గృహవల్లి
- ఎర్రవల్లికి 285 డబుల్ బెడ్‌రూంలు మంజూరు
- గ్రామస్తుల హర్షాతిరేకాలు
- త్వరలోనే సీఎం భూమిపూజ
జగదేవ్‌పూర్: ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత తీసుకున్న ఎర్రవల్లిలో సోమవారం సంబురాలు మిన్నంటాయి. ఈ గ్రామానికి 285 డబుల్ బెడ్‌రూములు మంజూరు చేయడంతో గ్రామస్తులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ఊరంతా స్వీట్లు పంచుకున్నారు. సంబురాలు చేసుకున్నారు. గ్రామంలో డబుల్ బెడ్ రూముల ఇళ్లను మంజూరు చేస్తూ సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దాన కిశోర్ ఉత్తర్వులు జారీ చేశారు. నిర్మాణాల కోసం రూ.14.36 కోట్లను సైతం మంజూరు చేశారు. కలెక్టర్ రోనాల్డ్‌రాస్, గడా అధికారి హన్మంతరావు, మండల తహశీల్దార్‌కు, హౌసింగ్ అధికారులకు ఉత్తర్వులను పంపించారు. ఒక్క డబుల్ బెడ్‌రూం నిర్మాణానికి రూ.5.4 లక్షల చొప్పున విడుదల చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
గ్రామజ్యోతి కార్యక్రమంలో భాగంగా ఎర్రవల్లిలో సీఎం పర్యటించినప్పుడు.. ఒక్క పెంకుటిల్లు లేకుండా కూల్చివేయాలని సీఎం అధికారులకు సూచించిన విషయం తెలిసిందే. అలాగే ఇళ్లు లేనివారు కోసం అధికారులు సర్వే చేసి 285 మంది అర్హులను గుర్తించారు. గృహనిర్మాణ సంస్థ అధికారులు కూడా ఇటీవల సర్వే నిర్వహించారు. గ్రామంలో గుర్తించిన అర్హుల నివేదికను ఇటివల సీఎం కేసీఆర్ దృష్టికి జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌రాస్, గడా అధికారి హన్మంతరావు తీసుకెళ్లారు. అనంతరం ప్రభుత్వానికి పంపించారు. ఈ క్రమంలో సోమవారం ఎర్రవల్లిలో డబుల్ బెడ్‌రూంల నిర్మాణం కోసం గృహ నిర్మాణ సంస్థ నుంచి జీఓ విడుదలైంది. చైనా పర్యటన అనంతరం సీఎం కేసీఆర్.. ఇళ్ల నిర్మాణానికి భూమిపూజ చేసే అవకాశం ఉంది.
కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం...
గ్రామానికి డబుల్ బెడ్‌రూంలు మంజూరు కావడంతో సోమవారం ఎర్రవల్లి గ్రామ సర్వ వర్గ సమితి ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ ఫొటోకు పాలాభిషేకం చేశారు. ఊరంతా స్వీట్లు పంచుకున్నారు. గ్రామ సర్పంచ్ భాగ్య, గ్రామ సర్వ వర్గ సమితి అధ్యక్షుడు కిష్టారెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌కు ఎర్రవల్లి గ్రామస్తులందరం జన్మజన్మలా రుణపడి ఉంటామన్నారు. ఊరంతా పెంకుటిళ్లు లేకుండా డబుల్ బెడ్ రూంలు కట్టించడం అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో కమిటీ ఉపాధ్యక్షులు కృష్ణ, ఆంజనేయులు, సలహాదారులు భిక్షపతి, బాల్‌రాజు, సభ్యులు సత్తయ్య, నవీన్, మహిళ సంఘం సభ్యులు పాల్గొన్నారు.