'పల్లె పల్లెనా గ్రామజ్యోతి'
హైదరాబాద్: పంచాయతీరాజ్ ఉద్యమ స్ఫూర్తిని మళ్లీ గ్రామ స్థాయిలో తీసుకు రావాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. ప్రజలను పెద్ద ఎత్తున భాగస్వాములను చేసి గ్రామాల అభివృద్ధి సాధించాలన్నారు. ప్రజల భాగస్వామ్యంతో నిర్వహించిన మిషన్ కాకతీయ చాలా గొప్పగా జరిగింది. అదే స్ఫూర్తితో ‘గ్రామజ్యోతి’ కార్యక్రమం నిర్వహించాలి.’ అని ముఖ్యమంత్రి తన ఆకాంక్షను వ్యక్తపరిచారు. గురువారం ఎంసీహెచ్‌ఆర్‌డీలో ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన జిల్లా కలెక్టర్లు, ఎస్పీల సదస్సులో సీఎం మాట్లాడారు.
గ్రామజ్యోతి ప్రజలదే
‘గ్రామ జ్యోతి అంటే గ్రామాలకు నిధులు కేటాయించడమే కాదు. ప్రతి పౌరుణ్ని చైతన్యపరిచి అభివృద్ధిలో భాగస్వాములను చేయాలి. ఎవరి ఇంటికోసం వాళ్లు ప్రణాళిక చేసుకున్నట్లుగా.. ఎవరి ఊరికి వారు ప్లాన్ చేసుకోవాలి. మొదటి దశలో ప్రజలంతా కలిసి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు కృషి చేయాలి. తమ గ్రామానికి ఏ సదుపాయం అత్యవసరమో ప్రజలే నిర్ణయించాలి.గ్రామ సభలు నిర్వహించి కార్యక్రమాలు రూపొందించాలి. చెత్త లేకుండా చేయడం.. ముళ్ల పొదలు తొలగించడం, రహదారులపై గుంతలు పూడ్చివేయటం, మంచినీటి ట్యాంకులు శుభ్రం చేయడం, పాత బావులు పూడ్చటం, చిన్నపాటి శ్రమదానంతో చేయాల్సిన పనులు ముందుగా చేపట్టాలి.
అధికారులకు గ్రామాల దత్తత
‘ప్రతి ముఖ్యమైన అధికారి ఒక గ్రామాన్ని దత్తత తీసుకోవాలి. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఒక్కో గ్రామం తీసుకోవాలి. మండలానికో అధికారి ఇన్‌ఛార్జిగా ఈ కార్యక్రమాలు సమన్వయం చేయాలి. ఇన్‌ఛార్జి అధ్వర్యంలోనే గ్రామసభ నిర్వహించాలి. ఎంపీల్యాడ్స్, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల నిధులు, జిల్లా పరిషత్, మండల పరిషత్, గ్రామ పంచాయతీల నిధులు.. ఇవన్నీ వచ్చినా గ్రామాల్లో చిన్న పనులు కూడా జరగడం లేదు.
పన్నులే కాదు.. ఆదాయం సంపాదించాలి
‘గ్రామ పంచాయతీలు పన్నులు వసూలు చేయడమే కాకుండా ఇతర ఆదాయం వనరులపై కూడా దృష్టి కేంద్రీకరించాలి. విలువైన భూములు వినియోగించడం ద్వారా, షాపింగ్ కాంప్లెక్స్‌లు నిర్మించడం ద్వారా, ప్రభుత్వ స్థలాల్లో అడ్వర్టైజ్‌మెంట్ల ద్వారా.. ఇతర మార్గాలు అన్వేషించుకోవాలి..’ అని మంత్రి కేటీఆర్ సదస్సులో తన ప్రసంగంలో సూచించారు.
ఆగస్టు 15న గ్రామజ్యోతి
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఆగస్టు 15న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు గ్రామజ్యోతి కార్యక్రమాన్ని ప్రకటిస్తారు. ఆగస్టు 17న ముఖ్యమంత్రి వరంగల్ జిల్లా గంగదేవిపల్లిలో గ్రామజ్యోతి ప్రారంభిస్తారు. అదే రోజున మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు ఎక్కడికక్కడ ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. ఆగస్టు 17 నుంచి 24 వరకు గ్రామజ్యోతి వారోత్సవం జరుగుతుంది. ప్రజలను చైతన్యపరిచేందుకు సాంస్కృతిక సారథి కళాబృందాలు గ్రామాలకు తరలివెళ్తాయి.