త్వరలో ‘గ్రామజ్యోతి’కి ఫేస్‌బుక్ ఖాతా
ఫేస్‌బుక్ ‘బూస్ట్ యువర్ బిజినెస్’లో మంత్రి కేటీఆర్ దశలవారీగా అన్ని గ్రామాలకూ ఖాతాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన గ్రామజ్యోతి కార్యక్రమానికి త్వరలోనే ఫేస్‌బుక్ అకౌంట్‌ను తెరవ బోతున్నట్లు పంచాయతీరాజ్, ఐటీశాఖ మంత్రి కె.తారకరామారావు చెప్పారు. సామాజిక మాధ్యమానికి పెరిగిన ప్రజాదరణను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో ఫేస్‌బుక్ నిర్వహించిన ‘బూస్ట్ యువర్ బిజినెస్’ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి తోడ్పాటునందించాలనుకునే వారికి ఆయా గ్రామాల పరిస్థితులను తెలిపేందుకు ఫేస్‌బుక్ సాధనంగా ఉపకరిస్తుందన్నారు.
ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోని ప్రతి గ్రామానికీ ఫేస్‌బుక్ ఖాతాను తెరవాలనుకుంటున్నట్లు కేటీఆర్ వివరించారు. అక్టోబర్ 2న తొలి విడతగా 700 గ్రామాలకు, ఆ తర్వాత దశలవారీగా మిగిలిన గ్రామాలకూ ఫేస్‌బుక్ ఖాతా తెరుస్తామన్నారు. చిన్న, మధ్యతరహా, కుటీర పరిశ్రమల యజమానులు వ్యాపారాన్ని వృద్ధి చేసుకునేందుకు తోడ్పాటు అందిస్తూ మీడియా నిర్వచనాన్ని ఫేస్‌బుక్ మార్చేసిందన్నారు. దేశంలోనే అత్యధికంగా 2.75 లక్షల మంది నెటిజన్లు సీఎం కేసీఆర్ ఫేస్‌బుక్ ఖాతాను ఫాలో అవుతుండటం రికార్డు అని కేటీఆర్ చెప్పారు.
‘బూస్ట్ యువర్ బిజినెస్’ను ఫేస్‌బుక్ దేశంలో ప్రప్రథమంగా హైదరాబాద్‌లోనే ఆవిష్కరించడంపట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఫేస్‌బుక్ ద్వారా తన వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకున్న‘ పెళ్లి పూల జడ’ డెరైక్టర్ కల్పనను మంత్రి కే టీఆర్ అభినందించారు. చిన్నతరహా వ్యాపారులు ఫేస్‌బుక్ ద్వారా తమ బిజెనెస్‌ను మెరుగు పర్చుకునేందుకు తాము కల్పిస్తున్న అవకాశాలను ఫేస్‌బుక్ ఎకనామిక్స్ గ్రోత్ హెడ్ రితేశ్ మెహతా, సెంట్రల్ ఏషియా పబ్లిక్ పాలసీ విభాగాధిపతి అనిల్చిదాస్ వివరించారు. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ వినియోగిస్తున్న 300 కోట్ల మందిలో సగం మంది ఫేస్‌బుక్ ఖాతాను కలిగి ఉన్నారన్నారు.