
గంగదేవిపల్లికి రూ. 10 కోట్లు మంజూరు
వరంగల్: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు గ్రామజ్యోతి పథకాన్ని ప్రారంభించారు. సోమవారం మధ్యాహ్నం వరంగల్ జిల్లా గంగదేవిపల్లిలో జరిగిన సభలో కేసీఆర్ పాల్గొన్నారు.
గంగదేవిపల్లిలో గ్రామజ్యోతి పథకాన్ని ఆరంభించిన కేసీఆర్.. సభలో మాట్లాడారు. గంగదేవిపల్లి అభివృద్ధికి కేసీఆర్ 10 కోట్ల రూపాయలను మంజూరు చేశారు. ఈ నిధులను వెంటనే విడుదల చేయనున్నట్టు కేసీఆర్ ప్రకటించారు. గ్రామస్తులందరూ కలసి చర్చించుకుని గామాభివృద్ధికి ఏయే పనులు చేపట్టాలి అన్నది నిర్ణయించుకోవాలని సూచించారు. గంగదేవిపల్లి దేశంలోనే గొప్ప ఆదర్శ గ్రామం కావాలని కేసీఆర్ ఆకాంక్షించారు. అంతకుముందు కేసీఆర్ గ్రామంలో కలియదిరిగి గ్రామస్తులతో మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
గంగదేవిపల్లి సభలో కేసీఆర్ తనదైన శైలిలో ప్రసంగించారు. పూలు వాడిపోరాదనే ఉద్దేశంతో వాటిపై నీళ్లు చల్లుతారని, ఈ పూలదండలు వేసినపుడు తన చొక్కా తడిసిపోతుందని కేసీఆర్ అన్నారు. అందుకే తాను పూలదండలు వేయించుకోనని చెప్పారు.