‘గ్రామజ్యోతి’లో ఎంపీటీసీలకు స్థానం కల్పించాలి
తెలంగాణ రాష్ట్ర ఎంపీటీసీల ఫోరం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం చేపట్టిన గ్రామజ్యోతిలో ఎంపీటీసీలకు భాగస్వామ్యం కల్పించడంతో పాటు విధులు, నిధులు కేటాయించాలని తెలంగాణ రాష్ట్ర ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. గ్రామజ్యోతిలో ఎంపీటీసీలకు భాగస్వామ్యం కల్పించనందుకు నిరసనగా ఫోరం ఆధ్వర్యంలో శనివారం ఇందిరాపార్కు వద్ద ఎంపీటీసీలు నిరశన దీక్ష నిర్వహించారు. దీక్షల్లో ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు బోళ్ల కరుణాకర్, ప్రధానకార్యదర్శి అన్నారపు యాకయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం మల్లేశం, పి. గోవర్ధన్‌రావు, జి. పార్వతమ్మ, కోశాధికారి మహబూబ్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి తదితరులు కూర్చున్నారు.
ఈ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి మాట్లాడుతూ నామినేట్ అయిన వారికి కేబినెట్‌లో అవకాశం కల్పించిన సీఎం.. ప్రజల ఓట్లతో గెల్చిన ఎంపీటీసీలకు గ్రామజ్యోతిలో భాగస్వామ్యం కల్పించకపోవడం శోచనీయమన్నారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ గ్రామాల అబివృద్ధి కోసం పనిచేసే ఎంపీటీసీలకు గ్రామజ్యోతిలో భాగస్వామ్యం కల్పించకపోవడం శోచనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, టీడీపీ శాసనసభాపక్షనేత ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జాజుల శ్రీనివాస్‌గౌడ్, నాయకుడు గుజ్జకృష్ణ, టీడీపీ ఎమ్మెల్యే వివేకానంద, మాజీమంత్రి రాములు, తెలంగాణ రాష్ట్ర ఎంపీటీసీల ఫోరం నాయకులు యాదగిరి, రియాజ్, పురుషోత్తంరెడ్డి, సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.