రండి.. దరిద్రంపై యుద్ధం చేద్దాం!
ఎర్రవల్లి గ్రామసభలో సీఎం కేసీఆర్
గజ్వేల్: ‘‘నిన్న ఒక ఆలోచన వచ్చింది. ఒక దారిలో వెళ్దామనుకున్నాం. గ్రామాన్ని మొత్తం పరిశుభ్రం చేసే పని మొదలుపెట్టాం. మంచి పనికి భగవంతుని ఆశీస్సులు ఉంటాయి. ఇది ఇంతటితో ఆగిపోదు. ఇంకా ముందుకెళ్దాం. నా వెంట రండి. ఇక దరిద్రం మీద యుద్ధం చేద్దాం. మీ వెంట నేనుంటా. ఎందుకు పైకిరారో చూస్తా..’’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. శుక్రవారం మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మండలం ఎర్రవల్లిలో రెండోరోజు నిర్వహించిన ‘గ్రామజ్యోతి’ సభలో ఆయన గ్రామస్తులను ఉద్దేశించి మాట్లాడారు. సీఎం పిలుపునందుకొన్న గ్రామస్తులు ప్రతి ఇంటి నుంచి తట్టా, పార చేతపట్టుకొని ఉదయం నుంచే పెద్ద ఎత్తున తరలివచ్చారు. గ్రామాన్ని నాలుగు భాగాలుగా విభజించుకొని శ్రమదానం పనుల్లో నిమగ్నమయ్యారు. అధికారులు సైతం ఈ పనుల్లో భాగస్వాములయ్యారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు సీఎం స్వయంగా పనులను పర్యవేక్షించారు.
అనంతరం గ్రామసభలో మాట్లాడుతూ... ‘‘నిన్న ఇక్కడ జరిగిన సభ, నా మాటలు టీవీలు, పత్రికల ద్వారా తెలుసుకున్న ఈ ఊరికి చెందిన దాతలు హైదరాబాద్, ఇతర ప్రాంతాల నుంచి వచ్చారు. గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి అంగీకరించారు. ఎర్రవల్లిలో ఇల్లు లేని కుటుంబం ఉండొద్దు. ఇప్పటి దాకా ముక్కిపోయి, మురిగిపోయిన ఇళ్లలో కాలం గడిపాం. ఇకపై అలా ఉండొద్దు.. అయిదారు నెలల్లో అందరికీ డబుల్ బెడ్‌రూం ఇళ్లు కట్టిస్తా’’ అని సీఎం హామీ ఇచ్చారు. చౌరస్తాలను సిటీలో మాదిరి అందంగా తీర్చిదిద్దుకుందామని పేర్కొన్నారు. ‘ఒక్క దెబ్బకు ఊరంతా సైరకు రావాలె... దయ్యం వదలాలె’ అంటూ గ్రామస్తులను ఉత్సాహపరిచారు. ఇక్కడితో మన ప్రయత్నాలు, పనులు ఆగిపోవన్నారు. ఒకరోజు కంటివైద్య శిబిరం నిర్వహించి అందరికీ పరీక్షలు చేయిద్దామని, మరో రోజు సాధారణ వైద్య శిబిరాన్ని నిర్వహించి వైద్య పరీక్షలు చేయిద్దామని చెప్పారు.
ఎర్రవల్లిని చూసి అంతా ఆశ్చర్యపోవాలి
‘‘ఇప్పుడు మనం పని మొదలుపెట్టాం. ఎర్రవల్లి ఎంత అందంగా మారిపోయిందని అంద రూ ఆశ్చర్యపోవాలి. అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలి. జిల్లాకో ఊరును ఇలా తయారు చేస్తే వెలుగొస్తుంది. ఊరిలో ఇవ్వాల్టి నుంచి మోటు మాటలు బంద్ చేయండి. మాట్లాడితే రూ.50 జరిమానా ప్రకటించండి. అప్పుడు అందరూ సక్కగ మాట్లాడుతరు. గ్రామ కమిటీలో ఈ నిర్ణయం తీసుకోండి’’ అని సీఎం సూచించా రు. ఈ సందర్భంగా అక్కడే ఉన్న ఎంపీ ప్రభాకర్‌రెడ్డిని ఉద్దేశించి ‘‘ఏమయ్యా.. ఎంపీ గారు మా ఊరికి ఎన్ని డబ్బులిస్తరు?’’ అని ప్రశ్నించారు. ఎంపీ లేచి ‘రూ. 50 లక్షలు ఇస్తాను సార్’ అని ప్రకటించారు. ఆపై కలెక్టర్ రోనాల్డ్ రాస్‌ను ఉద్దేశించి ‘కలెక్టర్ గారూ.. మీరెంత ఇస్తరు?’ అని సీఎం అడిగారు. ఆయన రూ.25 లక్షలు కేటాయిస్తాం సార్ అని బదులిచ్చారు. దీంతో సీఎం గ్రామస్తుల వైపు చూస్తూ.. ‘‘ఇగ జూసిన్రా.. మీరు నా ఎంబడి ఉంటే ఇంకా షాన డబ్బులు తెస్త..’ అని వ్యాఖ్యానించారు.
ఆదర్శ గ్రామాల్లో ఒక్కో దగ్గర ఒక్కో నియమం ఉంటుందని, కొన్ని గ్రామాల్లో మందు తాగుడు బంద్ చేశారని, ఇంకొన్ని గ్రామాల్లో మందు తాగితే జరిమానా విధిస్తున్నారని, అలాగే మీరు కూడా ఏం చేస్తే బాగుంటుందో ఆలోచించాలని గ్రామస్థులకు సూచించారు. తాను మళ్లీ వస్తానని, అప్పుడు గ్రామ ఎజెండా తయారు చేద్దామంటూ ప్రసంగాన్ని ముగించారు. అనంతరం గ్రామస్థులతో కలసి సహపంక్తి భోజనం చేశారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ వెంకట్‌రాంరెడ్డి, ‘గడా’ ఓఎస్‌డీ హన్మంతరావు, సిద్దిపేట ఆర్డీఓ ముత్యంరెడ్డి, గ్రామ సర్పంచ్ భాగ్యబాల్‌రాజు, ఎంపీటీసీ భాగ్యమ్మ తదితరులు పాల్గొన్నారు.