‘ఫసల్‌’ తుస్‌ | fasal beema yojana programme not upto the mark | Sakshi
Sakshi News home page

‘ఫసల్‌’ తుస్‌

Published Tue, Sep 13 2016 10:28 PM | Last Updated on Tue, Jun 4 2019 5:16 PM

గజ్వేల్‌లో ఎండిపోయిన మొక్కజొన్న - Sakshi

గజ్వేల్‌లో ఎండిపోయిన మొక్కజొన్న

  • ఫసల్‌ బీమా యోజన పథకానికి రుణమాఫీ అడ్డంకి
  • నత్తనడకన రుణాల ప్రక్రియ.. 32 వేల మందికే వర్తింపు
  • జిల్లాలో ఐదు లక్షల మందికిపైగా మొండిచేయి
  • వ్యవసాయశాఖ వైఫల్యమూ కారణమే
  • గజ్వేల్‌: జిల్లా రైతులను ‘ఫసల్‌ బీమా’ పథకం ఆదుకోలేకపోతోంది. పంట ఏ దశలో ఉన్నా ప్రీమియం చెల్లిస్తే నష్టపరిహారం వస్తుందంటూ పాత పథకానికి కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధన విధించినా.. ఆశించిన మేర విజయం సాధించలేదు. ఈ క్రమంలో బ్యాంకులు సైతం మూడో విడత రుణమాఫీ అందించడంలో జాప్యం చేసి రైతన్నలు భారీగా పంటనష్టాన్ని మూటగట్టుకునేలా చేశాయి. దీంతో ఇప్పటికే వరి, మొక్కజొన్న ఎండిపోగా మిగతా పంటలూ ఇదే దారి పట్టాయి.

    ఈసారి 3.72 లక్షల హెక్టార్లలో సాగు
    జిల్లాలో ఈసారి 3.72 లక్షల హెక్టార్లలో పంటలు సాగులోకి వచ్చాయి. ఇందులో మొక్కజొన్న 1.22 లక్షల హెక్టార్లు, పత్తి 84,175 లక్షల హెక్టార్లు, వరి 34,272 హెక్టార్లు, కంది 40,593 హెక్టార్లు, సోయాబీన్‌ 29,396 హెక్టార్లు, పెసర్లు 27,351 హెక్టార్లు, మినుములు 16,287 హెక్టార్లు, జొన్న 8,738 హెక్టార్లు, చెరకు 6,814 హెక్టార్లు సాగులోకి వచ్చాయి. ఆగస్టు మొదటి, రెండో వారాల్లో వర్షాలు లేకపోవడంతో ప్రధానంగా మొక్కజొన్న పంటకు భారీనష్టం వాటిల్లింది.

    వాస్తవానికి జూలై చివరి వారం నుంచి ఆగస్టు రెండో వారం వరకు మొక్కజొన్నకు కీలకదశ. అదునులో వర్షాలు లేక చెల్క భూముల్లో రైతులు తీవ్రంగా నష్టపోయారు. మిగతా పంటలపైనా నష్టం ఎక్కువగానే ఉంది. వరి పైర్లు ఎక్కడికక్కడ ఎండిపోయాయి. ఇలాంటి దశలో పంటల బీమా ఆదుకుంటుందన్న ఆశ రైతుల్లో ఏమాత్రం లేదు.

    మార్పులతో లాభమేనా?!
    ఈసారి పంటల బీమా పథకానికి మార్పులు చేసి సమర్థంగా అమలు చేయడానికి కేంద్రం నిర్ణయించింది. కొత్తగా తీసుకొచ్చిన పథకంలో ఖరీఫ్‌లో సాగుచేసే ఆహార, నూనె గింజలు, వాణిజ్య, ఉద్యాన పంటలకు పంటల వారీగా, ప్రాంతాల వారీగా ప్రీమియం నిర్థేశించారు. అగ్నిప్రమాదం, పిడుగుపాటు, గాలివాన, వడగళ్లు, తుఫాను, అనావృష్టి, వరదలు, నీట మునగడం, తెగుళ్ల వల్ల దిగుబడులకు నష్టం వాటిల్లితే పరిహారం చెల్లిస్తారు.

    అంతేకాకుండా ప్రతికూల వాతావరణం వల్ల విత్తకపోవడం, నార్లు వేయకపోవడం వల్ల కలిగే ఆర్థిక నష్టాలకు బీమా మొత్తంలో దాదాపు 25 శాతం సత్వర పరిహారం అందించే అవకాశం ఉంది. పంట మధ్యకాలంలో నష్టపోతే పరిహారంలో 25 శాతం చెల్లించే వెసులుబాటు కూడా ఉంది. అదేవిధంగా కోతల తర్వాత పొలంలో ఆరబెట్టిన పంటకు 14 రోజుల్లోపు తుఫాను కారణంగా నష్టం జరిగితే షరతులతో కూడిన చెల్లింపులు జరుగుతాయి.

    ‘యూనిట్‌’ లెక్కలు
    మొక్కజొన్న పంటను గ్రామ యూనిట్‌గా మిగిలిన పంటలను మండల యూనిట్‌గా అమలు చేస్తున్నారు. ఈ నిబంధనల ప్రకారం జిల్లాలో ప్రభుత్వం మొక్కజొన్న ఎకరాకు రూ.20 వేల బీమా సౌకర్యాన్ని కల్పించగా ఇందులో రైతు 2 శాతం అంటే రూ.400 ప్రీమియం చెల్లించాలి. వరి ఎకరాకు రూ.28 వేల బీమా వర్తింపునకు 1.5 శాతం అనగా రూ.420, జొన్న ఎకరాకు రూ.10 వేల బీమా అవకాశముండగా 2 శాతం రూ.200, కందికి రూ.13 వేల బీమాకు 2 శాతం రూ.260, పెసర్లు రూ.10 వేల బీమాకు 2 శాతంగా రూ. 200, మినుములు రూ.10 వేల బీమాకు 2 శాతం రూ.200 ప్రీమియం చెల్లించాలి. వర్షాధారంగా సాగుచేసే వేరుశనగ ఎకరాకు రూ.16 వేల బీమాకు 2 శాతం రూ.320 ప్రీమియం చెల్లించాలి. మిర్చికి ఎకరాకు రూ.24 వేలు ఇచ్చే అవకాశం ఉండగా ఇందులో 5 శాతంగా రూ.1200 ప్రీమియం చెల్లించాలి. ఇక సోయాబీన్‌ ఎకరాకు రూ.13 వేల బీమా అందే అవకాశముండగా 2 శాతంగా రూ.260 ప్రీమియంగా రైతు చెల్లించాలి.

    నెమ్మదించిన రుణాల ప్రక్రియ
    జిల్లాలో మూడో విడత రుణమాఫీలో భాగంగా రైతులకు రూ.483 కోట్ల బడ్జెట్‌ అందాల్సి ఉంది. కానీ, ఇప్పటి వరకు విడుదలైంది రూ.240 కోట్లు మాత్రమేనని జిల్లా వ్యవసాయాధికారులు చెబుతున్నారు. ఫలితంగా రుణాల పంపిణీ ప్రక్రియ నెమ్మదించింది. ఫసల్‌ బీమా యోజన బ్యాంకులో రుణాలు పొందే ప్రతి రైతు నుంచి నిర్బంధంగా ప్రీమియం డబ్బులు వసూలు చేసి పథకాన్ని వర్తించేలా చూస్తారు.

    కానీ, జిల్లాలో ఇప్పటి వరకు రుణాలు పొందింది కేవలం 32 వేల మంది రైతులు మాత్రమే. దాదాపు 5 లక్షల మందికిపైగా రైతులు రుణాలు పొందాల్సి ఉంది. బ్యాంకు రుణాలతో ఫసల్‌బీమా వర్తించే గడువు ఆగస్టు 10తో ముగిసింది. ఫలితంగా వీరందరి ఆశలు అడియాశలు అయ్యాయి. ఇదిలా ఉండగా, రుణాల ప్రక్రియతో ప్రమేయం లేకుండా ప్రీమియం చెల్లించుకునేలా రైతులను చైతన్య పర్చడంలో వ్యవసాయశాఖ పూర్తిగా విఫలం కావడం కూడా మరో కారణం.

    బ్యాంకోల్ల చుట్టూ తిరిగినా లాభం లేదు
    బ్యాంకుల్లో రుణాలు పొందే రైతులకు ఆగస్టు 10 వరకు మాత్రమే ఫసల్‌బీమా వర్తిస్తుందని తెల్సింది. బ్యాంకోల్ల చుట్టూ తిరిగినా బడ్జెట్‌ సరిగ్గా రాలేదని రుణం ఇయ్యలే. నాకు 8 ఎకరాల సొంత భూమి ఉంది. మరో 20 ఎకరాలు కౌలుకు తీసుకున్నా. ఇందులో 9 ఎకరాల్లో మొక్కజొన్న, 17 ఎకరాల్లో పత్తి, 4 ఎకరాల్లో వరి వేశా. మొక్కజొన్న పాడైంది. బ్యాంకు లోన్‌ ముందుగా వచ్చి ఉంటే నష్టం అంతగా ఉండేది కాదు. - రైతు నరేందర్‌రెడ్డి, ధర్మారెడ్డిపల్లి, గజ్వేల్‌ మండలం

    రుణాల ప్రక్రియలో జాప్యం
    జిల్లాలో రుణాల ప్రక్రియ వేగంగా సాగలేదు. ఫలితంగా ఫసల్‌బీమా పథకంలో రైతులు చేరలేకపోయారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాం. రుణమాఫీ ప్రక్రియ వేగవంతమయ్యే అవకాశముంది. బడ్జెట్‌ విడుదల కాగానే రైతులందరికి రుణాలు అందిస్తాం. - మాధవీ శ్రీలత, జేడీఏ

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement