపేట: ప్రజలే పాలనలో భాగస్వాములు కావాలి.. కమిటీలుగా ఏర్పడి సమావేశాలు నిర్వహించాలి.. తమ సమస్యలపై గ్రామస్థులంతా చర్చించుకుని పరిష్కారమార్గం కనుగొనాలి.. అనే ఉన్నతాశయంతో చేపట్టిన గ్రామజ్యోతి పథకం మసకబారుతోంది. పెరుగుతున్న రాజకీయ జోక్యం.. పంచాయతీల పాలకవర్గం పెత్తనం.. వెరసి కమిటీల్లో ఉత్సాహం కొరవడుతోంది. కమిటీలు రూపొందించిన తీర్మానాలను సైతం యంత్రాంగం బుట్టదాఖలు చేస్తుండటంతో పథకంపై చీకట్లు కమ్ముకుంటున్నాయి. ‘గ్రామజ్యోతి’ ప్రారంభించి సరిగ్గా ఏడాది అయిన సందర్భంగా జిల్లాలో పథకం దుస్థితిపై కథనం.. గ్రామ పంచాయతీలు బలోపేతం చేసేందుకు, గ్రామ స్వరాజ్యానికి బాటలు వేసేందుకు గ్రామ జ్యోతి పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా ఏడాది క్రితం ప్రారంభించింది. 2015 ఆగస్టు 17న వరగంల్ జిల్లా గీసుకొండ మండలం ఆదర్శగ్రామమైన గంగదేవిపల్లిలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అయితే రాజకీయ జోక్యం.. పంచాయతీ పాలకవర్గాల పెత్తనం.. ఎమ్మెల్యేలు చెప్పిందే తుది నిర్ణయం కావడం.. అధికారపక్ష కార్యకర్తలకే ప్రాధాన్యం ఇవ్వడం వంటి కారణాలతో గ్రామ జ్యోతి వెలుగులు పంచకముందే మసకబారిపోతోంది. కార్యక్రమాన్ని గాడిలో పెట్టాలనే సంకల్పం అధికార యంత్రాంగంలో లేకపోవడం, కమిటీలు బలోపేతం అయితే తమ ఆధిపత్యానికి గండి పడుతుందని నేతలు భావించడంతో గ్రామజ్యోతిపై నిర్లక్ష్యం నీడలు అలుముకున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఈ కార్యక్రమాన్ని జిల్లా యంత్రాంగం మొదట్లో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. జిల్లాలో మొత్తం 1,077 గ్రామపంచాయతీలు ఉన్నాయి. గ్రామజ్యోతిలో ఒక్కో గ్రామానికి ఏడు కమిటీలను నియమించింది. గ్రామాల్లోని అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలే ఆ కమిటీలో సభ్యులుగా ఉండాలని నిర్ణయించింది. తాగునీరు, పారిశుద్ధ్యం, వ్యవసాయం, వైద్యం, విద్య, సహజ వనరులు, మౌలిక వసతులు, మద్యపానం, సాంఘిక సంక్షేమం, పేదరిక నిర్మూలన అంశాలుగా కమిటీలు వేసి ఒక్కో కమిటీకి అధ్యక్షుడు, నలుగురు సభ్యులను నియమించింది. ఇక్కడి వరకు అంతా సవ్యంగానే సాగింది. గ్రామజ్యోతి కమిటీల ద్వారా వచ్చే తీర్మానాలకు ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో కొద్దిరోజుల్లోనే ఈ కమిటీలు అలంకారప్రాయంగా మారాయి. ఎలాగూ తీర్మానాలను పట్టించుకోరనే భావనతో కమిటీలోని సభ్యులు కూడా సమావేశాలకు రావడానికి ఆసక్తి చూపడంలేదు. ప్రతి ప్రభుత్వ సంక్షేమ పథకానికి గ్రామజ్యోతి కమిటీ అంగీకారం కావాల్సి ఉన్నా దీన్ని పట్టించుకోవడం లేదు. అసలు ఈ సమావేశాలు జరుగుతున్నాయా లేదా అనే సమీక్ష కరువైంది. ఏ ప్రాంతంలో కమిటీలు బలహీనంగా ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా ఎన్ని తీర్మానాలు అందాయి? ఎన్ని సమస్యలు పరిష్కారం అయ్యాయన్న సమాచారం అధికారుల దగ్గర లేకపోవడం గమనార్హం. శిక్షణా పూర్తి గ్రామజ్యోతి కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఈ కమిటీల్లోని సభ్యులు గ్రామ పంచాయతీకి వచ్చే నిధులను సద్వినియోగం చేసేలా చూడడమే. కమిటీల సభ్యులకు నాలుగునెలల క్రితం గ్రామజ్యోతి కార్యక్రమంపై అవగాహన కలగడానికి అన్ని ప్రాంతాల్లో శిక్షణ ఏర్పాటుచేశారు. తొలుత ప్రతి మండలానికి కనీసం ఇద్దరు మాస్టర్స్ ట్రైనర్స్‌ను గుర్తించి వీళ్లకు ప్రభుత్వం శిక్షణ ఇప్పించింది. శిక్షణ పొందినవారే ఒక్కో గ్రామంలో మళ్లీ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. అయినా ప్రయోజనం శూన్యం. కొన్ని గ్రామాల్లో పరిస్థితి మరీ అధ్వానంగా ఉంది. కమిటీల్లో ఉన్న సభ్యులకు తాము ఏ కమిటీలో ఉన్నామన్న విషయం కూడా తెలియని పరిస్థితి. గ్రామ పంచాయతీలకు సరిపడా నిధులు విడుదలవుతన్నాయని అధికారులు చెబుతున్నా, గ్రామజ్యోతి కమిటీలు చేసే తీర్మానాలు మాత్రం అమలుకావడం లేదు. కమిటీలను బలోపేతం చేసి తీర్మానాలకు ప్రాధాన్యం ఇస్తే గ్రామాభివృద్ధిలో మంచి ఫలితాలను ఇస్తుంది. ఈ కమిటీ సభ్యులు కనీసం నెలకోసారి సమావేశం కావాలి. కొత్త కార్యక్రమాల నిర్వహణ, గత తీర్మానాలు ఏ మేరకు అమలు చేశామని నిరంతం పరిశీలించాలి. అటు ఉన్నతాధికారులతో, ఇటు ప్రజలతో సత్సంబంధాలు ఏర్పర్చుకుని క్రియాశీలకంగా వ్యవహరించాలి. ఈ కమిటీలు చిత్తశుద్ధితో పనిచేస్తే గ్రామస్వరాజ్యం వెల్లివిరిస్తుంది. కానీ వాస్తవ పరిస్థితి చూస్తే పూర్తి భిన్నంగా ఉంది. సమావేశాలు తప్ప అమలు లేకపోవడంతో కమిటీల్లోని సభ్యుల్లో ఆసక్తి లేకుండా పోతోంది. ఎక్కడా గ్రామజ్యోతి సమావేశాలు జరగడంలేదు. గ్రామజ్యోతి కమిటీ సమావేశాలపై అధికారులెవరూ సమీక్షించడంలేదు. నిధులు లేవు కమిటీల తీర్మానాల మేరకు ప్రాధాన్యాంశాలను ఎప్పటికప్పుడు పంపిస్తున్నారు. కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రావడం లేదు. మొదటి సమావేశంలో చేసిన తీర్మానాల పనులే ఇప్పటివరకు పూర్తి కాలేదు. తీర్మానాలు చేయడమే తప్ప పనులు జరగడం లేదు. గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేయడంలేదు. కమిటీలు నామమాత్రంగానే ఉన్నాయి. - సర్పంచ్ బడ్జెట్లోనే పంచాయతీలకు నిధులు కమిటీలు తీర్మానించిన పనులకు ప్రభుత్వం కేటాయించే నిధులే ఖర్చు చేయాల్సి ఉంటుంది. గ్రామజ్యోతి పథకానికి సంబంధించి ప్రత్యేకంగా నిధులు ఏమీ ఉండవు. 14వ ఫైనాన్స్ నిధులు పంచాయతీలకు కేటాయించారు. సర్పంచ్‌లు ప్రతి నెలా గ్రామాల్లో కమిటీ సమావేశాలు నిర్వహించాలి. సమావేశాలు చాలా చోట్ల నిర్వహించడంలేదని తెలుస్తోంది. గ్రామ పంచాయతీలకి నిధుల కొరత లేదు. - సురేష్‌బాబు, జిల్లా పంచాయతీ అధికారి