ఎక్కింది ఒక్క మెట్టు మాత్రమే: కేసీఆర్
ఎర్రవల్లి: తెలంగాణ సీఎం కేసీఆర్ తన దత్తత గ్రామమైన సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ప్రారంభించారు. ఇప్పటివరకూ మనం ఎక్కింది ఒక్క మెట్టు మాత్రమేనని, ఇదే స్ఫూర్తితో ఇళ్ల నిర్మాణంలో ముందుకు వెళ్దామని పిలుపునిచ్చారు. అనంతరం అక్కడ కమ్యూనిటీ హాల్‌ను కేసీఆర్ ప్రారంభించిన వెంటనే కళ్యాణ మండపంలో పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు. నగదు రహిత లావాదేవీల్లో తెలంగాణ నంబర్ వన్ కావాలన్నారు. సరిగ్గా ఏడాది కింద ఇదే రోజున ఘనంగా అయుత చండీయాగాన్ని ప్రారంభించిన కేసీఆర్.. నేడు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీకి స్వీకారం చుట్టారు. పైలాన్ ఆవిష్కరించి సామూహిక గృహప్రవేశాలను ఆయన ప్రారంభించారు. తన దత్తత గ్రామాలైన ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామస్తులకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాలను నగదు రహిత గ్రామాలుగా సీఎం కేసీఆర్ ప్రకటించారు. ముఖ్యంగా ఈ రెండు గ్రామాల ప్రజలు ఎవరిపైనా ఆధారపడకుండా స్వయం పాలితగా ఉండి, స్వయం సమృద్ధి సాధించి, నగదు రహిత గ్రామాలుగా మారి ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలవాలని సీఎం ఆకాంక్షించారు. మళ్లీ ఒకరోజు ఎర్రవల్లికి వస్తాను.. గ్రామంలో సామూహిక భోజనాలు ఏర్పాటు చేసి మరిన్ని అభివృద్ధి విషయాలపై చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. వాస్తవానికి ఎర్రవల్లికి 395, నర్సన్నపేటకు 200 ఇళ్లు చొప్పున మొత్తం 595 ఇళ్లు మంజూరుకాగా, నిర్మాణం పూర్తయిన ఇళ్ల పంపిణీ జరిగింది. ఎర్రవల్లిలో 344 ఇళ్లు, నర్సన్నపేటలో 186 ఇళ్లు మొత్తం 530 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో గృహ ప్రవేశాలు జరిగాయి.